Facebook Twitter
ఎవరికి వారే యమునా తీరే

 
ఆకలి ఓ రోకలి పోటు
పస్తు ఈ బ్రతుకుకి శిస్తు
అన్నమో రామచంద్రా అని అన్నా
అన్నం పరబ్రహ్మం అని విన్నా
పుట్టల్లో కడవల కొద్దీ పాలు
చెత్తబుట్టల్లో బడుగుల ఆనవాళ్ళు
అప్పుల ఊబిలో కర్షకులు
తిప్పల నాభిలో కార్మికులు
డొక్కనంటిన కడుపులు
దిక్కుతోచని గడపలు
ఆర్తులకు పంచడంలోనే
ఆనందముందని చాటెను నాటి జీవనం
ఆస్తులను పెంచుకోవడంతోనే
సరిపోతుంది నేటి జీవితం
దేశ ఆపాదమస్తకం
నీతుల కంటే కోతలే ఎక్కువ
చేతలు ఎవరికెరుక.!
ఎవరికి వారే యమునా తీరే గనుక.!!

 

రచన : వెంకు సనాతని