RELATED ARTICLES
ARTICLES
బేకర్స్ ఫీల్డ్ లో శ్రీవేంకటేశ్వరుని క్రొత్త నివాసం

దక్షిణ కాలిఫోర్నియా లోని బేకర్స్ ఫీల్డు హిందూ దేవాలయం శ్రీ కళ్యాణ శ్రీనివాసుని ఆగమనంతో క్రొత్త రూపును సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడితో పాటు, శివలింగం, పార్వతీ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర, అయ్యప్పస్వాముల ప్రతిమలతో దక్షిణ భారతంలోని ప్రముఖ దేవతా మూర్తుల ఆగమనాన్ని స్థానిక భారతీయ కుటుంబాలు ఘనంగా ఆహ్వానించాయి. చెన్నయ్ లో పద్మశ్రీ ముత్తయ్య స్థపతి చెక్కిన ఆరడుగుల శివలింగం, ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద శివలింగమని భావిస్తున్నారు.

శుక్రవారం నుంచి ఆదివారం వరకూ జరిగిన ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంతోమంది స్థానికులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ఆనందించారు. అనేక పూజలు, గణపతి, సుదర్శనాది హోమాలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక పూజారులు సముద్రాల వేంకటాచలపతి, పరేష్ పాండ్య లతో పాటు, దక్షిణ కాలిఫోర్నియాలోని వివిధ దేవాలయాల్లోని అర్చకులు సముద్రాల సోదరులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, మరియు కంకార్డు నుంచి వచ్చిన విశ్వనాధ్ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

దశదర్శనాల్లో భాగంగా గో, అశ్వ, గజ దర్శనాలను కూడా ఏర్పాటు చేసారు. హాలీవుడ్ నుంచి వచ్చిన ఆడ ఏనుగు దేవుని ప్రతిమల ముందు మోకరిల్లి, తొండం ఎత్తి నమస్కారం చేసిన అద్భుత దృశ్యానికి భక్తులందరూ పులకించిపోయారు. ప్రాణప్రతిష్టలాంటి అరుదైన కార్యక్రమాన్ని వీక్షించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పలువురు అభిప్రాయపడ్డారు. అమెరికాలో వున్నామన్న విషయాన్ని మర్చిపోయే రీతిలో, గోమాత, అశ్వం, ఏనుగులతో పాటు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ప్రతివొక్కరూ అబ్బురపడ్డారు. ఈ ఆలయ విస్తరణ స్థానికులకే కాకుండా దగ్గర ప్రాంతాల్లో నివసించే అనేక భారతీయ కుటుంబాల ఆధ్యాత్మిక అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ "పదివేల శేషుల పడగలమయమైన హరివాసము మనవూరికి రానే వచ్చింది, ఇంతకుమించి ఇంకేమి కావాలి" అన్నారు ముత్యాల రామసుబ్బరావు. "ఇలాంటి అరుదైన అవకాశం భారత దేశం లో పుట్టి పెరిగిన మాకు కూడా ఎప్పుడూ కలుగలేదు. మన దేశానికి దూరంగా వున్నా, మనవైన ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మాకూ, మా పిల్లలకూ కలగడం చాలా సంతోషంగా వుంది." అని గోగులపాటి మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతులు అన్నారు. సుధా రెడ్డి మాట్లాడుతూ "మనదేశంలోని వివిధ ప్రాంతాలవారందరూ ఒక కుటుంబంగా కలసి ఈకార్యక్రమాన్ని జరుపుకోవడం చాలాబాగుంది" అన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;