'ఆమె' - బొమ్మారెడ్డి వెంకటరామిరెడ్డి
posted on Jan 18, 2012
'ఆమె'
- బొమ్మారెడ్డి వెంకటరామిరెడ్డి
మానవ మహారణ్యం దారుల్లో
మేము పధచారులం....
మనసుని పారేసుకుని
హృదయంతో జీవితాన్ని
వెదుకుతూ పోతాము!
అగాధం లాంటి హృదయంతో
ఎన్నెన్నో వేసినా నిండదు-
అదేమి చిత్రమో..
ఆమెవొక్క చూపుతో...
అమృతభాండమౌతుంది!!
నా కవితలు నీ కళ్ళలో గుచ్చుకుని
హృదయాన్ని రక్తసిక్తం చేస్తాయి....
ఆ భయంతోనే నేను
మౌనీశ్వరుణ్ణవుతాను!
'మళ్ళీ జన్మలో....' అంటావు
'మన ఇద్దరమూ...' అంటావు
ఈ వొక్క జన్మలోనే నీకోసం
ఎన్ని జన్మలెత్తానో ఎలా చెప్పను?
ఇద్దరమూ కలిసి నవ్వుకున్నాం
ఇద్దరమూ కలిసి ఏడ్చుకున్నాం.
కానీ నిరీక్షణాహారాన్ని
నా మెడలో వేసి వెళ్ళిపోయావు!
కలలోని అలలా
పాట వెళ్ళిపోయింది
తోట చిన్నబోయింది
హృదయం మళ్ళీ
కన్నీటి సముద్రం మీద నావయ్యింది!
సశేషం