Facebook Twitter
మా చిన్ననాటి భోగి!

మా చిన్ననాటి భోగి! 

జంగమదేవర శంఖపు రవళులు
శంభోశంకర నాదంతో ఊరంతా..
అంబ పలుకు జగదంబ పలుకు 
వాక్కులతో బుడబుక్కల ఢమఢమలు
భోగి వేకువజాముకు వేకువకాగ!

చెరువుకు నీళ్ళకి నాన్న కావిడితో
మావూరి చెరువేమో తెలిమంచు కప్పుకొని
సూరీడికేదో కబురివ్వాలని రాయబారి
శీకరపు దొంతరతో మంతనాలు
ఎంతకీ ఒగదెగవవి ప్రభాతమంతా!

తోటిపిల్లలతో దార్లన్నీ తిరిగి ప్రోగేసుకున్న
వరికర్రలో తుమ్మ పత్తి వేపపుల్లలో
అమ్మ వంటకి దాచిన వంటచెరుకో
అన్నిటితో బోగిమంటకు తయ్యారు!

అత్తయ్య మామయ్య తాతయ్య నానమ్మలు
ఎడారిలో అరబ్బీషేకుల్లా ఒళ్ళంతా రగ్గులతో
తలపాగా కట్టుకొని చెవులచుట్టూ చలికి..
నాన్న తోబుట్టులు నీళ్ళ బిందెలతో హాజరు
అమ్మ తోడుకోడళ్ళతో వంటలింకా తెమలక!

రంగవల్లులు అల్లాలని తొందరలో అక్కావదిన
గొబ్బెమ్మలు బంతిపూల ఏర్పాట్లలో చెల్లీమరదలు
పిన్నీబాబాయి అగ్నిదేవుని ప్రార్ధనజేసి నెయ్యివేసి 
బోగిమంట రాజేస్తే బందుగణమంతా చుట్టూ!

మేమంతా బోగిమంటన చలిగాచుకుంటుంటే
క్రొత్తధాన్యపు బస్తాలబండ్లతో ఇల్లకు కొందరు
దారంతా రంగుల మ్రుగ్గులు పెడుతూ ఇల్లాల్లు
అయ్యవారికి దండంబెట్టంటు గంగిరెద్దులోళ్ళూ!

కాటికాపరొస్తే మాత్రం ఏ పురి చాటునో దాక్కునేది 
చటుక్కున ఎక్కడ నుంచి ఏం తీస్తానంటాడొనని..
ఊరంతా సందడే! అన్ని మూలలా రంగవల్లులు!
హరిదాసులు శ్రీ మద్రమణ గోవిందో హరంటూ..
బావలు పిట్టల దొరలా కధలు చెబుతుంటె
సినిమా కథలకి పనికొస్తాయని నవ్వుతూ మేము!

భోగిమంటన హవిస్సులు ఎంత సమర్పించాలో
ఎప్పుడు మంటనిప్పులు కదపాలో అణచాలొ
చుట్టూజేరి జాగ్రత్తలుజెప్పు పెద్దలజూస్తే
జీవనగమనంలో సుఖదుఖాల్లో ఎల్లప్పుడూ
మీ వెంటమేమని అగ్నిసాక్షిగా భరోసానిచ్చు
నా  వారిగా తృప్తిగా రేపటి సంక్రాతికి ఎదురుజూస్తూ!

--రవి కిషోర్ పెంట్రాల