గమన నిర్దేశం

వర్ణాలు వెలిసి
నిర్జీవమైనను
కూచిక గొంతెత్తి
గర్జంచేను వర్ణాలపై
ఇలా... !!
శ్వేత పన్నా దరి చేరి
మిళితం అవుదామని !!
దృశ్యం
సౌందర్యోపాసకునిపై
నిరసన గళమెత్తింది...
నీ ఊహకు రూపం ఇవ్వమని !!
సేదతీరినను బద్దకంగా
ఒరిగిన తిమిరము
ఉదయించిన భానునిపై
చిటపటలాడెను...
భాసము తనను
సమూలంగా ఆక్రమించిందని !!
చేతగాని తనంతో
కాలాన్ని విధిరాతకు వదలకు
నీలో తిష్ట వేసుకుని కూర్చున్న
బద్ధకానికి బుద్ధి చెప్పి ...
ఒలికిన కాలం
బొట్టు బొట్టుగా
రాల్చిన అనుభవాలను
వూతం చేసుకొని
సాగే పయనమే
నీ జీవనం కావాలి !!
కవిత రాయల



