ప్రేమమాయ౦ - సోమంచి ఉషారాణి

ప్రేమమాయ౦ - సోమంచి ఉషారాణి     ప్రేమిస్తే జగమంతా ప్రేమమయం పెళ్ళయితే అదేమిటో ప్రేమమాయం   ప్రేమించినపుడు పొంగిపొరలే ప్రేమ పెళ్ళయితే కనబడదు దాని చిరునామా!   ప్రేమించినపుడు చిరునవ్వు రువ్వితే చాలు మరచిపోతామంటారు ముల్లోకాలు పెళ్ళయితే 'ఎవడ్ని చూసి నవ్వుతున్నావు? దవడ పేలిపోతుందంటారు!'   ప్రేమమైకంలో అరచేయి తగిలితే చాలు అమరసుఖాల తేలుతారు   పెళ్ళయితే ఏమిటలా మీదపడతావు సానిలా పవిట సరిచేసుకోమంటారు సంసారిలా!   ప్రేమ మత్తులో నిషాచూపుల హుషారులో విషమిచ్చినా అమృతతుల్యం   పెళ్ళయితే కషాయంలా తగలడిందేం కాఫీ? నషాళాని కంటిందే దరిద్రపు ముఖమంటారు   ప్రేమ మజాలో పలుకే బంగారమాయె వేలకు వేలు కట్నమెందుకంటారు   పెళ్లి కాగానే లక్షల కట్నం తెలీదని సలక్షణంగా తగలెడతారదేమిటో!

మౌనవేదం - సామర్ల లక్ష్మి రాజ్

మౌనవేదం   - సామర్ల లక్ష్మి రాజ్   నీ సమక్షంలో నన్ను నేను మరచి..... నీ విరహంలో నా వునికినే కోల్పోయి...... తీసే ప్రతి శ్వాసా..... వేసే ప్రతి అడుగు.....     నా అణువణువు నిండుగా నిండిపోయి...... ప్రతిక్షణం నీకై అలమటించి ఎదురు తెన్నులు చూస్తున్న నేను..... ఇది ప్రేమని నేను..... కాదు! భ్రమ అని నువ్వు......   పెదవి విరిచి నన్ను తృణీకరించి మాయమైపోయావు. నీ జ్ఞాపకాలను దొంతర్లుగా పేర్చి...... మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తం చేసి.... నన్ను నేను సంభాళించుకుని.......   మరొకరి చేయి అందుకున్న వేళ...... ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమై...... నువ్వేకావాలి అంటూ పరితపిస్తే.... అప్పుడు చూడని నీ కళ్ళల్లో.....   ఇప్పుడు తళుక్కుమంది ఆ ప్రేమ!! ప్రియతమా! ఇది గుర్తుంచుకో- ఒకప్పుడు నీ ప్రియురాలినే అయినా- నేడు నేను మరొకరి ఇల్లాలిని!!   అందుకే నీ ప్రశ్నకు.... మౌనమే నా సమాధానం!!

నాడు _ నేడు - సోమంచి ఉషారాణి

నాడు _ నేడు   సోమంచి ఉషారాణి   స్వాతంత్ర్య పోరాటంలో తమ రక్తం చిందించారు నాడు! స్వతపదం వ్యామోహంలో ఇతరుల రక్తం చిందిస్తున్నారు నేడు!   దేశం కోసం లేశమైనా చింతించక సర్వస్వం ధారపోశారు నాడు! దేశాన్ని దోచుకుంటూ అప్పుల్లో ముంచుతున్నారు నేడు!   ప్రతీ నాయకుడు ప్రభంజనంలా విదేశీయుల్ని తరిమి తరిమి కొట్టారు నాడు!   ప్రతినాయకుడూ 'ప్రతినాయకుడై' విదేశీయుల్ని ఆశ్రయిస్తున్నారు నేడు!   'స్వాతంత్య్రమే నా జన్మ హక్క'ని నిస్వార్ధంగా పోరాడారు నాడు! గూండాయిజమే తమ జన్మహక్కని స్వార్ధంతో హింసిస్తున్నారు నేడు! ప్రణాళికలతో ప్రామాణికంగా దేశాభివృద్దికి పాటుపడ్డారు నాడు!   నానారకాల స్కాంలతో నానాగాడ్డీ కరచి దేశాన్ని అధోగతి పాల్జేస్తున్నారు నేడు!   'దేశానికి నేనేం చేయగలను?'అని విశాల హృదయంతో యోచించారు నాడు!   'దేశం ఏమైపోతే నాకేం'అంటూ విదేశీ ఖాతాలు పెంచుకుంటున్నారు నేడు!   తుపాకీ తూటాలకీ, లాఠీదెబ్బలకీ వెరవక కటిక చీకటి కటకటాలలో మ్రగ్గారు నాడు!   గన్ మాన్ లతో, పోలీసుల అండదండలతో ఏ.సీ జైళ్ళలోంచే నిశ్చింతగా పాలిస్తున్నారు నేడు!   నేడు నాడయే దెప్పుడో? నాడు నేడయ్యే దెన్నడో?    

తెగిన వీణ - చిమ్మపూడి శ్రీ రామమూర్తి

తెగిన వీణ   చిమ్మపూడి శ్రీ రామమూర్తి   అప్పుడు.. పచ్చిమట్టి వాసనలు పైరునుంచి పారేవి గాలి వేణువై హంసల మువ్వలను అందించేది ఇంటిచూరు నుంచి ఆత్మీయత, ఆప్యాయత చినుకులై రాలేవి ఉదయాలకు హృదయాలకుగల అనుబంధాలకు చిక్కబడేవి   ఊపిర్లు విత్తనాలై నేలలో నాటబడేవి నాఊళ్లో సెలయేళ్ళు నాట్యమాడేవి మరి, యీప్పుడు మూసుకుపోయిన మనవ సంబందధాల రహదారులు మనుసులు కరువు కాటిపైన కాలుతున్న వాసన గుడిసెల్లో ఇంకా మొలుస్తున్న వెలిముద్రాల పుట్టగొడుగులు మృత్యు గీతవైపోతున్నమడి గట్లు అరంగుళం పురుగునొదిలి ఆరడుగుల రైతు నారగిస్తున్న కల్తీ మందులు అడుగడుగునా పోస్ట్ మార్టమయి పోతున్న పచ్చదనం, మన బ్రతుకులని ఇంద్రదనస్సులు చేసేందుకు పొలాల్లో నాట్లు వేస్తున్న ఇంద్రధనస్సులు, ఆనంద భాష్పాలు రాల్చలేక తుప్పుపట్టి పోతున్న నెలవంక కొడవళ్ళు శవమైన కామందు తల దగ్గర దీపం వత్తినైనా కలేకపోయానని బావురుమంటున్న ప్రత్తి పువ్వులు మళ్ళలోకి వచ్చే నీళ్ళు, లాగేస్తున్న్ కళ్ళు, చానల్సు ముందు కుప్పలు కుప్పలుగా ఫీనుగు నవ్వులు కలనుంచి కల వరకు నీరంతరం ప్రవహించే నెత్తుటి గాయాలు ఇప్పుడు నావూరు ఓ"వాడిపోయిన పాట!".    

మేఘసందేశం - సి.రామ్మోహన్

"మేఘసందేశం"   - సిరామ్మోహన్   అనూష పవనాలు అలవోకగా కదులుతు వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటు వెళ్ళిపోగానే, శశికాంతుడు చిర్నగవుతో నిశికాంతను కలుసుకొన్న వేళ..........   ఆగి ఆగి కదులుతున్న మేఘమాలను దీనంగా వేడుకుని పంపిస్తున్నా ప్రియా నీ కోసం ఈ "మేఘసందేశం",   నే పంపిన సందేశం మేఘాల నుండి వానచినుకుగామారి దివి నుండి జాలువారి నీ నడిపాపిట సింధూరంగా మారి నొసటిని సృషిస్తు, కనురెప్పలని పలుకరిస్తూ నీ అధరామృతాలని గ్రోలి, గళంపైన స-రి-గ-మ-లతో సంగీతం పలికిస్తు నీ గుండె గుడిలో ఇంకిపోయి వినిపించలేదా సఖీ! నా "మేఘసందేశం,"?   వినిపిస్తే ఆలస్యం చేయక ప్రత్యూష పవనంలా వచ్చి నా ఎదహృదిలో దీపాన్ని వెలిగించు, నా గుండెపై స్వాతి జల్లు కురిపించు చెలీ!

స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త - చిల్లర భవానీదేవి

స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త!   -చిల్లర భవానీదేవి     ప్రేమ ఎవర్ గ్రీన్ సబ్జక్ట్ అయినా పెళ్లి నేటి గిరాకీ వ్యాపారం   స్క్రీన్ మీద ప్రసారిత స్వప్నాలనిండా ఎమోషన్లూ ....ఎక్స్ ప్రెషన్లే! పెళ్ళి తర్వత రంగుమార్చే ప్రేమకథలే!   ఇప్పుడు పెళ్ళంటే ఎమోషనల్ సెక్యూరిటీనీ కన్నీటికిభద్రమైన దిండునూ వెతుక్కోవటమే!   మనసులు శరీరాలు ఆశలు అలసిపోయిన నిస్తేజంలో నిలువెల్లా కుదిపేస్తున్న మానవవిషాదంలో జీవితనేస్తం మనసుకు ఆకాశమంత దూరమైతే నమ్మకం లేని అదృష్టాన్నే నమ్ముకోవాలా?   ఆనాడు అదొక పవిత్రబంధం మరునాడు అదొక భద్రతా కవచం   నిన్ననొక కట్నాల కొలిమి జూదం నేడు ఒక స్పాన్సర్డ్ ఎపిసోడ్   మార్కెంటింగ్ ను పెంచే ప్రతి ముద్దునూ స్పాన్సరర్ డేగ కళ్ళు కాటేస్తుంటాయి   మగవాళ్ళు కరెన్సీనోట్లై ఆవులిస్తుంటే ఆమె "స్లీపింగ్ పిల్" గా మారుతున్నప్పుడు ఎమోషనల్ టచ్ కి అర్థం ఏనాడో మారిపోయింది   యంత్రాల మధ్య దాంపత్యంలో పుట్టేవన్నీ విడాకుల శిశువులే!   పెరిగే వేగంతో పోటీ పడేది వత్తిడే మార్కెట్లో స్పాన్సర్స్ కి దొరకనిది ప్రేమే!   చట్టమైనా చుట్టమైనా మనసు తర్వాతే గదా! రెండు ధృవాల మధ్య రగిలే అగ్నికి కృతిమ సహజీవనం ఆహుతి కాకముందే విపరీత నాటకీయ ముగింపు ఛానెళ్ళనోళ్ళు రిమోట్ తో వెంటనే కట్టేయండి!   మన జీవితాలను నిశ్శబ్దదోపిడీ చేస్తున్న వినోద వ్యాపార స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త!