నువ్వే!! -పావనీ సుధాకర్

నువ్వే!!                                                                                              -పావనీ సుధాకర్   పల్చటి ఉదయం కాలపు ఎండరంగులా నీ ఉనికి........ నా కనురెప్పల మధ్య   స్వప్నంలా చిక్కుకుని, నీ ఆలోచన్ల రుచి -   షాంపేన్ లా మనసుకెక్కి, నేను ఇంద్రధనస్సుల మీద నడుస్తాను - నువ్వు వొదిలిపోయిన జాడల్లోకి నిన్ను తిరిగి తెచ్చుకుంటాను - గాలి సవ్వడిలో............ నీళ్ళ రుచిలో..... ఎండ రంగుల్లో..... ఇప్పుడు.... నీ వునికి కాదు - నువ్వే!-   నీకూ - నాకూ మధ్య!   దశాబ్దాల నిశ్శబ్దంలో మొద్దుబారిన మనసులు - గాయాలు తగిలినా రక్తాలు కారవు హృదయాలు పగిలినా ముక్కలవ్వవ్- గొప్ప చిత్రమేమిటంటే !.... అల్లుకున్న అక్షరాల హారాల్ని మధ్యన పెట్టుకుని, అపురూపంగా కాపలా కాస్తో...... ఆ చివర నువ్వూ - ఈ చివర నేనూ మొహాలకి ముసుగు వేసుకుని -   ఏం చెప్పమంటావ్ నన్ను?   నేను నిన్ను చర్మం కింద దాచుకున్నాను వూపిరిలా నింపుకున్నాను నువ్వు మాత్రం నన్ను - నీళ్ళలా.... వేళ్ళ మధ్య నించి జార్చుకున్నావ్ పెదవి చివరి వొంపులో ముడుచుకున్న దిగులు నీడలో కంటి చివర, ఒంటరి చినుకు వొదిలిపోయిన జాడలో కదుల్తో.... మెదల్తో.... ప్రాణంలా కొట్టుకుంటో జీవితమంతా పరచుకున్నావ్ ఒఖ్ఖ హృదయాన్ని మాత్రం వొదులుకొని   తప్పిపోయి.......   ఒక్కో పలకరింపు ఒక్కోపాట శబ్దం నిశ్శబ్దం మనసుని కలవరపెట్టి మనిషిని ఒక ప్రపంచంలోంచి మరో ప్రపంచంలోకి లాక్కెళ్ళిపోతాయ్ తిరిగి రావడవే... గొప్ప కష్టం!   మంత్రించినట్టే....   ఈ కనురెప్ప మీద నిద్రవాలదు గుండె చప్పుడూ కాదు ఒఖ్ఖ ఆలోచనా రాదు - నులి వెచ్చని శాలువాలా కమ్ముకుంటో ఆ పలకరింపు..... చంపల మీద...... సింఫొనీలా సంతకాలు చేస్తో... ఆ పిలుపు మాట మాటకీ మధ్య ...... మాటలు దొరకని వెదుకులాటలో అలసి, దొరికిపోయిన దగ్గరతనం! బ్రతుకు....బ్రతుకంతా.... ఒఖ్ఖ క్షణపు తిరునాళ్ళలో తెలిసి, తప్పిపోయి.......... ఒఖ్ఖ మాట రాదు మౌనవూ కాదు........... మంత్రించినట్టే.... మెలకువలో కల కంటో ఈ కల ఎక్కడ ఎగిరిపోతుందోనని నిద్రపోడానికే భయపడుతో......   ఆ క్షణంలోనో   వేళ్ళలో వేళ్ళు జొనుపుకొని, అడుగుల్లో అడుగులు వేసుకుంటో చుక్క...... చక్క.....గా...... కవిత్వాన్ని చప్పరిస్తో..... మత్తులమై..... వున్మత్తులమై..... మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినపుడు ఒఖ్ఖ క్షణమే... అయినా అమరులమై కాలాన్ని ఆపి నిలిపినప్పుడు చప్పున.... ఉమర్ ఖయాం, సాఖిల చిత్రం గుర్తొస్తుంది. కీట్స్ చెప్పినట్టు.......... కళ ఎంత శాశ్వతం! ప్రియతమా! చూడు....... మనవూ ఆ చిత్రంలోలా...... ఈ ..... అక్షరాల మలపుల్లో వేళ్ళలో వేళ్ళు జొనుపుకొని అడుగుల్లో అడుగులు వేసుకుంటో ఎంత సేపూ...... ఆ క్షణంలోనే తిరుగుతోంటాం.

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి   తలుపుల్లేని హృది గదికి వలపుల తలుపులే నివాసం! బంధాల్లేవి జీవితానికి బర్లాతెరిచిన ఆకాశమే ఆవాసం!!   బ్రతుకంతా భారంగా ... భయంగా.. అదేమిటో మరి- ఆమె కౌగిలిలో అలెగ్జాండర్ చక్రవర్తినౌతాను!   వైకుంఠ ద్వారాలు తెరిచేందుకు ఎక్కడికీ వెళ్లనఖ్ఖరలేదు ఆమె చుంబనంతో అతిలోక ద్వారాల్లా బార్లా తెరుచుకుంటాయి!   సుడిగాలిలా ప్రవేశిస్తావు చిరుగాలిలా వెళ్ళిపోతావు. మిగిలిపోతాను శూన్య హృదయంగా... చెల్లాచెదురయిన పూదోటగా!!   అమృతం అంగడి దిగకముందే హాలహలం చేసేస్తాడు! అందుకే దేవుణ్ణి శపిస్తున్నాను- మానవ జన్మ ఎత్తమని. ప్రేమికుడిగా బతికి చూడమని!!   వచ్చే పాదాలూ పోయే పాదాలూ జీవితం భళ్ళున తెల్లవారింది! ఆమెతో అడుగుకలిపి నడుస్తాను మానవారణ్యపు దారుల్లో- అమెరికాను కనుగొన్నకొలంబస్ లా! ఖగోళ రహస్యాల్ని చూసిన గెలీలియోలా!! త్యాగాలు చేయిస్తావు, ఛాలెంజ్ లు విసురుతావు   నొప్పుకుంటున్నా..... ప్రేమభిక్షకు హృదయం జోలెపట్టిన పిరికివాణ్ణేనంటున్నా! కళ్ళజోడు ధరించాను. కన్నీళ్ళను దాచుకుందామని- నీ చేతిలో స్పృశించావు ఆనంద భాష్పాలయ్యాయవి! ప్రేమికులారా వినండి... ప్రేమ సామ్రాజ్యాన్ని జయించాలంటే కత్తులు దూసి లాభం లేదు- హృదయార్పణకి సిద్ధం కండి.   వాళ్ళంతా గొప్పవాళ్ళు ఖరీదైన ప్రేమతో నేన్నుసేవిస్తారు.... ఏ గొప్పాలేని వాణ్ణి... మట్టివాసనల్తో నీ ముంగిలిలో నిలబడతాను.! నీ ప్రేమను నీకివ్వకపోయినా నా దుఃఖాన్ని నాకిచ్చేశావు! ఎన్ని జన్మలెత్తి నీ రుణం తీర్చుకోగలను?! గుండెను కాగితం మీద అద్ది దుఃఖం బరువును తగ్గించవా? అక్షర ప్రాయోపవేశంలో అనంతదుఃఖాన్ని కప్పుకోగలవా??   సశేషం    

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి   ఆమె ఆత్మీయత ముందు అవనతవదనుణ్ణవుతాను భూమాతయందు మట్టి మనిషిలా! దేవత సన్నిధిలో భక్తుడిలా!!   నీ ముందు మోకరిల్లని పురుషుణ్ణి క్షమించకు నీముందు తలవొంచని వ్యక్తిత్వాన్ని సహించకు   ప్రేమ సామ్రాజ్యాన్నేలాలంటే... తలలు నరుకుతూ పోవడానికి సందేహించకు. బంధాల పేరుతో మగజులుం బాహాటంగా చెల్లుతోంది కదా!   ప్రేమతో తలలు తుంచడం పాపమేమీ కాదు కదా! ప్రేమను నమ్మిన వారికి ప్రియులకేం కొదవ? దుఃఖం దక్కిన వారికి కన్నీటికి కరవా??   నాప్రేమ భిక్ష నాకు పారెయ్యి పారిపోతాను దూరంగా కలల అలల తేలివొచ్చి కరిగిపోయే స్మృతిలాగా! నీ నుంచి నేర్చుకున్నాను ప్రేమించడం నేర్చుకోలేకపోయాను క్షమించు... ద్వేషించడం   సశేషం

తెలుగంటే రాజసానికి చిరునామా - అభిలాష

తెలుగంటే రాజసానికి చిరునామా భగ భగ మండుతోంది గుండె మన మాతృ భాషను చులకన చేస్తే.... సల సల మరుగుతోంది రుధిర జ్వాల తెలుగుని తేలిక గా చూస్తే.... కసి కసి గా ఉడుకేత్తుతోంది నరం నరం నా తెలుగు తల్లిని బాధిస్తే... అణువణువులో రగులుతోంది ఆగ్రహం పరాయి భాషకు పెద్ద పీట వేసి సత్కరిస్తే... మనసు పొరల్లో పోటెత్తుతోంది పెను ప్రకంపనం ఈ తెలుగు గడ్డ మీద పుట్టి ఆ ఘనత చాటి చెప్పకపోతే.... ఎవడబ్బ సోమ్మో మనకెందుకు దండగ.... మన సొత్తు మన ముంగిట్లో వుండగా.... ఎవడి అక్షర ఆస్తినో నువ్వు మోసేదేంది వెర్రిగా... మన అక్షర లక్షలు మన గుండెల్లో కొలువుండగా.... ఏ అరువు తెచ్చుకున్న డాబుసరులు ఎందుకు నీకు వగరుగా.... మన దర్పం దర్జా సలక్షణంగా మన పుట్టుకతోనే మెరిసిందిగా.... వాడెవడినో చూసి నువ్వు వాత పెట్టుకోకు హీనంగా.... నీ ఘనత నీ రక్తంలో ప్రవహిస్తోంది చూసుకో కళ్ళు తెరచి విప్పరగా.... గుండె చప్పుడైన స్పందించేది నీ మాత్రుభాషలోనేగా.... మరెందుకు మనకి ఈ వేకిలితనపు పిచ్చి కూతల రాతల మరో వేరొ ఎవరో సొత్తు అయిన పరభాషా హోరు ,ఇది నయవంచనేగా.... చేతులారా మనల్ని మనం అమ్ముకుంటున్నాం ఇది నీ మది గ్రహించలేద.... అవసరానికి మించి అనవసరాన్ని పోషించి మన భాషని మనమే కాటికంపుతున్నాం, పెంచుకో విజ్ఞత... వద్దు మనకి ఆ దద్దమ్మల దారిద్ర్య లేకితనం... వుందిగా మనకి రాజసంగా డాబు దర్ర్పం దర్జా కలగలసిన తెలుగు గాంబీర్యం.... మన తెలుగుని బ్రతికించుకుందాం... మన వెలుగుని నలువైపులా ప్రసరిద్దాం.... మన భాషని గర్వంగా మారుమ్రోగిద్దాం.... మన పొగరుని సాటి లేని ఘనతగా చాటి చెప్పుకుందాం.... మన ధీరత్వాన్ని తల ఎత్తి గర్వంగా ప్రజ్వలించుదాం.... జై తెలుగు... జై జై తెలుగు... నీకు సాటి ఏది లేదు ఇక్కడ దర్జాగా వెలుగు.... -------- అభిలాష  

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకటరామిరెడ్డి

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకటరామిరెడ్డి   మానవ మహారణ్యం దారుల్లో మేము పధచారులం.... మనసుని పారేసుకుని హృదయంతో జీవితాన్ని వెదుకుతూ పోతాము!   అగాధం లాంటి హృదయంతో ఎన్నెన్నో వేసినా నిండదు- అదేమి చిత్రమో.. ఆమెవొక్క చూపుతో... అమృతభాండమౌతుంది!!   నా కవితలు నీ కళ్ళలో గుచ్చుకుని హృదయాన్ని రక్తసిక్తం చేస్తాయి.... ఆ భయంతోనే నేను మౌనీశ్వరుణ్ణవుతాను! 'మళ్ళీ జన్మలో....' అంటావు 'మన ఇద్దరమూ...' అంటావు ఈ వొక్క జన్మలోనే నీకోసం ఎన్ని జన్మలెత్తానో ఎలా చెప్పను?   ఇద్దరమూ కలిసి నవ్వుకున్నాం ఇద్దరమూ కలిసి ఏడ్చుకున్నాం. కానీ నిరీక్షణాహారాన్ని నా మెడలో వేసి వెళ్ళిపోయావు!   కలలోని అలలా పాట వెళ్ళిపోయింది తోట చిన్నబోయింది హృదయం మళ్ళీ కన్నీటి సముద్రం మీద నావయ్యింది!   సశేషం    

నడక - శారదా అశోకవర్ధన్

నడక - శారదా అశోకవర్ధన్   ఎందాక ఈ నడక ఎక్కడికి నడక ఎప్పుడు మొదలెట్టానో తెలీదు ఎంతవరకు వెళ్లాలో తెలీదు ఊహ తెలిసిన నాటినుండి నడుస్తూనే వున్నా.... ఎండలో వానలో గాలిలో తేమలో ఎడతెరిపి లేకుండా నడుస్తూనే వున్నా..... అప్పుడు నా ఎదనిండా ఊహలే ఊహలకు అల్లుకున్న బంధాలు..... నేలనాది గాలినాది బతుకు నడిడ్ భావం నాది అందరూ నావారే.... ప్రేమసముద్రంలో ఈదుకుంటూ ఆశలపల్లకీలో ఊరేగుతూ గడిపేశాను గతకాలాన్ని ఎప్పుడు ఖాళీ అయిందో తెలీదు నా ఎద గూడు ఒక్కొక్క ఊహా ఇంకిపోయింది ఊపిరిరొక్కటే పాడుకుంటోంది భగ్నప్రేమికుడిలా ఏదో గీతం నడవలేకపోతున్నాను ఊహలనొదిలి నేలంతా రక్తపు మరకలే గాలంతా మురికి వాసనే నడక మానేద్దామనుకున్నాను మందలించింది నడక అమ్మలాగ బుజ్జగించింది మళ్ళీ ఎక్కడైనా ఊహలు కొత్త ఊపిరి పోసుకుని పలకరిస్తాఎమోనని గుండెసావిట్లో నిండుకుంటాయేమోనని నిదానించినా నిలిచిపోక నడుస్తూనే వున్నాను అరికాళ్ళకు ఆత్మవిశ్వాసాన్ని తొడుక్కుని....    

మళ్ళీ పసి పాపనై - శారదా అశోకవర్ధన్

మళ్ళీ పసి పాపనై - శారదా అశోకవర్ధన్   నా పాదం మోపగానే ఈనేల నన్ను గుండెలకి హత్తుకుంది అమృతంలా ఆప్యాయతని పంచుతూ! స్వాగతం పలికింది ఎన్నో సంవత్సరాల తరువాత పుట్టింది కొస్తూన్న ఆడపడుచును ఆర్ర్ధంగా ఆదరించినట్టు! ఈ గాలి నా బుగ్గలను ముద్దెట్టుకుంటూ పిల్లన గ్రోవి పలికించే కొత్తరాగాల్లా పల్లవులు పాడింది పరవశింపజేస్తూ! ఈ ఉదయం నా హృదయం ఉప్పొంగిపోయింది సుప్రభాత గీతాల్లాంటి నా వాళ్ళ పలుకుల తియ్యదనంతో అమృత వర్షిణి రాగం ఆలాపనలా అనిపించింది ఆనందంతో మృదంగ విన్యాస దరువుల్లా బరువుగా సాగాయి నా అడుగులు! హరిహరాదులు తాండవ కేళీసభలోని సంగీత సమ్మేళనంలా మురిపించి మైమరిపించాయి నా వాళ్ళు నా పై కురిపించిన అక్షరాల జల్లులు అమ్మ చెప్పిన మాటలు ఆకాశవాణి వార్తల్లా గుర్తొచ్చాయి. అక్కడ మొలిచిన గడ్డిపోచ సయితం సంగీతం సాహిత్య రసఝరిలో స్నానమాడి పచ్చగా పలుకరిస్తుందని దివి నుండి దిగొచ్చిన వాగ్దేవి ముద్దుగా గురజాడను ఒళ్లో కూర్చోబెట్టుకుని పసిడి పలకమీద వెండి అక్షరాలతో 'పుత్తడి పూర్ణమ్మ' గేయ ప్రతిష్ట చేసి 'కన్యాశుల్కానికి' అన్యప్రాంతాల వారందరూ మెచ్చేలా కీర్తి కిరీటాన్ని సొంపుగా తగిలించి శోభాయమానంగా వర్దిల్లజేసింది చా.సో. చేత చిక్కని భావాల చక్కని కథలు రాయించింది కృష్ణశాస్ర్తిని బుజ్జగించి కమ్మని కవితలల్లించింది హరికథలు గిరికథలు కళ్లకద్దినట్టు దర్శింపజేసింది సరిగమల పూలదండలకు సంపెంగ అత్తరులు పూసి ఘంటసాల మెడలో వేయించింది సప్తస్వరాన్ని తేనెలో రంగరించి ప్రేమతో తాగించింది మాటేపాటై నిలిపింది కోకిలమ్మ గొంతుని సుశీల కమర్చింది వసంతంలోనే కాదు ప్రతినిత్యం వసంతంగా వెలిగిపలకాలని! ద్వారం మునివేళ్లతో ముచ్చటగా ఫిడేలు మీద ఆడుకుంది అక్షరాల పల్లకీ చేయించి ముత్యాల సరాలతో అలంకరించి సాహితి సౌరభాల కంబళీపరచి గజారోహణం గావించింది తెలుగుజాతి ఔన్నత్యాన్ని తరతరాలకూ పంచిపెట్టింది అమ్మకెప్పుడూ ఇవే మాటలు గతం జ్ఞాపకాల తీపిగుర్తులు 'అమ్మ పుట్టగానే నాచేతిని ముడ్డాదిందేమో నాకలం కమ్మని కవితలు రాస్తోందన్నాడు' శ్రీశ్రీ మా అమ్మకూడా నా చేతిని తన గుండెలకి అదుముకుని మురిసిపోయిందేమో కవితాత్మ నాలోనూ తొంగిచూస్తోంది! గజపతుల గవాక్షంలోంచి రాలిపడిన వీణారవాల తీగెలు నా గొంతులోనూ పూచాయేమో నాకూ అంటింది కొంత మాధుర్యం కోనేరు గట్టున అమ్మ ఆడుకున్న చెమ్మ చెక్కల చప్పట్లనూ కిలకిల రాగంతో గొంతు కలిపి అమ్మ పాడుకున్న పాటలనూ నీలిమేఘాలు రికార్డ్ చేసుంచాయేమో ఆకాశం అంచునుంచి నక్షత్రాలు జలతారు ముసుగులు తీసి మెరుపుతెరల చాటునుంచి నా చెవిలో వినిపిస్తున్నాయ్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ గంట స్తంభం కాలాన్ని కాటుకగా చేసి కళ్లల్లో దాచుకుందేమో ఎప్పటికయినా నేనొచ్చినప్పుడు ఆ కథలన్నీ నాకు వినిపించాలని గుండెలో గుసగుసలు పెట్టింది కలకండలా తియ్యగా ఊహలకి ఊసిరిపోస్తూ! నగరం ఆహ్వానించింది నన్ను అభిమానాన్ని మల్లెలుగా కట్టి అనురాగాన్ని మామిడి రసాల కడవలోముంచి మమతను రంగవల్లికగా తీర్చి బౌద్దారామాల భరణిల్లోని ధూళిని నా నుదట సింధూరంలో అద్ది నా సిరుల కురులు దువ్వి ముచ్చట ముడిలో అమర్చింది సంస్కారాన్ని నాగరంగా! దాసన్న పేటలోని పెంకులు ఎక్కడ దాక్కున్నాయో ఇన్నేళ్లూ పురిటివాసనల మూటవిప్పినట్టున్నాయి నేనెప్పుడొస్తే అప్పుడే సాంబ్రాణితో కలిపి ధూపమై నిలవాలని! నేను బోర్లా పడుతూ పారాడిన నేల ఉంగా ఉంగాల కేరింతల బొబ్బట్లను నాకు తినిపించాలని ఉర్వళ్ళూరుతూ ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసింది నా తల్లి పసుపుపారాణి పాదాలకు నమస్కరించి ఆ చల్లని ఒడిలో ఆ మమకారపు తడిలో తడిసి ముద్దనై ముగ్ధనైపోవాలని ఒచ్చాను! నేను నడిచిన తప్పటడుగుల జాడలు మచ్చుకైనా ఎక్కడైనా ఆగుపిస్తాయేమోనని ఆశతో ఒచ్చాను నాన్నగారూ మామగారూ కలిసి 'ఆఆ' లు దిద్దుకున్న ఆవరణ మున్సిపల్ హైస్కూలు ప్రాంగణం నన్ను పలకరిస్తుందని వారి మాటలు నిశ్శబ్దతరంగాలై నా ఎదలో మోగితే వినాలని ఒచ్చాను - అమ్మమ్మ పాడిన జోలపాటల్లోని పగడాలను పదిలంగా ఏరుకోవాలని వచ్చాను మళ్ళి పసిపాపనై బంగారు బాల్యపు తూగుటుయ్యాలలో ఒక్కసారి ఊగిపోవాలని వచ్చాను. ఈ బహుధాన్య ఉగాది వేళ నా వాళ్ళందరితో సంతోషంగా సంబరాలు జరుపుకోవాలని వచ్చాను.    

కలంచేతికర్రగా! - శారదా అశోకవర్ధన్

కలం చేతికర్రగా! - శారదా అశోకవర్ధన్   హలంపట్టి పొలం దున్నే ఇంటపుట్టి కలం పట్టి సాహితీ క్షేత్రాన్ని దున్నాను నీ కలం బలం వన్నెతెచ్చింది నీవు పుట్టినింటికి వాసిరెడ్డి పేరుకే సాహితీ మెరుగులు దిద్దింది వాసి తప్ప రాశి కోసం పరుగెత్తలేదు కసిగా సమాజంలోని కుళ్ళుని కడిగెయ్యాలనుకున్నావు కలం చేతపట్టి కన్నీటి గాధలకు రూపకల్పన చేసి మనసు గారడీల తమాషాలు చూసి సమత కోసం పాకులాడావు మట్టి మనిషిలోని ఔన్నత్వాన్ని మహోన్నతంగా సృష్టించి శిఖరాగ్రంపైన నిలబెట్టావు ఒడుదుడుకుల నెదుర్కొని ఒంటరిపోరాటం చేసి కీర్తి శిఖరాల నధిష్టించావు రెండు పదులు దాటిన మనస్నేహం నిండుదనాన్ని సంతరించుకుంది కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నీ నైజం నిర్మలమైన మనసుకు తార్కాణం మంచిని ప్రేమిస్తావు మనిషిగా చెడుకి ఝడవక శక్తివై విజృంభిస్తావు కొరడాతో కొట్టి తట్టి తరిమెయ్యాలని చూస్తావు పోరాడతావు ఆరాటపడతావు పట్టుదల నీ ధ్యేయం విశ్వాసమే నీ ఆయుధం నిజాయితీతో నీదైన బాణీతో సాగిన నీ రచనలే నీ ఆదర్శం రెండు మార్లు అకాడమీ బహుమతిని అందుకున్నావు ఉరితాడు నవల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడే అబలలందరికీ ధైర్యాన్నిచ్చే అస్త్రం ఊపిరిపోసే ఉగ్గు నిండుగా నూరేళ్ళు బతికి మెండుగా రచనలు చేసి దండిగా ఎన్నెన్నో బహుమతులు గెలిచి వర్ధిల్లాలని కోరుకుంటూ అందిస్తున్నానీ చిన్ని కవిత 'ఉరితాడు' నవలకి నీవీనాడు అక్షర నీరాజనాలందుకునేవేళ అర్పిస్తున్నాను ఆత్మీయంగా నా భావనా పుష్పాన్ని కలికి సీతమ్మా కలం చేతికర్రగా కలకాలం నిలబడు నవలా మణివై వెలుగొందు    

గొంతు గుండెలోన- శారదా అశోకవర్ధన్

గొంతు గుండెలోన - శారదా అశోకవర్ధన్   గొంతుగుండెలోకి దిగిపోతోంది గుడ్లప్పగించాను - మాటరాక గుండె గోతుల్లోని గాయాలలోకి జారిపోతోంది గొంతు! మూగనై మిగిలాను - పలుకలేక అరవాలనుకున్నాను అందరూ వినేలా ఎలుగెత్తి విలుకాని దెబ్బలకు విలవిలా కొట్టుకుంటూన్న హరిణంలా పూడుకు పోయింది నా గొంతు పుట్టెడు దుఃఖంతో కళ్లనిండా వెతలు కథలై నిండుకున్నాయి ఒళ్లు జలదరించి రోమాలు రిక్కపోడుచుకున్నాయి కన్నీళ్లు కాలువలు కట్టి మండుతూ గుండెను తడిపి ముంచెత్తుతున్నాయి కణకణలాడే మార్తాండుణ్ణి రాహువు కసిగా మింగేసి కహకహ నవ్వేసినట్టు - వెండి వెలుగులు పరుచుకుని అందంగా అలంకరించుకున్న తారలతో ఆడుకుంటున్న చందమామని నల్లని చిమ్మి పొగలాంటి కారు మబ్బులు కప్పేసి అందాలను అలికేసినట్టు మనిషిలోని మానవత్వాన్ని స్వార్ధంతో హత్య చేస్తున్నాడు ఆధునిక మానవుడు - కన్నతల్లి ఆస్థిపరురాలైనా ముసలిది ఇంకా చావడంలేదని గుండెలో కత్తిని దిగేసి కసాయిలా నరికి పారేసిన కొడుకు ఒకడైతే బీదదైన తల్లి బతికి ఎవరినుద్దరించాలని బతికుండగానే చితిని పేరుస్తున్న కొడుకు మరొకడు ఆ వైఖరికి నా గొంతు ఖంగుమందామనుకొంది మాట పెగలక నా గొంతు గుండెలోకి జారిపోయి జావగారిపోయింది కట్నం చాలలేదని కక్షకట్టి కాల్చి చంపిన తాళి కట్టిన భర్త కడుపు చీల్చుకు పుట్టిన బిడ్డలకి కడివెడు కన్నీళ్ళూ కష్టాలూ తప్ప పట్టెడు మెతుకులు పెట్టలేక అల్లల్లాడే తల్లి ఆత్మహత్య నడిరోడ్డుమీద పట్టపగలే వికటాట్టహాసం అఘాయిత్యం అక్రమాలు ఆడవాళ్లంటే 'ఆడు' వాళ్ళుగా అత్యాచారాలు చేసి అలుసుగా కంటిలోని నలుసులా తొక్కిపారేసే వైనం - నా గొంతు ఉరుమై ఉరవాలనుకుంది చప్పుడు రాక గుండెచప్పుళ్ళలో ఇంకిపోయి నా గొంతు గుండెలో చిక్కుపడి మూతబడిపోయింది ఎలా తియ్యను పైకి? గుండె బండలా బద్దలై గొంతు మౌనంగా రోదిస్తోంది ఏడుస్తూ ఎండిపోతోంది! నా పలుకు తేనె చిలుకై నిలిచిననాడు నా గొంతు పాడిన మోహన రాగాలు తేటతెల్లని తెనుగు పాటలై గుండె గుండెను వీణగా మలచి ఆనంద భైరవియై మ్రోగినవాడు మానవత మల్లెతీగై మంచితనం సుగంధమై మమతలు పారిజాతాలై మనిషి కోవెలలోని దేముడిలా పుడమితల్లిని పులకింప జేసినవేళ కోటివీణల నాదంతో సాటిలేని రాగంతో మాట మాటలో మందారాలు పూయించిన నా గొంతు ఈ విషజ్వాలల్ని భరించలేక మారణహోమాల ధూమాన్ని పీల్చలేక శవదహనాల హారతుల నందుకుని ఆనందించలేక శుష్కనినాదాల హాహాకారాల నాలకించలేక గుండెలోకి దిగిపోయింది నాగొంతు మాటలు విరుచుకుంది ఎలా మాట్లాడగలను? బలిపశువులా మూగగా కన్నీరు కార్చడం తప్ప ఎలా మాట్లాడగలను? రండి! రండి! నా గొంతును గుండెలోయలో నుంచి తీసి రక్షించండి! ప్రాణం పొయ్యండి! మళ్లీ నా కంఠానికి మాటనివ్వండి పదిమందినీ పలకరించే సౌభాగ్యాన్ని చేకూర్చండి నా శబ్దప్రపంచాన్ని మళ్లీ నాకు అందించండి!    

మగువా! చెయ్యి తెగువ! - శారదా అశోకవర్ధన్

మగువా! చెయ్యి తెగువ! - శారదా అశోకవర్ధన్   పైశాచిక పడగవిప్పి నాట్యం చేస్తోంది నాగరీకం పదం పాడుతూ తాళం వేస్తోంది పురుషాధిక్యం సమాజం మీసాలు తిప్పి ఎప్పుడూ ఆడదానిపై సవాలు చేస్తూనే వున్నది స్త్ర్రీని ఒక నలుసుగానే కాలరాసి పారేస్తున్నది ఎదురు తిరిగిన మగువను మగరాయుడు అంటూ తూలనాడుతూన్నది, హేళన చేస్తున్నది ఆడవాళ్లకి పిరికి పాలు పోస్తూ ప్రతివ్రతాల కథలను సిరంజితో ఇంజక్షన్ చేస్తూ స్త్రీని ఎదగనీయక పురుషుడు అడ్డుగోడై నిలుస్తున్నాడు ఆమె మీద పెత్తనం చెలాయిస్తున్నాడు డిగ్రీలున్నా దండగ ఆమెకి - ఉద్యోగం చెయ్యాలంటే పురుషుడి పర్మిషన్ కావాలి ఉద్యోగాలున్నా దండగే - ఆ డబ్బు పురుషుడికే ఇవ్వాలి అతడి ఇష్టప్రకారమే ఖర్చు పెట్టాలి! మగువా! చెయ్యి తెగువ! మహిళా దినోత్సవాలలో తద్దినం పెట్టించుకున్నట్టు వేదికలనెక్కి ఉపన్యాసాలివ్వడం కాదు ఏడుపు కథలు వినిపించడం కాదు ఈర్ష్యాసూయలు మాని ద్వేషాగ్ని జ్వాలలకు దూరమై మూడు కొప్పులు కలవవన్న నానుడిని తుడిచేస్తూ మహా ప్రభంజనమై విజృంభించాలి నవనారీ ప్రభాత గీతం ఎలుగెత్తి పాడాలి నువ్వు కేవలం ఒక్క ఆడదానివే కాదు మరొక పురుషుడికి జన్మనిచ్చే ప్రాణదాతవి కూడా!    

నాగదికి రెండు కిటికీలు - శారదా అశోకవర్ధన్

నా గదికి రెండు కిటికీలు - శారదా అశోకవర్ధన్   నా గదికి రెండు కిటికీలున్నాయి - నా కళ్లలాగే నా కళ్ళు రెండు ఎప్పుడూ తెరిచే వుంటాయి. ఒక్క నిద్రలో తప్ప ఈ ప్రపంచంలోని వింతలన్నీ చూస్తూనే వుంటాయి కోరికలు నింపుకుంటూ వుంటాయి కానీ నా గదికిటికీలు మాత్రం రెండూ ఒక్కసారే ఎప్పుడూ తెరుచుకోలేదు ఓ కిటికీ గుండా ఎన్నెన్నో దృశ్యలో! ఆరంతస్తులనుంచి పదహారంతస్తుల వరకు గగనానికి నిచ్చెనలు వేసినట్టు మిలమిలా మెరిసిపోయే ఇంద్రభవనాలు వెన్నెల రాత్రుల్లో తాజ్ మహల్ ని తలదన్నేలా వంద చందమామల వెలుగును పులుముకున్నట్టు మెరిసిపోతాయి దివి నుండి తారకలు దిగివచ్చినట్లు విద్యుత్ దీపాలు వెలిగిపోతాయి పండగే రానఖ్కర్లేదక్కడ ప్రతీరోజు సందడే పడవల్లాంటి పొడవాటి కార్లూ దేవకన్యల్లా అలంకరించుకునే పడతులూ నవనాగరికతను ప్రతీకలైన యువకులూ భూతల స్వర్గం ఆ దృశ్యం అక్కడి దృశ్యాన్ని ప్రసరిస్తుంది ఆ కిటికీ నా గదికి మదినిండా నింపుతుంది ఆనందం నా మదికి మరో కిటికీ తెరిస్తే కనిపించే దృశ్యం బతుకుకీ మెతుకుకీ మధ్య జరిగే పోరాటం పొద్దు పొడిచినప్పటినుంచి పొద్దుకుంగేదాకా కాలంతో గడిపే సమరం బాధలని మరచిపోవడానికి తాగేవాడొకడు బడాయిలు వారికి తెలీవు బుకాయింపులు అసలే లేవు పేలికలు చుట్టుకున్నా నవ్వులు రేపటి ఆశల పువ్వులు తియ్యని కోరికతో చందమామ వెలుగులో నులకమంచం ఉయ్యాల్లో ఊహల్లో తేలిపోయే జనం పాలమనసులు వారివి దీపాల్లాంటి స్వచ్చమైన బతుకులు వాళ్లవి పసిపాపల్లా దేనికో కొట్టుకుంటారు అంతలోనే కలుసుకుంటారు కమ్మగా పాడుకుంటారు ఆడుకుంటారు అక్కడ స్వచ్చమైన నూనెదీపాలు తప్ప మెర్కురీ బల్బులు కనిపించవు అందుకే ఆ కిటికీలోంచి ఏదీ ప్రసరించదు నాగదికి నా రెండు కిటికీలలో ఎంత తేడా ఒకటి స్వచ్చతకు రూపమైతే మరొకటి కృత్రిమానికి ప్రతిరూపం అయినా నాకెందుకంత స్వార్ధం? విద్యుత్ కాంతులను నా గదిగుండా అవతలి కిటికీలోంచి నేనైనా ప్రసరింప చెయ్యచ్చుగా! స్వార్ధం ఈనాడు మన జన్మహక్కై నడిపిస్తోంది. పెదవి విడిపడదు పలుకు రాదు - నా గది కిటికీల్లాగే    

నీబాట నువ్వే వేసుకో - శారదా అశోకవర్ధన్

నీబాట నువ్వే వేసుకో - శారదా అశోకవర్ధన్   నా చిట్టి తల్లీ! నా గారాలవల్లీ! పదేళ్లయినా నిండని నిన్ను బయటి ప్రపంచం దృష్టిలో పడకుండా సృష్టిలోని అందాలను తనివితీరా చూడనీయకుండా నీ బాల్యాన్ని ఉండచుట్టి పడేసి నిన్ను గాంధారిని చేసి కూర్చోబెట్టే దౌర్భాగ్యపు స్థితిని ఏమనాలో తెలీదు ఏ పేరు పెట్టి పిలవాలో తెలీదు బడికి పంపిస్తే పదేళ్ల పాపని పదిలంగా తిరిగొస్తావన్న నమ్మకంలేదు గుడికెళ్లినా అంతే దేముడూరాయే కదా! పొలంకెళితే నవ్వుతూ తిరిగొస్తావన్న ఆశలేదు శవంగా మారిపోవచ్చు! పూలు కొనడానికెళితే నవ్వేపువ్వులా వున్న నిన్ను ఏ పాపిష్టి చేతులో ఎత్తుకుపోయి నలిపిపారెయ్యొచ్చు ఇంటికొచ్చిన బంధువే రాబందుగా మారి కబళించుకు పోవచ్చు నిర్దాక్షిణ్యంగా చచ్చిన చేపలనో కోడి పెట్టలనో రాళ్లనో రప్పలనో రవాణా చేసినట్టు ఎక్కడికైనా నిన్ను అమ్మెయ్యొచ్చు ఎక్కడని దాచి పెట్టను తల్లీ నిన్ను ఎన్నాళ్లని నా చీరకుచ్చెళ్లలో చుట్టి నిన్ను దాచగలను? ఇంతటి విశాల ప్రపంచంలో నీకు స్వేచ్ఛగా తిరిగే చోటే కరువయిందా బతుకే బరువైందా? బాధపడకు తల్లీ, నా గారాలవల్లీ ఏడుస్తూ కూర్చోకు ఖర్మ అని నీ జోలికి వచ్చిన వాళ్ళని జాలిపడిక కొరికి పారేయ్ కుత్తుకలు కోసిపారెయ్ మనిషికన్న బండరాయినో ఇనుపసుత్తినో నమ్ముకో అమ్మగా నిన్నెప్పుడూ ఒకకంట కనిపెడుతూనే వుంటాను నీడలా నీ వెంటే వుంటాను!