Facebook Twitter
విరహ గీతం!

విరహ గీతం!

కృష్ణపక్షపు కడపటి నిశిరాతిరిలా
మనస్సాకాశమంతా చీకటావరించి
అవలోకనకే చిట్టణువగపడక
దిశనెరగక తిరుగు దిమ్మరి నీరదమౌదు!

ఎగుభుజలతలనొదిగి సేదదీరాలనోరేడా
మదగజగమనా మందహాసా మానసందోచేవని
విదియచందురునొసల మరుని విరివిల్లుతీరుతో
చిరుతప్రాయపు చూపుల విరిశరముల గుచ్చేవనిజూతు!

అంతరంగసీమల్లాడు పరితోషమొందక
కొదమసింగపు నడుము విభుని జతగూడక
కుసుమశరునికే మరులుగొల్పు మనోహరా
స్వప్నదర్శనభాగ్యమేనా ప్రత్యక్షమై నన్నేలుకోవా!

ఇదిందిరనై సంఫుల్ల మందారాల
కిసలయ మేదుర చాంపేయాల గ్రోలబోదు!
మధుమాసపు చలాచల కలకంఠినై
మరునిబంటై మావిపూల గుత్తులపై వ్రాలబోదు!

దివారాత్రాలు పాంథుడై సంచరించుతూ
హేమంత ప్రాభాత సంధ్యల్లో
నీహారలేశమై సకలాణువలతోగూడి
పరిష్వంగమొనరించబోదు సఖీ నినుగలవ!

శుక్లపక్షపు చంద్రబింబోన్నతిలా
విరహమతిశయించునే మధురమనోహరలతాంతా
దోబూచులాడుతూ తిరుగేవు తలిరబోణీ
మనస్దర్పణంమంతా తరిచిజూసేను పట్టగా!

శరద్రాత్రుల చంద్రికల గిచ్చుళ్ళు
మేని సౌగంధిక తెమ్మర్ల దండయాత్రలు
మృగనయనీ వాడిచూపుల వలపుపోట్లు
ఎందుంటివో నేనోపలేనిక కుసుమాస్త్రునిపోరిక!

ఓ ఇందువదనా కుందరదనా
నీ అనుస్మరణల అందోళికలొనూరేగుతున్నా
ప్రాణనాథుని కరుణించి జతగూడి
మనసిజుని తూపుల తాకిడిని శమింపజేయవా!

ఇదీ శ్రీ రాధామాధవుల మిథున ప్రణయం
ప్రకృతీ పురుషుల ప్రేమసల్లాపం
ప్రియుడూ ప్రియురాలూ అన్నీ తానై
అద్భుతం అమేయం అనంతం అజరామరం!

- రవి కిషోర్ పెంట్రాల