కలంచేతికర్రగా! - శారదా అశోకవర్ధన్
posted on Jan 16, 2012
కలం చేతికర్రగా!
- శారదా అశోకవర్ధన్
హలంపట్టి పొలం దున్నే ఇంటపుట్టి
కలం పట్టి సాహితీ క్షేత్రాన్ని దున్నాను
నీ కలం బలం వన్నెతెచ్చింది
నీవు పుట్టినింటికి
వాసిరెడ్డి పేరుకే సాహితీ మెరుగులు దిద్దింది
వాసి తప్ప రాశి కోసం పరుగెత్తలేదు
కసిగా సమాజంలోని కుళ్ళుని
కడిగెయ్యాలనుకున్నావు
కలం చేతపట్టి
కన్నీటి గాధలకు రూపకల్పన చేసి
మనసు గారడీల తమాషాలు చూసి
సమత కోసం పాకులాడావు
మట్టి మనిషిలోని ఔన్నత్వాన్ని
మహోన్నతంగా సృష్టించి
శిఖరాగ్రంపైన నిలబెట్టావు
ఒడుదుడుకుల నెదుర్కొని
ఒంటరిపోరాటం చేసి
కీర్తి శిఖరాల నధిష్టించావు
రెండు పదులు దాటిన మనస్నేహం
నిండుదనాన్ని సంతరించుకుంది
కుండబద్దలు కొట్టినట్లు
మాట్లాడే నీ నైజం
నిర్మలమైన మనసుకు తార్కాణం
మంచిని ప్రేమిస్తావు మనిషిగా
చెడుకి ఝడవక శక్తివై విజృంభిస్తావు
కొరడాతో కొట్టి తట్టి తరిమెయ్యాలని చూస్తావు
పోరాడతావు ఆరాటపడతావు
పట్టుదల నీ ధ్యేయం
విశ్వాసమే నీ ఆయుధం
నిజాయితీతో నీదైన బాణీతో సాగిన
నీ రచనలే నీ ఆదర్శం
రెండు మార్లు అకాడమీ బహుమతిని అందుకున్నావు
ఉరితాడు నవల సుడిగుండంలో చిక్కుకుని
కొట్టుమిట్టాడే అబలలందరికీ
ధైర్యాన్నిచ్చే అస్త్రం
ఊపిరిపోసే ఉగ్గు
నిండుగా నూరేళ్ళు బతికి మెండుగా రచనలు చేసి
దండిగా ఎన్నెన్నో బహుమతులు గెలిచి
వర్ధిల్లాలని కోరుకుంటూ
అందిస్తున్నానీ చిన్ని కవిత
'ఉరితాడు' నవలకి నీవీనాడు
అక్షర నీరాజనాలందుకునేవేళ
అర్పిస్తున్నాను ఆత్మీయంగా
నా భావనా పుష్పాన్ని
కలికి సీతమ్మా
కలం చేతికర్రగా
కలకాలం నిలబడు
నవలా మణివై వెలుగొందు