Facebook Twitter
డబ్బుల పర్సు గోల

డబ్బుల పర్సు గోల...!

 

 


బడిలో పిల్లలంతా కలిసి మ్యూజియం చూద్దామని వెళ్లారు.

ఆదివారం, ఉదయం పూట వాతావరణం అంతా చల్లగా, హాయిగా ఉంది.

మ్యూజియం బయట చక్కని పచ్చిక బయలు ఉంది. పిల్లలంతా అక్కడ కూర్చున్నారు, వరసలు వరసలుగా. వాళ్లతో పాటు వచ్చిన టీచర్లు కొందరు దగ్గర్లో నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కొందరేమో మ్యూజియం నిర్వాహకులతో మాట్లాడి టిక్కెట్లు తెచ్చేందుకు వెళ్లారు.


ఓ పిల్లాడికి కొంచెం నవ్వుకోవాలనిపించింది. 'ఏం చేద్దాం?' అని చుట్టూ చూశాడు. దగ్గర్లోనే సుధాకర్ సార్ నిలబడి ఉన్నారు; వేరే ఎవరితోనో మాట్లాడుతూన్నారు. ఆయన ప్యాంటు జేబులో ఓ పర్సు- సగం జేబులో ఉంది; మిగిలిన సగం బయటికి వచ్చి ఉంది.

వీడు ఓ కట్టెపుల్ల తీసుకొని, ఆ పర్సును పొడిచాడు, ఊరికే- పర్సు జారి క్రింద పడ్డది! పర్సు జారిపోవటాన్ని గమనించుకోలేదు సుధాకర్ సారు. తనలోకంలో తను ఉన్నారు.

పిల్లాడు ఒక క్షణం పాటు ఆ పర్సును 'సారుకిద్దామా?' అనుకున్నాడు- కానీ ఇవ్వలేదు. దాన్ని కొంచెం అటు ప్రక్కగా ఉన్న గుబురులోకి తోసాడు. ఆపైన ఏమీ తెలీనట్లు కూర్చున్నాడు.

ఓ పది నిముషాల తర్వాత సుధాకర్ సారు జేబులు తడుముకున్నారు. పర్సులేదు!

ఆ పర్సులో చాలానే డబ్బులుండాలి! వాటికంటే ముఖ్యం, ఆయనకున్న రకరకాల కార్డులు అన్నీ ఉండాలి! అవి లేకపోతే తను బస్సుకూడా ఎక్కలేడు!!

ముందు ఆయన అటూ ఇటూ వెతికి చూసాడు. ఆపైన తోటి టీచర్లను అడిగాడు. టీచర్లేమో పిల్లల్ని అడిగారు. చివరికి అందరు పిల్లలూ ఆ చుట్టుప్రక్కలంతా వెతకటంలో పడ్డారు. సుధాకర్ సార్‌కు చికాకు మొదలైంది. అరవటం మొదలెట్టారు.

అంతలోనే మ్యూజియంవాళ్లు తలుపులు తెరిచారు. కొందరు పిల్లలు అటుపరుగెత్తారు. టీచర్లంతా సుధాకర్ సారుకేసి చూసారు. పిల్లల్ని వెనక్కి రమ్మన్నారు.

సుధాకర్ సారేమో గంతులు వేస్తున్నారు -ఉన్నవాళ్లనీ లేనివాళ్లనీ కలిపి తిడుతూ శూన్యంలో వెతుకుతున్నారు. చుట్టూ ఉన్న పిల్లలు వణికిపోతున్నారు. టీచర్లంతా కంగారు పడుతున్నారు. "డబ్బులుపోతే పర్లేదు- కార్డులు పోయినాయే!' అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు "జాగ్రత్తగా ఉండొద్దూ!?" అంటున్నారు. అవి వింటున్నకొద్దీ మరింత రెచ్చిపోయారు సుధాకర్ సారు. "ఎవ్వరూ ఇక్కడి నుండి కదిలేది లేదు. నా పర్సు దొరకాలి! పిల్లలంతా లైనుగా నిలబడండి!” అని అరిచారు.

పర్సుని పొదలోకి నెట్టిన పిల్లాడికి ఇప్పుడు భయం మొదలైంది. "పొదలోనే ఉండాలిగా!? ఎవరికీ ఎందుకు దొరకలేదబ్బా?!" అని మెల్లగా అటువైపు చూసాడు- పొదలో పర్సు లేదు!! వాడికి ప్రాణాలు పోయినంత పనైంది. దాంతో మళ్ళీ అటుకేసి చూడకుండా వేరే దిక్కుకు పోయి, చప్పుడు చేయకుండా బిక్కముఖం పెట్టుకొని కూర్చున్నాడు.

కొద్దిసేపటికి అందరూ లేచి మ్యూజియంలోకి వెళ్లారు. కానీ ఏ ఒక్కరూ అక్కడి అపూర్వ వస్తువుల కేసి కొద్దిసేపైనా చూసిన పాపాన పోలేదు. సుధాకర్ సార్ అరుపులు, ఆక్రోశం, ఆవేశం అన్నీ ఐదారు గంటల పాటు కొనసాగాయి మరి!

సాయంత్రం కావస్తుండగా అంతా బయటికొచ్చారు. టీచర్లు, కొందరు పిల్లలు మళ్లీ ఓసారి అక్కడంతా వెతికారు. అంతకు ముందు ఎందుకు కనిపించలేదో గానీ, ఇప్పుడు అటు చూడగానే కనిపించింది- పొదలో దాక్కున్న పర్సు!

దాన్ని చూడగానే సుధాకర్ సారు ముఖం వెలిగింది. టీచర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల నవ్వులు మళ్ళీ కొంచెం కొంచెంగా వినిపించాయి. దీనికంతటికీ కారణమైన పిల్లాడు మాత్రం అందరికంటే గట్టిగా, అందరికంటే సంతోషంగా నవ్వాడు. కానీ ఇదంతా కొద్ది సేపే- ఇళ్ళకు చేరాలిగా, అందరూ ఊపిరి పీల్చుకొని బస్సెక్కేందుకు బయలుదేరారు.

మ్యూజియంలోని అరుదైన బొమ్మలు, పార్కులోని అందమైన పూలచెట్లు మటుకు ఆ రోజంతా తమని వీళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదని ఏడుపు ముఖం పెట్టాయి. 'డబ్బుల పర్సు ఎంతపని చేసింది!' అని కుళ్ళుకున్నాయి.