బహుజనోద్దారకుఢు

బహుజనోద్దారకుఢు   వెనకబడిన వర్గాలకు వెన్నుముకాయన వెలుగులోకి నడిపేందుకు వెనకడుగేయలేదాయన ఆయాకాలాలకనుగుణంగా ఆదర్శమూర్తులుద్భవిస్తుంటారు చీకటినిండిన జనులను నడిపేందుకు నడిపించేందుకు వారిగుండెల్లో అలుముకున్న మూఢనమ్మకాలాచారాలను తరిమివేసేందుకు  వెలుగురేఖలై జీవితాలకు నవచైతన్యం నింపేందుకు బెదరని గుండెనిబ్బరంతో సడలని దీక్షధక్షతతో  ఆరిపోని జ్యోతి మన జ్యోతిరావు పులే కాంతి చదువే ప్రతి సమస్యకు పరిష్కారమని అది అందరిహక్కని మనుషులంతా అందుకోవాలని చాటిన సంఘసంస్కర్త పూలే ఎవరేమన్నా తాననుకున్నది చేసిచూపిన మహోన్నతుడు ఇంటి ఇల్లాలికి అక్షరాలు నేర్పి లింగభేదం చదువుకులేదని నిరూపించిన జ్ఞాననేత్రుడు సమాజం వెక్కిరించిన చావు ముందుకొచ్చినా సడలని సంకల్పంతో ముందుకుసాగిన ధీరత్వం ఈనాడైనా ఏనాడైనా ఆయనెప్పటికి మనందరి  గుండెల్లో చిరంజీవే ఆయన కలలను నెరవేరిస్తేనే నిజమైన భారతదేశం - సి. శేఖర్  

పత్రికలు

పత్రికలు   పలువిషయాలను  త్రికరణశుద్దితో  కల్మషం లేకుండా మనముందుంచేదే 'పత్రిక' అవనిపై జరిగే వార్తలనన్ని తాజాతాజాగ  తెల్లవారంగనే తేటపరిచేవి జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ జిల్లా గ్రామీణ స్థాయిలోని వార్తలన్నీ ముందుంచుతుంది న్యాయాన్యాయాలను  ఆవేదనలను ఆక్రందనలను ప్రభుత్వ పనులను పథకాలు వ్యాపారం క్రీడాలేకాదు క్రిమినల్ విషయాలను వినోదం విజ్ఞానం కథలు కవితలు ఎన్నెన్నో విషయాలను ఒక్కచోట పొందుపరిచి అందిస్తుంది పత్రిక పత్రిక శాసిస్తుంది  ప్రతిమనిషి పోకడలనుణ లోకమంతా తెలిసేలా పత్రిక అభినందిస్తుంది విజయం సాధించిన వినయవంతులను  నలుగురికి ప్రేరణనిచ్చేలా పత్రికలు మంచిని ఎత్తిపట్టి చెడును తరుముతాయి పత్రికలు ధరణికి సూర్య చంద్రులే సి. శేఖర్(సియస్సార్)  

ఇది కధ కాదు కదా

  ఇది కధ కాదు కదా     నువ్వు చెక్కిన శిలకు కన్నీళ్లోస్తే భయమెందుకు! నీ తపన ఈ శిలకు ప్రాణంపోయాలనే గాని, ఓ రాయిని నొప్పించాలని కాదు కదా! నీ కనులకు మెలుకొవస్తే కలవరమెందుకు! రేయి పగలు నీకనులకే గాని నీ కలకు కాదు కదా! నీ బ్రతుకు చిత్రాన్ని భగవంతుడు ముందే గీసేశాడని ఆలోచనెందుకు. తను సృష్టించాడే గాని, నువ్విలాగే బ్రతికేయమని నిన్నేమి శపించలేదు కదా! శిలకొచ్చిన కన్నీళ్ళు కృతజ్ఞత కాబోలు, నీకొచ్చిన కల నీ భవిష్యత్తు కాబోలు, శపించబడని ఈజన్మ గతజన్మ వరం కాబోలు. జీవితమంటే ఆస్వాదించటమే కాదు, త్యాగాలు కూడా ఉంటాయి. కలవరపెట్టే కలలే కాదు, కన్నీళ్ళతో కూడా సంతోషపడే కమ్మని అనుభవాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది కధ కాదు కదా! - Syed Tajuddin  

పల్లకి

పల్లకి   ప్రాణ సఖుడె నా కోసమై పంపినాడు పల్లకీ యన హృదయమ్ము జల్లుమనియె వీడని వియోగమున వేగు మ్రోడు మేను తలిరు తోరణమై సుమదామమాయె! చెదరు చేతుల నెటొ కయి  సేసుకొంటి మొయిలు వసనమ్ములో, ప్రొద్దు పొడుపు నగలొ ఏదొ కాలుచు హాయియో, యేదొ తేల్చు భారమో, యేమొ సైరింప నేరనైతి! కొసరు యొడల తూగాడుచు కూరుచుంటి పూల పల్లకీలో పూలమాల నేను! ఓ యనగ ఓహొహో యన బోయవాండ్రు దారి బడి నిల్చి చూచె యూరూరు నాడు! ఓ యనగ ఓహొహో యన బోయవాండ్రు వీటివెలుపల మేల్కొనె తోటతెరువు ఓ యనగ ఓహొహో యన బోయవాండ్రు తోట పొలిమేర కాలువ తొనకె నిదుర! ప్రణయ వల్లకి పల్లకీ! ప్రసవ భర వ సంత వల్లిక పల్లకీ! శక్రచాప వక్రరేఖ పల్లకి! మధుస్వప్న శాఖ పల్లకీ!   తెలుగు సాహిత్య చరిత్రలో, తొలి ఆధునిక కవి, తొట్టతొలి అభ్యుదయ రచయిత, గురజాడ అప్పారావు గారు. ఆయన పిదప భావకవిత్వోద్యమం ఆంధ్రదేశమంతా వరద గోదావరి వలె వ్యాపించింది.  భావకవుల్లో ధృవతారగా వెలిగిన కవి కృష్ణశాస్త్రి గారు. ఇదే తరంలో భావకవిత్వంతో మొదలుపెట్టి, అభ్యుదయ యుగప్రవక్తగా అవతారమెత్తిన వాడు శ్రీశ్రీ. గురుజాడ అభ్యుదయావేశానికి వారసుడైనవాడు.    గురుజాడ మొదలుకొని శ్రీశ్రీ దాకా, తొలితరం ఆధునిక కవుల రచనలను ఏరికూర్చిన కవితాసంకలనం, ముద్దుకృష్ణ గారి "వైతాళికులు". 1935 లో మొదటి ముద్రణ కాబడిన ఈ పుస్తకం తరువాత పలు ముద్రణలకు నోచుకున్నది. మా ఊరి శాఖా గ్రంధాలయంలో దీని తొలి ముద్రణ, భద్రంగా కాలికో బైండ్ చేయబడి వుండేది. కాకపోతే పేజీలు పాతబడి పసుపు పచ్చ వర్ణంలో వుండేవి.  1965-66 ప్రాంతాల్లో, ఇదే పుస్తకంలో,  పాఠశాల రోజుల్లో, కృష్ణశాస్త్రి గారి పై ఖండిక, "పల్లకీ" తొలిసారి చదివినాను.    వైతాళికులు సంకలనంలో ప్రచురింపబడినా, ఈ కవిత "కృష్ణపక్షం-ప్రవాసం-ఊర్వశి" ట్రయాలజీ లోనిది కాదు. తరువాత కాలానిది. పై ట్రయాలజీ  అత్మాశ్రయం. "పల్లకీ" ఆత్మాశ్రయమైనది కాదు.   1935 తదనంతరం కృష్ఢశాస్త్రి గారు సైతం అభ్యుదయోద్యమపు తీర్థం పుచ్చుకున్నారు. అట్టి సామాజిక  కవితలన్నో కలిపి "పల్లకీ" అనే శీర్షికతో పుస్తకం అచ్చువేయబడింది. కాబట్టి, కాలనిర్ణయం దృష్ట్యా, "పల్లకి" 1935 ముందరిదైనా, స్వభావం దృష్ట్యా 1935 తరువాత తరానిది.   కృష్ఢపక్షం ట్రయాలజీలో,  భావతీవ్రత, దుఃఖభారం, క్రమేపీ పెరుగుతూ పోతుంది. ఉదాహరణ ఊర్వశిలోని క్రింది కవిత:   "నీవు తొలిప్రొద్దు నునుమంచు తేవెసొనవు నీవు వర్షాశరత్తుల నిబిడ సంగ మమున పోడమిన సంధ్యాకుమారివి, ఈవు తిమిర నిశ్వాసములు మాసి కుములు శర్వ రీ వియోగ కపోల పాళికవు, నిజము నే గళమ్మార పాడుకొనిన అఖాత శోకగీతిక లందీవె శోకగీతివి! ఊర్వశీ! ప్రేయసీ!"   ఇట్టి అపూర్వ కవితలు ఆరోజుల్లో తమ చుట్టూతా ఆంధ్రపాఠకులను ఉన్మాదులుగా తిప్పుకున్నాయి. కృష్ఢశాస్త్రి గారికి star status లభించింది.   కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచం బాధ శ్రీశ్రీకి బాధ అంటాడు గుడిపాటి వెంకటచలం. కృష్ఢపక్షం ట్రయాలజీ తర్వాత కృష్ణశాస్త్రి లోని రచయిత తన స్వీయ నిర్వేదాన్ని వీడి,  ప్రపంచం బాధనే తన బాధగా మలుచుకున్నాడు. ఈ కోవకు చెందిన కవితలనేకం "పల్లకి" సంపుటిలో చోటు చేసుకున్నాయి.   కళాశాల దినాల్లో ఇదే శాఖాగ్రంధాలయంలో నేను చదివిన మరొక పుస్తకం ఆచంట జానకిరామ్ "సాగుతున్న యాత్ర". కృష్ఢశాస్త్రి గారికి ఆయన ఆప్తమిత్రుడు. ఆ పుస్తకంలో ఒక సంఘటన. జానకిరామ్ రైల్లో ఒక ఊరికి వెళుతున్నాడు. హటాత్తుగా రైల్వేస్టేషన్ కు కృష్ఢశాస్త్రి రాక. ఆయన ముఖంలో ఉద్వేగం. "కొత్త కవిత రాసినాను విను" అన్నాడు జానకిరామ్ తో. దానిలోని మొదటి వాక్యం: "   "ప్రేయసి సోయగమ్మునకు లేదు శరీరము, లేదు మేను, మా తీయని ప్రేమకేని; కలదే యెడబాటిక మాకు?"   "నా ప్రేయసి అందం అశరీరమైనది. మా ప్రేమ కూడా అశరీరమైనది. మాకిక ఎడబాటెక్కడిది?" ఈ ఆలోచనతోనే బహుశా కృష్ఢశాస్త్రి  లోని కవి తన వియోగ దుఃఖాన్ని జయించి, క్రొత్త జగత్తులో పడినట్లు గోచరిస్తుంది. ఈ కవిత కూడా, "పల్లకి" సంపుటిలో చోట చేసుకున్నది. పల్లకి సంపుటిలో చోటు చేసుకున్న మరొక్క కవిత "బ్రహ్మర్షి". ఈ సుదీర్ఘ ఖండికలో కృష్ఢశాస్త్రి తన గురుదేవుడు రఘుపతి వెంకటరత్నం నాయుడుకు సమర్పించిన నివాళి అపూర్వమైనది.    "ఈ జడజీవితమ్ము పలికించితి వీ యఘపంకమందు అంభోజము మొల్వజేసితివి, అపూర్వము నీ దయ; ఈ నిశీధి నీరాజనమెత్తినావు, విపులమ్మగు నీ యెద నిండెనే శరద్రాజిత చంద్రకాంతులు, అమృతమ్ములు, స్వర్గ లతాంత వాసనల్"   అంటాడు రచయిత అపార పులకితస్వాంతంతో.   పల్లకి సంపుటిలో అనేక ఆశావాదపు కవితలు తారసపడతాయి.    "ప్రాతరుజ్జ్వలాకాశం భావి మందిరావాసం ముందున్నది, ముందున్నది మనదే, మనదే మంది కృత మహాయుగం!" వంటివి. "పల్లకి" సంకలనంతో కృష్ఢశాస్త్రి ప్రపంచ మానవునిగా అవతరిస్తాడు. విశ్వకళ్యాణం కోరుకుంటాడు.   "నా నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుషుమా సుధాగాన మంజువాటి" అని ఒకానొకప్పుడు మబ్బుల్లో తేలిపోయిన కవి ఎక్కడ? "కమ్మగా బ్రతికితే గాంధీమతం, మనిషి కడుపు నిండా తింటె, గాంధీ యుగం" అని చాటిన కవి యెక్కడ?   ఈ సంకలనంలో "పల్లకి" కవితాఖండిక ఒకటే ప్రణయ ఖండిక.  ఆధునిక ప్రయాణ సౌకర్యాలు లేని ప్యూడల్ యుగానికి చెందినది. సంపన్నులు పల్లకీలలో పోయే కాలం. విచిత్రమేమంటే, ఈ కవితలో సైతం నాయిక, వియోగ దుఃఖమనే సుదీర్గ రాత్రి నుండి, భర్తతో పరస్పర సమాగమనమనే  వేకువ వైపుకు పయనిస్తుంది.   ఈ కవిత తొలిసారిగా ప్రచురితమైనప్పుడు, సమావేశమొకటి  తీరాంధ్ర పట్టణమొక దానిలో జరిగింది. కృష్ఢశాస్త్రి గారు సమావేశంలో లేరు. విశ్వనాథ వారు మాత్రం వున్నారు. వేదికపై ఒకరీ కవితను గానం చేయగా, అదే వేదికపై ఆ కవితను వేనోళ్ళ పొగిడిన వారిలో విశ్వనాథ కూడా ఒకరు. కొందరు సభికులకు మాత్రం ఆగ్రహం వచ్చింది. ముఖ్యంగా ఖండిక లోని రెండో పద్యంపై. "మొయిలు వసనమ్ములు", "ప్రొద్దుపొడుపు నగలు", "ఏదో కాల్చు హాయి" ఏదో తేల్చు భారం" వీటి అర్ధం ఏమిటి? అని వారు నిలదీసినారు. అసలైన కవి అక్కడ లేడాయె. జవాబు ఎవరు చెబుతారు.    పై కవితలో ఒక వివాహితకు ఆమె భర్త  వియోగదశ పిదప పల్లకీ పంపుతాడు. అది  వియోగపు నిశాంతమని సూర్యోదయమనీ  ఆ యువతి స్వగతంగా ఈ ఖండిక ప్రతిపద్యంలోనూ చాటుతుంది.   మొదటి పద్యంలో ఆ యువతి తానిన్నాళ్ళూ మ్రోడువారిన మానుననీ, ఇప్పుడు వసంత తరుశాఖనైనాననీ చెబుతున్నది.    రెండవ పద్యంలో ఆమె ఆకాశంలో తేలిపోతున్నట్లుగా భావిస్తున్నది. తాను ధరించేవి సువర్ణాభరణాల వంటి ఉదయికాశపు  బంగారు కాంతులని తెలుపుతున్నది . తన రమణీయ వస్త్రాలు ఉదయికాశాన్ని కప్పిన వింతవింత కాంతుల మేఘసమూహాలే అంటున్నది. వియోగమనే అనంత నిశా తిమిరాలను వేకువ దహిస్తున్న హాయి ఆమె మనస్సులో. అదృశ్యహస్తాలు భారం మోయగా, మబ్బుల పల్లకిలో తేలిపోయే అనుభూతి. "సైరింపనేరనైతి" అన్న పలుకు "హాయినే భరియింపలేనోయి దేవ" అన్న రవీంద్రనాథ్ టాగోర్ పంక్తులను జ్ఞాపకం చేస్తుంది.   మూడవ పద్యంలో ఆ యువతి  "పూల పల్లకిలో కూర్చున్న పూలమాల" గా తనను తాను భావించుకుంటుంది.   బోయవాండ్రు ఓహోం! ఒహోంహోం! అన్నప్పుడు వూరు వూరే దారికిరువైపులా నిలబడి చూస్తుంది. ఓహోం అని బోయవాండ్లన్నప్పుడు, వూరి బయట తోటతెరువు మేలుకుంటుంది. బోయవాండ్రు ఓహోం అన్నప్పుడు తోట పొలిమేరకాలువ సైతం మేలుకుంటుంది.   ఈ పల్లకీ ప్రణయ వల్లకి. ఈ పల్లకీ పూలతో అలంకరించబడిన వసంత వల్లిక. ఈ పల్లకీ ఇంద్రధనువు యొక్క వక్రరేఖ. ఈ పల్లకీ మధుమాసపు స్వప్నశాఖ.   అడుగడుగునా శబ్దచిత్రాలతో, ఆద్యంతం రసమయంగా,  ఆనందానుభూతిని కలిగిస్తూ, పాఠకునిపై చెరగని ముద్ర వేస్తుంది 'పల్లకీ".    ఆంగ్లంలో పల్లకిపై సరోజిని నాయుడు రచించిన కవిత సైతం కృష్ఢశాస్త్రి గారి పల్లకీ వలనే ఆపాత మధురమైనది.   నివర్తి మోహన్ కుమార్        

ఈ క్షణమెంతో హాయి

ఈ క్షణమెంతో హాయి   రాలిపోతున్న ఉదయాలనో  వాడిపోతున్న పూలనో తలుచుకొని  ఒక సాయంత్రం కుమిలిపోతూ వుంటుంది  వేకువల కోసం ఆలోచించలేని కళ్ళు  మోడైపోయిన చెట్ల కింద  ఆకులు విడిచిన ముద్రలకు ఇపుడెక్కువగా విలపిస్తాయి  సరిగ్గా అపుడనుకుంటాను  నాతో లేవన్న విరహాల కంటే  నాలో వున్న జ్ఞాపకాల సాంద్రత ఎక్కువ కదూ అని !  అవును.. నువ్వు రాలేవన్న నిజం కంటే  నీ ఊసుల సజీవత్వమెప్పటికీ ఎనలేని సంతోషం ప్రేమించబడాలనే ఆశలు లేని  డిటాచ్డ్ అటాచ్మెంటో విడువని తృప్తి  ఆజ్ రుస్వా తేరి గలియోఁమే మెుహాబ్బత్ హోగీ  అని శాపనార్థమేమీ పాడలేను కానీ  నువు రాక ముందు జీవితం గురుతైనా లేని  ఈ క్షణమెంతో హాయి   -సరిత భూపతి 

పరిష్కారం ఎప్పుడో..?

  పరిష్కారం ఎప్పుడో..?   ఏంటో అడుగలా బయటెట్టాలంటే పట్టపగలే భయం ముక్కుకు ముసుగేసుకుని శానిటైజరెపుడు పక్కనెట్టుకుని షాపింగుకెల్లొస్తే సముద్రాన్నీదొచ్చినట్లు చూపులెపుడు గమనిస్తుంటాయ్ పరిస్థితేంటని పాలపాకెట్టు రోజు తానమడుతది కూరగాయలేమో పసుపునీళ్ళలో జలకాలు పెండ్లికూతురిలా తాజాగా ఇంట్లో కాలుపెడుతున్నవి కషాయాలిపుడు టీ కాఫీలాయే మొలకెత్తినగింజలు  డ్రైఫ్రూట్స్ మారినాహారపలవాట్లు ప్రాణాయామం నిత్యవ్యాయమం శరీరానికి నూతనోత్సాహం అయినా భయమే మరణమనే చీకట్లు విశ్వమంతా విస్తరిస్తున్నాయ్ జీవితాన వెలుగుల్ని చిదిమేస్తున్నాయ్ సామాజికదూరానికర్థం మారింది కంటైన్మెంట్లు తూతూమంత్రమే దవాఖానాలో మంచాల్లేవ్ బయటతిరుగుతున్నరందరు పైసలున్నోడొకచోట లేనోడింకొకచోటన్నట్టు రెకమండేషన్లాయే రోజురోజుకు మహమ్మారి కమ్మేస్తూ కుమ్మేస్తుంది పరిష్కరమెపుడోనని ప్రపంచమెదురుచూస్తుంది సి. శేఖర్ (సియస్సార్)