TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అవ్వ - మేక
రచన - గణేష్
ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక మేక ఉండేది. ఆ మేకను రోజూ మేతకు పిలుచుకు పోయేది. ఒక రోజున అవ్వకు జ్వరం వచ్చింది. అపుడు మేక అవ్వ దగ్గరకు వచ్చింది. "అవ్వా, అవ్వా! ఏమి ఆలోచిస్తున్నావు?" అని అడిగింది. అపుడు అవ్వ "ఏమీ లేదు మేకా, నాకు జ్వరం వచ్చింది; నిన్ను మేతకు ఎలా పిలుచుకుపోవాలి?" అన్నది. అప్పుడు మేక " ఏమీ ఒద్దులే అవ్వా, నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అని ఒక్కతే బయలుదేరింది.
అలా పోతూ పోతూ ఒక నక్క దగ్గరకు వెళ్లింది. అప్పుడు ఆ నక్క "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అని బెదిరించింది. "ఒద్దు నక్క బావా, నక్కబావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే" అన్నది మేక. నక్క "సరే" అని ఒప్పుకున్నది. "మళ్లీ రావాలి, తప్పకుండా" అని చెప్పి పంపింది అది.
తరువాత మేక నడుస్తూ నడుస్తూంటే ఒక తోడేలు ఎదురైంది. "నాకు ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అన్నది. "వద్దు తోడేలు బావా, తోడేలు బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే" అన్నది మేక. అపుడు ఆ తోడేలు సరే అని ఒప్పుకున్నది.
అపుడు మేక నడుస్తూ, నడుస్తూ ఒక పులి దగ్గరకు వెళ్ళింది. అపుడు పులి "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అని బెదిరించింది. అందరికీ చెప్పిన విధంగానే ఆ పులికి కూడా చెప్పింది. ఆ పులి కూడా "సరే తొందరగా వచ్చేయి, నాకు చాలా ఆకలివేస్తోంది." అన్నది.
అలా పోతూ పోతూ ఆ మేక ఒక సింహం దగ్గరకు వెళ్ళింది. "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అన్నది సింహం. అపుడు మేక " వద్దు సింహం బావా, వద్దు. ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అన్నది. సింహంకూడా ఒప్పుకున్నది.
అపుడు మేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనబడింది దానికి. ఆ మేక గుమ్మడికాయలోకి దూరి కూర్చున్నది. "దొర్లు దొర్లు గుమ్మడికాయ్; దొర్ల కుంటే దోసకాయ్" అని బయలు దేరింది.
అలా పోతూ పోతూ ఉంటే సింహం ఎదురౌతుంది. అపుడు సింహం " ఇటుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడి కాయ "లేదు లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు." అన్నది.
అలా పోతూ, ఉంటే పులి ఎదురైంది. అపుడు ఆ పులి " ఇటుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడి కాయ "లేదు, లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు." అన్నది. తరువాత "దొర్లు దొర్లు గుమ్మడికాయ దొర్ల కుంటే దోసకాయ్" అంటూ ఆ గుమ్మడికాయ తోడేలు దగ్గరకు వెళ్లింది. అపుడు ఆ తోడేలు " ఇటువైపుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడికాయ "లేదు, లేదు" అంటూనే దొర్లుకుంటూ నక్క దగ్గరకు పోయింది. అప్పుడు ఆ నక్క " ఇటుగా ఒక మేక పోయింది. నీకు ఏమైనా కనబడిందా." అన్నది. "లేదు లేదు" అంటూనే ఆ గుమ్మడి కాయ వేగంగా దొర్లుకుంటూ పోయింది.
కానీ నక్క చాలా తెలివి గలది కదా, " అరే! గుమ్మడికాయ ఎక్కడైనా మాట్లాడుతుందా" అనుకుని, ఒక రాయిని తెచ్చి గుమ్మడికాయకు అడ్డం పెట్టింది. ఆ దెబ్బకు గుమ్మడికాయ చీలి పగిలి పోయింది. అప్పుడు ఆ మేక చెంగున బయటకు దూకి, నక్కకు అందకుండా తప్పించుకొని ఉరికెత్తుకుంటూ అవ్వ దగ్గరకు చేరుకున్నది. "ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను.పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను." అని చెప్పింది సంతోషంగా.
కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో