స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త - చిల్లర భవానీదేవి
posted on Jan 11, 2012
స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త!
-చిల్లర భవానీదేవి
ప్రేమ ఎవర్ గ్రీన్ సబ్జక్ట్ అయినా
పెళ్లి నేటి గిరాకీ వ్యాపారం
స్క్రీన్ మీద ప్రసారిత స్వప్నాలనిండా
ఎమోషన్లూ ....ఎక్స్ ప్రెషన్లే!
పెళ్ళి తర్వత రంగుమార్చే ప్రేమకథలే!
ఇప్పుడు పెళ్ళంటే
ఎమోషనల్ సెక్యూరిటీనీ
కన్నీటికిభద్రమైన దిండునూ వెతుక్కోవటమే!
మనసులు శరీరాలు
ఆశలు అలసిపోయిన నిస్తేజంలో
నిలువెల్లా కుదిపేస్తున్న మానవవిషాదంలో
జీవితనేస్తం మనసుకు ఆకాశమంత దూరమైతే
నమ్మకం లేని అదృష్టాన్నే నమ్ముకోవాలా?
ఆనాడు అదొక పవిత్రబంధం
మరునాడు అదొక భద్రతా కవచం
నిన్ననొక కట్నాల కొలిమి జూదం
నేడు ఒక స్పాన్సర్డ్ ఎపిసోడ్
మార్కెంటింగ్ ను పెంచే ప్రతి ముద్దునూ
స్పాన్సరర్ డేగ కళ్ళు కాటేస్తుంటాయి
మగవాళ్ళు కరెన్సీనోట్లై ఆవులిస్తుంటే
ఆమె "స్లీపింగ్ పిల్" గా మారుతున్నప్పుడు
ఎమోషనల్ టచ్ కి అర్థం
ఏనాడో మారిపోయింది
యంత్రాల మధ్య దాంపత్యంలో
పుట్టేవన్నీ విడాకుల శిశువులే!
పెరిగే వేగంతో పోటీ పడేది వత్తిడే
మార్కెట్లో స్పాన్సర్స్ కి దొరకనిది ప్రేమే!
చట్టమైనా చుట్టమైనా మనసు తర్వాతే గదా!
రెండు ధృవాల మధ్య రగిలే అగ్నికి
కృతిమ సహజీవనం ఆహుతి కాకముందే
విపరీత నాటకీయ ముగింపు ఛానెళ్ళనోళ్ళు
రిమోట్ తో వెంటనే కట్టేయండి!
మన జీవితాలను నిశ్శబ్దదోపిడీ చేస్తున్న
వినోద వ్యాపార స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త!