Facebook Twitter
చీలిక

కొమ్మ నుండి ఆకులు రాలిపోయినట్టు
మేఘాల నుండి నీరు జారిపోయినట్టు
కన్నుల నుండి చూపులు చెదిరిపోయినట్టు
నా నుండి మనుషులు విరిగిపోతున్నారు

అప్పుడప్పుడు
పెదాలపై ఎంగిలిని అద్దుకుంటూ
నాలుగు మాటలు చెరుగుతారు
ఆ మాటలన్నీ చితిపై పేర్చిన పిడకలే

తల్లి కోడి
తన రెక్కలను భూమిపై పరిచి
వివక్షా గీతాలను నిసిగ్గుగా ఆలపిస్తుంది
సమానత్వం లేని తల్లి
ముల్లుల హారమే

ఆవిరైపోయే కాలం కింద
పువ్వులను తోడుకుంటూ
కొండకు, కొండ కింద అక్షరాల తోటకు
మంట పెట్టావు…

నువ్వు ఆగింది
మొదటి శుక్రవారానికి కావచ్చు
నేను రాసింది…
అగ్గి సత్యాలను, అనంత లోయలను
కొమ్మ విరిగిన చప్పుడు
అదీ…


నా మనసే ఏమో! 

 

- లై