Facebook Twitter
కరోనా..ఓ కరోనా

 

కరోనా..ఓ కరోనా
ఓ మహామ్మారి కరోనా..!!

బూచోడమ్మ బూచోడంటూ
బుల్లి వైరస్ చుట్టూరా చుట్టి
ఎక్కడి నుండో ఎగబాకి
ప్రపంచం ముంగిట్లో క్లబ్ డాన్స్ చేస్తుంది..
భరత నాట్యం..కథాకేళి..ఒడిస్సి
అన్నీ నర్తనాలు నీవే ఇపుడు..నీతోనే..!!

నిను తలవని రోజు ..
నిను పిలవని నోరు లేదు..
కలలో కూడ నీ నామ స్మరణమే..
పీడ కలలని రేపిన చీడ పురుగువి..
కనికట్టు చేసావో..కల్లోలమే రేపావో..
ఏం మాయ చేసావో..ఇన్ని హృదయాలను కూల్చేశావు..పాడు కరోనా..!!

మోముకు ముక్కెరెంత అందమో.. 
నాసికని ఏ గాలి సోకనివ్వక మాస్కుల్లో ముంచేసావు..
సున్నితమైన హస్తాలకు సానిటైజర్ ఇచ్చి రుద్ది రుద్ది బిగుసుకు పోయేలా చేసావు..
దూరం అయితే బంధాలు
దగ్గరవుతాయని సామాజిక దూరమనే కొత్త  రూల్ ని సృష్టించి ఓటు వేసావు..!!

న్యాయమా నీకిది..ఓ కరోనా..
బడులన్నీ బంద్ చేసి..గుడులన్నీ లాక్ చేసి
కాలం నీదని రెక్కలు విరిచేసి ఏ గూటి పక్షులను ఆ ఇంటి పంజరాల్లో బంధించావు.బంధాలకు అర్థం తెలిపావు..!!

ఎంతగా జీవితాలను చిత్తడి చేసావంటే
ఏ ఇత్తడితో నిన్ను కరిగించలేము..
పుత్తడి  కూడ దరిదాపుల్లోకి  తొంగిచూడదు..
భూత వైద్యానికో లొంగేదే అయితే మంత్ర తంత్రాలతో తరిమి కొట్టేవాళ్ళం..
మూఢ నమ్మకం అనుకుంటే క్షుద్రపూజలతో నీ పని పట్టే వాళ్ళం..!!
నువ్వు దగ్గుతో ..తుమ్ముతో నీ ఆటని నెట్టుకొస్తున్నావు..!!

మహిళా మణుల బాధ వర్ణనాతీతం
కొన్న చీర ..తెచ్చిన నగ.. కట్టడానికి లేక
పెట్టుకునే తీరిక లేక
ఇంట్లో పనిలో .. వంటింటి బిజీ లో రోజులు ఎంత భారంగా గడిచాయో..
తలిస్తే గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరుగెడుతున్నాయి..!!
లాక్ డౌన్లో  వీధంతా కాలిగా ఒక్కతే.. పిల్లలంతా నిద్రపోయాక ఆకాశం ఒంటరై పోయినట్టు..!!

దేవుడు ఎక్కడో లేడు వైద్యో నారాయణ హరి రూపంలో కనిపించాడు..!!
ప్రతి చెయ్యి అన్నం పెట్టే అన్నదాతయ్యాడు..
కన్న వారిని కోల్పోయిన క్షణాలలో మాత్రం
గుండెలన్నీ తడిసిన చెరువులయ్యాయి..

వ్యాక్సిన్ కోసం కళ్ళు కాయలు కాసేలా  కాపు కాసి తీరా దగ్గరి కొచ్చాక
అంతా సద్దుమణిగి అణిగి మణిగి ఉంటే
వీఐపీలా సెకండ్ వేవ్ అంటూ చెయ్యి ఊపుతుంది.!!

పాఠమే నేర్పిందో..గుణ పాఠమై జీవితాలను తాకిందో..
ఓ మనిషిగా నేర్చుకున్న జీవిత సత్యాల ముందు ఏ వైరస్ తాకదు..
కరోనా నిను తరిమే రోజు ముందుంది..
స్టే హోమ్...స్టే సేఫ్.. గెలుపు మాది ..
ఓటమి ఎప్పటికైనా నీదే.. కరోనాదే
జాగ్రత్త..ఓ మై కరోనా..

- స్వప్న మేకల