TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
రాము భయం
రచన: నారాయణ
రాముకు భయం ఎక్కువ. ఊళ్లో అంతా పిరికి రాము అని పిలుస్తారు వాడిని. అలాగని వాడు సోమరిపోతేమీ కాదు. పిల్లవాడైనా కూడా పదిమందికి సాయం చేసే మనస్సుంది వాడికి. వాళ్లమ్మ చెప్పేది చాలా సార్లు- " ఒరే, రామూ, ఈ ఒక్క పిరికి తనాన్నీ వదిలించుకోరా, నువ్వు జీవితంలో ఎలా బ్రతుకు తావో నన్న చింత లేకుండా చచ్చిపోతాను." అని. ఆమెకు ఏదో వింత జబ్బు , రాను రాను బలహీనం అయిపోతోంది.
తల్లి మాటలకు రాము రోషపడేవాడు. ఆ క్షణంలో గట్టిగా అనుకొనేవాడు. "నేను పిరికి తనాన్ని వదిలించు కుంటాను " అని. కానీ మళ్ళీ పరిస్ధితి యధా ప్రకారం ఉండేది. వాడికి నీళ్ళంటే భయం, నిప్పంటే భయం, ఎత్తైన ప్రదేశంమంటే భయం, లోయలంటే భయం, కొత్తవ్యక్తులంటే భయం, తెలీని ఊళ్ళంటే భయం, కరెంటు అంటే భయం, టీచర్లంటే భయం, ఈ భయం ఒక్కసారి వచ్చిందంటే అతను ఇంకేమీ చెయ్యలేక పోయేవాడు - వణుక్కుంటూ ఒక మూల కూర్చొనాల్సిందే.
"ఊరికి కొత్తగా ఒక స్వాముల వారు వచ్చారు . అందరి కష్టాలు తీరుస్తున్నారు. మీ వాడినోసారి చూపెట్టరాదూ, ఈ మాయదారి భయం పోతుందేమో " అని ఇరుగూ-పొరుగూ అంటే, తల్లి లేని బలం తెచ్చుకొని, వాడిని తీసుకొని బయలు దేరింది. స్వాముల వారు గొప్పయోగల్లే ఉంది. ఒక వైపున శిష్యుడు వచ్చిన భక్తుల్ని వరుసగా నిలబెడుతుంటే, ఆయన ఒక్కొక్కరిని పిలిచి, విభూతిని ఇస్తున్నాడు- మంత్రించి.
రాము వాళ్లమ్మ ఏదో చెప్పబోతే, స్వామి వారించాడు. " నీకోసం, నీకొడుకు కోసం వచ్చావుకదూ తల్లీ, నాకంతా తెలుసు! " అన్నాడు. కొత్త వ్యక్తిని చూసిన భయంతో అప్పటికే రాముకు తల తిరుగుతోంది. కాళ్లు వణుకుతున్నాయి. " రోజూ తిప్పతీగ కషాయంతో ఈ విభూది చిటికెడు వేసుకొని తాగండి. మీకు మేలు కలుగుతుంది." ఆశీర్వదించాడు స్వామి.
స్వామి పొమ్మనే సరికి రాముకు ప్రాణం లేచి వచ్చింది. వాడు గబగబా నడిచాడు ఉత్సహంగా. అయితే రెండు అడుగులు వేశాడో లేదో, మళ్ళీ పిలిచాడు స్వామి- " నేనిక్కడ ఐదు రోజులు వుంటాను. నువ్వు రోజూ వచ్చి నాలుగు గంటల పాటు నాపక్కన కూర్చోవాలి. అలా అయితేనే మీకు మేలు కల్గేది మరి-" అన్నాడు. వాడు కంగారుగా నోరు విప్పే లోపల వాళ్ళమ్మ " మీరెలా చెప్తే అలాగే స్వామీ, నాలుగు గంటలు ఏం ఖర్మ, రోజంతా మీతోటే ఉండమని పంపుతాను" అన్నది.
అలా రాముకు కష్టకాలం మొదలైంది. స్వామి ప్రక్కన కూర్చుంటే వణుకు మొదలయ్యేది. అందరూ వచ్చి చూస్తుంటే కంపరంగా ఉండేది. అయితే మొదటి రోజు సాయంత్రం కల్లా వాడికి స్వామి పని నచ్చటం మొదలైంది. ఎవరెవరో వస్తారు; తమ కష్టాలు చెప్పుకుంటారు. స్వామి వాళ్లకు ధైర్యం చెప్పేదేమీ లేదు. కొంచెం విభూది ఇస్తాడు- "మేలు జరుగుతుంది" అంటాడు. ఆ మాత్రం పని తనూ చెయ్య గలడు! ఈ ఆలోచన వాడికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందువల్ల వాడు మర్నాడు తల్లి చెప్పే ముందుగానే తయారై, స్వాముల వారి దగ్గరికి బయల్దేరాడు. ఈ రోజున వాడు- వచ్చిన వాళ్ళు ఏం గోడు వెళ్ళబోసుకుంటూ విన్నాడు. వినడం అంటే భయం లేదు కదా, తనకు! అందరికీ ఏవేవో రోగాలున్నై, బాధలున్నై, కష్టాలున్నై. అలాంటివేవీ లేని వాళ్ళు లేనే లేరు! స్వామి ముందు అందరూ చిన్నపిల్లలైపోతున్నారు. అందరూ తనలాంటివాళ్ళే. తనకే కాదు, భయాలున్నది, వచ్చే వాళ్లలో సగం మంది ఏదో ఒక భయంతోటే వస్తున్నారు. తనకి భయం అంటే భయం, కానీ- వీళ్ళకుండే భయాలు చాలా మామూలువి. అవంటే తను అస్సలు భయపడనక్కర్లేదు!
మూడో రోజున వాడు వెళ్ళేసరికి ధనిక వ్యాపారొకడు వచ్చి ఉన్నాడు. స్వామి రామును పిలిచి "నువ్వీ రోజున ధనికుడితో తిరిగి, వచ్చి ఏమేం చేశాడో చెప్పు- సాయత్రం కల్లా" అన్నాడు. ఇప్పుడు రాముకు ఆ వ్యాపారంటే భయం వేయలేదు. వ్యాపారితో పాటు ప్రక్క ఊరికి కారులో వెళ్తే అంతా సుఖంగా ఉంది. తనకు వ్యాపారి మంచి భోజనం పెట్టాడు; తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అవి వింటూంటే రాముకు మనసులో నవ్వొచ్చింది. వ్యాపారికి- దొంగలంటే భయం, నష్టాలంటే భయం, డబ్బులు వెనక్కి వస్తాయో రావోనని భయం, వ్యాపారి సేవకులకు వ్యాపారి అంటే భయం, వ్యాపారి పిల్లలకూ, భార్యకూ కూడా భయాలే! వాళ్ళకున్న భయాలేవీ తనకు లేవు. తనే నయం వాళ్ల కంటే! వెనక్కి తిరిగి వచ్చిన రాము స్వామికి అంతా నివేదించి, చీకట్లోనే ఒంటరిగా నడుచుకొని ఇంటికి వెళ్ళాడు. వాడికిప్పుడు చీకటంటే భయం వెయ్యలేదు!
నాలుగో రోజున రామును అడవిలో కట్టెలు కొట్టేవాని వెంట పంపాడు స్వామి. రంగడు పన్నేండేళ్ళగా అడవిలో తిరిగి, ఎండిన కట్టెలు కొడుతున్నాడు. నిన్నటి రోజున భార్యకు జ్వరం వస్తే, స్వామి మందు చెబుతాడని వచ్చాడు. తనకేమీ భయాలున్నట్లు లేదు. "అడవిలో తిరుగుతుంటే భయం వెయ్యదా?" అన్నాడు రాము. "భయమెందుకు, పన్నెండేళ్ళుగా తిరుగుతున్నాను- నాకేమైంది? ఏం కాదు! అన్నాడు రంగడు. "మరి, పాములు- అవీ...." అన్నాడు రాము భయం భయంగా. "చూడు, పాములైనా, పులులైనా మనం వాటిని ఏమీ చెయ్యకపోతే అవీ మనల్ని ఏమీ అనవు. అయితే కొన్ని విద్యలు నేర్చుకుంటే, కొంచెం తెలుసుకుంటే, మన జాగ్రత్తలో మనం ఉండవచ్చు. మనం వాటిని ఏమీ చెయ్యగూడదు, గుర్తుపెట్టుకో." రంగడు ఆరోజున వాడికి పాములు పట్టటం నేర్పాడు- "అవి గూడా పాపం, నోరులేని జీవాలే కదా; వాటి భయాలు వాటికుంటాయి" అన్నాడు. పాము కాటుకు ఉపయోగపడే మొక్కల్ని కొన్నిటిని చూపాడు. కట్టెలు కొట్టేటప్పుడు చెట్లు జాగ్రత్తగా ఎలా ఎక్కాలో నేర్పాడు. "కళ్ళు తిరిగి పడిపోతేనో ?" -అడుగుదామనుకున్నాడు రాము. కానీ చిత్రం! ఆ రోజున చెట్టు పైకెక్కినా తనకు కళ్ళు తిరగలేదు! అడవిలోంచి పోతున్నప్పుడు దూరంగా, కొండకింద పులి ఒకటి పోతూ కనబడింది. మెల్లగా నడుచుకుంటూ దాని దారిన అది వెళ్లి పోయింది. "అడవిలో తిరిగేటప్పుడు కాళ్ళకు చెప్పులూ, చేతిలో కర్రా ఉంటే అసలిక భయపడక్కర్లేదు." అని రంగడంటే రాముకు ’నిజమే’ననిపించింది.
మరునాడు స్వామి ప్రక్కన కూర్చున్నప్పుడు రాముకు తన భయం ఇక గుర్తుకు రాలేదు. స్వామి నుండి శలవు తీసుకొన్న రాము, రంగని తో కలసి అడవంతా కలయదిరిగినా, బళ్ళో చేరినా, చీకట్లో తిరిగినా, ఇక భయమంటూ వెయ్యలేదు. భయం భయపడ్డట్లుంది, వాడి దగ్గరికి రాలేదిక! వాడిలో మార్పును చూసి తల్లి స్వామికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది.
Courtesy..
kottapalli.in