సమాంతరరేఖలు - శారదా అశోకవర్ధన్
posted on Jan 16, 2012
సమాంతరరేఖలు
- శారదా అశోకవర్ధన్
వయసుకి మనసులేదు
వద్దన్నా వస్తుంది
ఆగమన్నా ఆగదు కొంచెం
కనికరం అది ఎరుగదు
మనసుకు వయసులేదు
కమ్మని కలలు కంటూనే వుంటుంది
నడుం వంగినా బలం తగ్గినా
ఊహల పల్లకీలో
ఊరేగుతూనే వుంటుంది
గతాల జ్ఞాపకాల హరివిల్లులో
తన పొదరిల్లు కట్టుకుని
గంతులు వేస్తుంది
ఆనంద సాగర తీరాలలో ఈదుకుంటూ
అనుభూతలు ఏరుకుంటుంది
వయసుకి మనసులేదు
వద్దన్నా వస్తుంది -
మనసు నింపుకుంటుంది
నిత్యనూతన జ్యోతులు
వయసు రాల్చుకుంటుంది
గతకాలపు కాంతులు
ఇవి కలవని సమాంతర రేఖలు