RELATED ARTICLES
ARTICLES
అమెరికాలో కనువిందు చేసి నయనానందం కలిగించే వసంతఋతువు

....కనకదుర్గ    


 

వసంతాగమనం  

"మ్రోడువారిన చెట్లకు,  

మ్రోడువారిన మనసులకు,

చీకటిలో, చలిలో మునగదీసుకుని

విసుగెత్తిపోయిన మనసులను

సేదదీరుస్తూ వచ్చింది

వసంతం.

కొత్త చిగుళ్ళతో,

పక్షుల కిల కిలా రావాలతో,

విరబూసే పూవులు వెదజల్లే

సుగంధాలతో,

                                    ఎటు చూసినా,                                      

అందం ఆనందం కలిసి

నిరాశ నిస్పృహలు  

అలుముకున్న మనసులకు

జీవితంపై ,

కొంగ్రొత్త ఆశలను తీసుకువచ్చేదే  

వసంతం.

చలి ఎక్కువగా వుండే ప్రదేశాల నుండి వెచ్చగా వుండే ప్రదేశాలకు తరలి వెళ్ళిన పక్షులు తిరిగి రావడంతో వాటి కిల కిలా రావాల గానంతో తెల్లవారడం, అప్పటివరకు చలికి మ్రోడువారిన చెట్లు మొగ్గలు తొడిగి, విరబూసి ప్రకృతి కాంత అందమైన విరిబాలల తివాచీ పరచి నయనానందం కలిగిస్తున్నట్టుగా వుంటుంది. అమెరికాలో వసంతాగమనంతో చెట్లు ముందుగా పూలు పూసి ప్రకృతి అందాలను మానవులకి చూపించి ఆ తర్వాత పచ్చటి చిగుళ్ళు తొడిగి ఆకులు చిగురిస్తాయి. చెర్రి బ్లాసమ్స్, మాగ్నోలియాస్, డాగ్ వుడ్ పూలు, రాయల్ ఎంప్రెస్ పూలు లాంటివి పూల పందిళ్ళు వేసి ప్రపంచంలో ఇంతకంటే అందం, ఆనందం వుంటాయా అనిపిస్తాయి. 

 

భూమిపైన గడ్దిలో రక రకాల రంగులతో పూసే పూలు సైతం 'అబ్బా, ఎంత అందమైన పూలు,' అనిపిస్తాయి అంతే కాదు రక రకాల పూలు విరబూసి పూల తివాచీలు పరిచినట్టుగా వుంటాయి.  పసుపు పచ్చని డాఫడిల్స్, వసంతం రాగానే ముందుగా విరబూసే చలితో విసుగెత్తిన, ఒకరకమైన నిరాశా నిస్పృహలకు లోనయిన మనసులకు ఆహ్లాదాన్నిస్తూనే ఆశని చిగురింపచేస్తాయి.  నేను ఇంటర్మీడియట్ లో వున్నప్పుడు విలియమ్ వర్డ్స్ వర్త్, ఆంగ్ల ప్రకృతి కవి రాసిన'డాఫడిల్స్'కవిత చదివినప్పటినుండి వాటిని చూడాలని చాలా కోరికగా వుండేది.  నేను ఆ పూలు కేవలం ఇంగ్లాండ్ లోనే వుంటాయనుకున్నాను.  మేము అమెరికాలో అడుగు పెట్టింది వసంతంలోనే, అప్పుడు మొదట కనిపించినవి డాఫడిల్స్, చెర్రి బ్లాసమ్స్. 

 

ఇంక చూడండి నా ఆనందానికి అవదుల్లేవు.  ట్యులిప్స్ ని చూడగానే మనకి సిల్ సిలా లోని 'దేఖ ఏక్ క్వాబ్ తొ యే సిల్ సిలే హువే, దూర్ తక్ హై నిగాహోమే గుల్ ఖిలే హువే,' పాట గుర్తుకొస్తుంది.  ఎర్రటి, పచ్చటి, గులాబి రంగు, వంగపండు రంగు, తెల్లటి ట్యులిప్స్, కొన్ని రకాల ట్యులిప్స్ రెండు, మూడు రంగులు కలిసి వుంటాయి ఇవి నిజంగా రంగు రంగుల పూల మఖ్మల్ తివాచీ పరచినట్టుగానే అనిపిస్తాయి. 

 

మార్చ్ నెలనుండి చెట్లపై విరబూసే పూలు ఏప్రిల్ నెలాఖరు నుండి లే లేత పచ్చటి చిగుళ్ళు తొడిగి కొన్నాళ్ళు లేలేత ఆకులతో చెట్లు ఎంతో అందంగా వుండి ఆ తర్వాత ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.  రోడ్డుకిరువైపులా వుండే చెట్లు చల్లటి నీడనిస్తూ ఎండాకాలం ఎండ వేడి నుండి కాపాడతాయి అదీ గాక ఆ పచ్చటి చెట్ల మధ్య నుండి వెళుతుంటే పచ్చటి పందిళ్ళ మధ్య నుండి వెళుతున్నట్టుగా వుంటుంది.

 ఒకో నెలలో కొన్ని రకాల పూలు విరబూసి మనకి కనువిందులు చేస్తాయి.  మే నెలలో అజిలియస్ పూలు చూడడానికి కొద్దిగా గన్నేరు పూల లాగ వుంటాయి, రక రకాల రంగుల్లో వుండి అన్నీ ఒకటేసారి విచ్చుకుంటాయి.  రొడడండ్రన్స్ కూడా ఈ కుటుంబానికి చెందినవే కానీ అవి పెద్ద గుత్తులుగా చెట్టునిండా విరగబూస్తాయి.  అన్నీ రకాల, రంగుల గులాబీలు ఎక్కడ బడితే అక్కడ చెట్టు నిండా విరగబూసి కనిపిస్తుంటాయి. అందమైన ఐరిస్ పూలు కూడా ఒకటే సారి విచ్చుకుని కొన్ని రోజులు కనువిందు చేసి ఎండిపోతాయి. ఇవి కొన్ని రకాలు మే నెలలో పూస్తే, డచ్, జపనీస్ ఐరిస్ పూలు జూన్ నెల నుండి పూస్తాయి. 

 

జూన్ నెలలో అన్నీ రకాల లిల్లీ పూలు విరగబూసి సువాసనలు వెదజల్లుతుంటాయి.  హనీ సకల్ పూలు, మల్లెపూల లాగ వుండి మంచి సువాసనను కలిగి వుంటాయి.  ఈ తీగలు ఎక్కడ బడితే అక్కడ పెరుగుతాయి.  ఇవి సామాన్యంగా పాడయిపోయిన గోడలను దాచడానికి, పచ్చగా కనిపించడానికి ఫెన్సింగ్ లపైకి, గోడలపైకి పాకిస్తుంటారు.  వీటిలో ఎన్నో రకాలుంటాయి.   వీటిని హర్బల్ మందులలో వాడతారు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందమైన పూలు వసంతాగమనంతో విరగబూసి ఎండాకాలం అయిపోయేదాకా రకరకాల పూలు పూస్తూ నయనానందం కలిగిస్తుంటాయి. 

 

ఇక్కడ పూలు సిటీలో, సబర్బన్ ఏరియాల్లో, టవున్స్ లో, పెద్ద పెద్ద తోటల్లో పూసే పూలని చూసి ఆనందించాల్సిందే కానీ వాటిని తెంపకూడదు, తెంపితే ఫైన్ వేస్తారు.  ఇళ్ళల్లో పూసే పూలు కూడా చాలా మటుకు చెట్లపైనే వుంచుతారు.  పెద్ద పెద్ద గార్డెన్లు వున్న వారు ఫ్రెష్ పూలు, ఫ్లవర్ వాజుల్లో పెట్టుకుంటారు, పూల బోకేలు చేసి ఫ్రెండ్స్ కిచ్చుకుంటారు. 

మనుషుల మానసిక ఉల్లాసానికి, సంతోషానికి, ఆనందానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా కానీ ప్రకృతి కొన్ని రోజులే అయినా అందమైన పూలతో ప్రసాదించిన వసంతమనే వరం ముందర ఏదీ సాటి రాదనిపించేంత హృద్యంగా, కమనీయంగా వుంటుందిక్కడ వసంతం. మనకి ఎలాంటి బాధలున్నా, సమస్యలున్నా కాసేపు దగ్గరగా వుండే పూల తోట కెళ్ళి కూర్చుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా వుంటుంది, అన్నీ మర్చిపోతాము కాసేపయినా.  దీన్నే ప్రకృతి మన మనసులని సేద దీర్చడం అనండి, లేదా చికిత్స చేయడం అనండి, అదే పకృతిమాత ఒడిలో వుండే మహిమ! అవునా, కాదా!  నా మాట నమ్మాలంటే మీ ఇంటికి దగ్గరలో ఏదైనా మంచి పూల తోట వుంటే కాసేపు వెళ్ళి కూర్చొని రండి, మీకే తెలుస్తుంది తేడా. 

ప్రతి ఒక్క చెట్టు, మొక్క అందమైన పూలతో అలంకరించుకుని, 'ఇదంతా కేవలం మీకోసమే సింగారం, అలంకారం,' అని నయనానందం కలిగించి వారం, రెండు వారాల్లో అన్ని రాలిపోయే ముందర ఆకులు చిగురించడం మొదలు పెడతాయి, కొన్ని రకాల పూలు ఎక్కువ కాలం వుంటాయి. ఎన్ని రోజులైనా సంతోషంగా గడిపి రాలిపోతాయి, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి పుష్పవిలాపంలో పూలలా.

" ఆయువు కల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవ తల్లి జాతీయత తీర్పున్,

తద్వీయ కరమ్ములలోన స్వేచ్చగా నూయలలూగుచును, మురియుచుందుము,

ఆయువు తీరినంతన హాయిగా కనుమూసెదము ఆయమ్మ కాలివ్రేళ్ళపై!"

 

TeluguOne For Your Business
About TeluguOne
;