నాడు _ నేడు - సోమంచి ఉషారాణి
posted on Jan 11, 2012
నాడు _ నేడు
సోమంచి ఉషారాణి
స్వాతంత్ర్య పోరాటంలో తమ రక్తం చిందించారు నాడు!
స్వతపదం వ్యామోహంలో ఇతరుల రక్తం చిందిస్తున్నారు నేడు!
దేశం కోసం లేశమైనా చింతించక
సర్వస్వం ధారపోశారు నాడు!
దేశాన్ని దోచుకుంటూ అప్పుల్లో ముంచుతున్నారు నేడు!
ప్రతీ నాయకుడు ప్రభంజనంలా
విదేశీయుల్ని తరిమి తరిమి కొట్టారు నాడు!
ప్రతినాయకుడూ 'ప్రతినాయకుడై'
విదేశీయుల్ని ఆశ్రయిస్తున్నారు నేడు!
'స్వాతంత్య్రమే నా జన్మ హక్క'ని నిస్వార్ధంగా పోరాడారు నాడు!
గూండాయిజమే తమ జన్మహక్కని స్వార్ధంతో హింసిస్తున్నారు నేడు!
ప్రణాళికలతో ప్రామాణికంగా
దేశాభివృద్దికి పాటుపడ్డారు నాడు!
నానారకాల స్కాంలతో నానాగాడ్డీ కరచి
దేశాన్ని అధోగతి పాల్జేస్తున్నారు నేడు!
'దేశానికి నేనేం చేయగలను?'అని
విశాల హృదయంతో యోచించారు నాడు!
'దేశం ఏమైపోతే నాకేం'అంటూ
విదేశీ ఖాతాలు పెంచుకుంటున్నారు నేడు!
తుపాకీ తూటాలకీ, లాఠీదెబ్బలకీ వెరవక
కటిక చీకటి కటకటాలలో మ్రగ్గారు నాడు!
గన్ మాన్ లతో, పోలీసుల అండదండలతో
ఏ.సీ జైళ్ళలోంచే నిశ్చింతగా పాలిస్తున్నారు నేడు!
నేడు నాడయే దెప్పుడో?
నాడు నేడయ్యే దెన్నడో?