TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ముగ్గురు స్నేహితులు
రాము వెంకటేష్‌లు మంచి మిత్రులు. ఊళ్ళో అందరికీ వీళ్ళని చూస్తే ముచ్చటగా ఉండేది- ఒక్క గోపీకి తప్ప. గోపీకి వీళ్ళిద్దరినీ చూస్తే అసూయ. వీళ్లను విడదీయాలని పట్టుదలగా ఉండేవాడు.
ఒకసారి సెలవుల్లో రాము వెంకటేష్ ఇద్దరూ తిరుపతి వెళ్ళి వద్దామనుకున్నారు. వెంకటేష్ వాళ్ల అమ్మను అడిగితే 200 రూపాయలు మాత్రం సమకూరాయి. "అవి ప్రయాణానికి మాత్రం సరిపోతాయిరా, మిగతా ఖర్చులకు చాలవు. మరెలాగ?" అన్నాడు వాడు రాముతో. "నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులున్నాయిలేరా, మనిద్దరి ఖర్చులకూ సరిపోతాయి- పరవాలేదు వెళ్దాం" అన్నాడు రాము. ఎట్లాగైతేనేం ఇద్దరూ తిరుపతి వెళ్ళటానికి సిద్ధం అయ్యారు.
ఈ సంగతి తెలిసింది గోపికి. "ఇదే అవకాశం, వీళ్లిద్దరినీ విడదీసేందుకు" అనుకున్న గోపి వాళ్ల దగ్గరికి వచ్చి "నేను కూడా వస్తానురా, మీతో" అని అడిగాడు.
గోపీకి తామంటే నిజంగా ఇష్టం లేదని తెలుసు రాము, వెంకటేష్ లకు. వాడు తమ స్నేహాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడనీ తెలుసు. "అయినా వెంట వస్తానన్నవాడిని వద్దనేది ఎందుకు?" అనుకొని "సరేలేరా, నువ్వూ రా, వెళ్దాం" అన్నారు.
తిరుపతికి వెళ్ళే రైలు నాలుగు గంటలు ఆలస్యంగా ఉంది. "మనం బస్సులో వెళ్ళిపోదాంరా, రామూ. వెంకటేష్ ఒక్కడినీ రైల్లో రానివ్వు" మొదలుపెట్టాడు గోపి. వెంకటేష్, రాము ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. "వద్దులే, అందరం కలిసి రైల్లోనే వెళ్దాం. రైల్లో అయితే టిక్కెట్టు ఖర్చు తక్కువ" గట్టిగా జవాబిచ్చాడు రాము.
ముగ్గురూ మెల్లగా తిరుపతి చేరారు. కొండమీదికి వెళ్ళే బస్సు ఎప్పుడుందో కనుక్కునేందుకు వెళ్ళాడు రాము. గోపికేమో వీళ్లను కాలినడకన కొండ ఎక్కించాలని ఉంది. "అన్ని మెట్లు ఎక్కి వెళ్లేసరికి ఇద్దరూ అలిసిపోయి చికాకుగా ఉంటారు. అప్పుడు వీళ్లమధ్య గొడవలు సృష్టించటం సులభం" అనుకున్నాడు.
పైకి వాడు వెంకటేష్‌తో అన్నాడు "చూడురా, రాము దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్లున్నాయి. బస్సు ఎక్కి వస్తాడు. అది కూడా ఎప్పుడుందో ఏమో. మనం కాలినడకన చిన్నగా పోతూందాం పద" అని. "వద్దులే, కొంచెం ఆగు. వాడిని రానివ్వు" అని ఎంత చెప్పినా వినలేదు వాడు. "సరే, కానివ్వు" అని వెంకటేష్ గోపీతో కలిసి మెట్లు ఎక్కటం మొదలు పెట్టాడు.
రామూ వెనక్కి వచ్చి చూసుకునే సరికి అక్కడ గోపీ, వెంకటేష్ ఇద్దరూ లేరు! "ఓహో వీడు వెంకటేష్‌ని మెట్లు ఎక్కిస్తున్నాడన్నమాట" అనుకొని రాము కూడామెట్లదారిన వెనకగా నడవటం మొదలు పెట్టాడు.
కొన్ని మెట్లు ఎక్కారో లేదో, వెంకటేష్‌కు కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. అయినా వాడు "నేనెందుకు ఎక్కలేను? ఎక్కి చూపిస్తాను" అనుకొని తన కాళ్ళు నొప్పులు మరిచి పోయి ఎక్కటం మొదలు పెట్టాడు. అయితే ఇంకొన్ని మెట్లు ఎక్కేసరికి గోపికే కాళ్ళనొప్పులు పుట్టినై. వాడు అక్కడే నిలబడి పోయి, "ఒరే, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా, బస్సులో వెళ్దాం లేరా" అనటం మొదలు పెట్టాడు. "కుదరదురా, ఎట్లాగైనా సరే, మెట్లు ఎక్కాల్సిందే" అని బలవంతం చేశాడు వెంకటేష్. అంతలోనే వెనకనుండి వచ్చి చేరిన రాము కూడా "అవునవును. ఎక్కాల్సిందే" అని పట్టుపట్టి గోపీని నడిపించాడు. "ఇద్దరినీ విడగొడదాం" అని ఆశపడ్డ గోపీకి అదనంగా కాళ్లనొప్పులు వచ్చి పడ్డాయి!
కొండ ఎక్కాక, వెంకటేష్, రాము ఇద్దరూ స్నానానికి వెళ్ళిన సమయం చూసుకొని వాళ్ల బట్టల సంచీలో వెతికాడు గోపీ. తన చేతికందిన రెండు వందల రూపాయల్నీ తీసుకొని పారిపోయాడు! అయితే వీళ్ళిద్దరూ ముందుగానే వాళ్ల దగ్గరున్న మిగతా డబ్బుల్ని వెంట తీసుకెళ్ళారు కాబట్టి సరిపోయింది. "డబ్బులు ఊరికే దొంగ పాలయ్యాయి" అని బాధ పడుతున్న వెంకటేష్‌ని ఓదార్చాడు రాము. "మనల్ని విడగొట్టలేక వాడు ఇట్లా దొంగపని చేసి పారిపొయ్యాడు- అదీ మన మంచికేలే, ఏం పరవాలేదు" అని నచ్చజెప్పాడు.
ఇద్దరూ దైవదర్శనం చేసుకొని, రెండు రోజుల పాటు తిరుపతి చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ చూసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే, దారిలో ఏడుస్తూ కనబడ్డాడు గోపీ. ఇద్దరూ తమ కోపాన్ని మర్చిపోయి గోపీ దగ్గరకు వెళ్ళి "ఏమైందిరా, ఏం జరిగింది? మా డబ్బుల్ని ఎత్తుకొని పోయావుగా, ఇప్పుడేమైంది?" అని అడిగారు.
గోపీ భోరుమని ఏడ్చాడు- "నాకు తగిన శాస్తి జరిగిందిరా! మీ డబ్బులు ఎత్తుకెళ్ళి నేను అక్కడొక గాజు సామాన్ల దుకాణం ఎదుట నిలబడ్డాను. ఊరికే అక్కడున్న వస్తువుల్ని సవరిస్తూ ఉండగా ఒక వస్తువేదో జారి క్రిందపడి పగిలి పోయింది. అంతే, ఆ దుకాణం వాడు నామీద పడి, కొట్టి, నా దగ్గరున్న డబ్బులు మొత్తం లాక్కున్నాడు. తినేందుకు, ప్రయాణానికి- ఒక్క పైసా కూడా మిగల్లేదు నా దగ్గర! రెండు రోజులుగా నాది ఇదే గతి!" అని ఏడ్చాడు వాడు.
"నువ్వు మమ్మల్ని మోసం చేసి డబ్బు తీసుకొని పోయినందుకు బాగా జరిగిందిరా" అన్నాడు వెంకటేష్ కోపంగా.
"నువ్వు ఊరుకోరా, వెంకటేష్ ! వీడు ఎంతైనా మన స్నేహితుడేగా, సర్దుకు పోదాం" అంటూ వెంకటేష్‌ను ఆపాడు రాము.
గోపి వాళ్ళిద్దరి మంచితనాన్నీ అర్థం చేసుకున్నాడు. చెడ్డ అలవాట్లను మానుకున్నాడు. కాలక్రమేణా అతనూ వాళ్ల స్నేహితుడయ్యాడు.
Courtesy..
kottapalli.in