నడక - శారదా అశోకవర్ధన్
posted on Jan 16, 2012
నడక
- శారదా అశోకవర్ధన్
ఎందాక ఈ నడక
ఎక్కడికి నడక
ఎప్పుడు మొదలెట్టానో తెలీదు
ఎంతవరకు వెళ్లాలో తెలీదు
ఊహ తెలిసిన నాటినుండి
నడుస్తూనే వున్నా....
ఎండలో వానలో
గాలిలో తేమలో
ఎడతెరిపి లేకుండా
నడుస్తూనే వున్నా.....
అప్పుడు నా ఎదనిండా ఊహలే
ఊహలకు అల్లుకున్న బంధాలు.....
నేలనాది గాలినాది
బతుకు నడిడ్ భావం నాది
అందరూ నావారే....
ప్రేమసముద్రంలో ఈదుకుంటూ
ఆశలపల్లకీలో ఊరేగుతూ
గడిపేశాను గతకాలాన్ని
ఎప్పుడు ఖాళీ అయిందో తెలీదు
నా ఎద గూడు
ఒక్కొక్క ఊహా ఇంకిపోయింది
ఊపిరిరొక్కటే పాడుకుంటోంది
భగ్నప్రేమికుడిలా ఏదో గీతం
నడవలేకపోతున్నాను ఊహలనొదిలి
నేలంతా రక్తపు మరకలే
గాలంతా మురికి వాసనే
నడక మానేద్దామనుకున్నాను
మందలించింది నడక అమ్మలాగ
బుజ్జగించింది
మళ్ళీ ఎక్కడైనా ఊహలు
కొత్త ఊపిరి పోసుకుని పలకరిస్తాఎమోనని
గుండెసావిట్లో నిండుకుంటాయేమోనని
నిదానించినా నిలిచిపోక
నడుస్తూనే వున్నాను
అరికాళ్ళకు ఆత్మవిశ్వాసాన్ని తొడుక్కుని....