నా దేశం
నా దేశమంటే నా కెంతో ఇష్టం
నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం.
ఎత్తైన శిఖరాలూ, ఎదకదిలించే
గుడి గోపురాలూ
సెలయేళ్ళ గల గలలూ, ఓంకార నాదాలూ
ఆకుపచ్చని చేళ్ళు, ఆమని చందాలు
అందానికి ప్రతిబింబం నా దేశం
నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం
విరగబూసిన పూలు నక్షత్రాల తీరు
కన్నుల పండుగజేస్తూ
ఘుమ ఘుమలు వెదజల్లుతూ
మామిళ్ళూ నేరేళ్ళు, జామి, పనసపళ్ళూ
నవధాన్యాలూ నాయింట పండిస్తూ
నందవవనాన్ని మించుతుంది నా దేశం
నన్ను కాపాడే రక్షా కవచం నా దేశం.
రంగు రంగుల రాళ్ళకీ , రతనాల గూళ్ళకి
కోహినూరు వజ్రాలకీ, కోరుకున్న ముత్యాలకి
వెండి బంగారాలకీ, వెలలేని సంపదలకీ
నిలయం నాదేశం
నన్ను రక్షించే ఆలయం నా దేశం
పట్టు చీరల కాంతులు, పడతుల వయ్యారాలూ
నవతకు ప్రతిరూపాలూ , ప్రగతికి కరదీపాలూ
నాట్యాల ఖని, సంగీతాల దుని నా దేశం
నిత్యవైభోగానికి నిదర్శనం నా దేశం
వేరు వేరు భాషలెన్నో పలికిస్తూ
ప్రతి భాషలో పండితులను సృష్టిస్తూ
ఐకమత్యంతో అందరినీ లాలిస్తూ
నన్ను మురిపించే న ఆదేశం నా కెంతో ఇష్టం.
నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం.
లలిత కళలకు నిలయం నా దేశం!
సకల శాస్త్రాలకు ఆధారం నా దేశం!
పంచశీల పుట్టింది ఈ చోట
ప్రణాళికలు వెలిశాయి ఈనాట
సమతా మమతల సాగరం నా దేశం!
సకల సౌభాగ్యాల నిలయం నా దేశం!
నా దేశం కలకాలం కళకళలాడుతూ వుండాలనీ
సమసమాజాన్ని సృష్టించి, నవత పండించాలనీ
ఎన్నో పధకాలను రూపొందించింది,
ఆర్ధికంగా , సాఘికంగా , రాజకీయంగా , నైతికంగా
తలెత్తుకు నిలిచేలా నిరంతరం, కృషి చేస్తోంది!
అటువంటి నా దేశం అందంగా వుండాలనీ
జనంతో కిటకిటలాడుతూ,
కూటికి నీటికి బాధపడకూడదనీ
కుటుంబ సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ వుంది
చిన్నకుటుంబాలను కోరుకుంటూ వుంది
అందుకే నాకు నా దేశ మంటే ఎంతో ఇష్టం
నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం.
నా దేశం ఆదేశాన్ని అందుకోవడమే నా లక్ష్యం
అర్ధిస్తున్నాను మిన్నల్ని అహర్నిశం
కుటుంబ సంక్షేమాన్ని కోరుకొమ్మని
నా దేశాన్ని రక్షించమనీ.
నా దేశమంటే నాకెంతో ఇష్టం
నన్ను కాపాడే రక్షాకవచం నా దేశం.
- శ్రీమతి శారద అశోకవర్ధన్
