RELATED EVENTS
EVENTS
చికాగోలో అంగరంగ వైభవంగా తెలుగు ఉత్సవం

 

 

చికాగోలో  అంగరంగ వైభవంగా తెలుగు ఉత్సవం

 

సంబరాల వేదికను ప్రకటించిన నాట్స్
 చికాగోలో తెలుగు ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు కళా వైభవంతో పాటు తెలుగు ఆట, పాట చికాగోలోని తెలుగు వారికి ఐక్యతను  మరోసారి చాటి చెప్పింది. చికాగో తెలుగు అసోషియేషన్ సీటీఏ తెలుగు ఉత్సవం 2016 పేరిట నిర్వహించిన ఈ సంబరాలు ఆద్యంతం తెలుగు కుటుంబాలకు తియ్యటి అనుభూతులు మిగిల్చాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, సీటీఏలు సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేశాయి.తెలుగు ఉత్సవం ప్రారంభమే ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగింది. విఘ్నాధిపతి వినాయకుడి పాటతో ప్రారంభమైన ఈ తెలుగు ఉత్సవానికి వచ్చిన అతిధులకు సీటీఏ తెలుగు ఉత్సవం సమన్వయకర్త శ్రీధర్ ముమ్మనగండి, సుజనా ఆచంట, మదన్ పాములపాటి స్వాగతం పలికారు.
 
ప్రముఖ సినీ గాయకురాలు శ్రీమతి చిత్రతో పాటు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గాయకులు మనో,  సునీత, హేమచంద్ర, కల్పన, ఉమానేహ విజయప్రకాష్  తదితరులు  తమ పాటలతో  తెలుగు ఉత్సవంలో జోష్ నింపారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, నాట్స్ ఎక్స్ క్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కోనేరు, నాట్స్ డైరక్టర్ శ్రీధర్ కేశాని, నాట్స్ డాలస్ ప్రతినిధి  అమర్, ఆస్టిన్ చాప్టర్ ప్రతినిధి రాజేష్ చిలుకూరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.. తెలుగు సినీ హస్య కళకారులు చలాకీ చంటి, రాకెట్ రాఘవ ఈ ఉత్సవంలో నవ్వులు పూయించారు.
 
సీటీఏ, నాట్స్ కలిసి చేపడుతున్న కార్యక్రమాల గురించి సీటీఏ ప్రెసిడెంట్ నాగేంద్ర వేగే వివరించారు. అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణకు చికాగో తెలుగు సంఘం గత ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల గురించి నాగేంద్ర వేగే తెలిపారు.  గత ఏడాది ఇమ్మిగ్రేషన్ హెల్ఫ్ లైన్ ద్వారా అందించిన సేవలు, ఫీడ్ మై హంగ్రీ చిల్డ్రన్ కోసం సేకరించిన 250,000 ఆహార ప్యాకెట్లు, మధర్స్ డే, స్పోర్స్ట్ ఫెస్టివల్ నిర్వహించిన తీరు గురించి నాగేంద్ర వేగే వివరించారు.
 
చికాగో తెలుగు ప్రజల కోసం సీటీఏ, నాట్స్ కలిసి చేస్తున్న కార్యక్రమాలను నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ ప్రశంసించారు. సేవే గమ్యం అంటూ ప్రారంభించిన నాట్స్ తెలుగువారి 24x7 హెల్ఫ్ లైన్  ఏర్పాటు చేసిన తొలి తెలుగు సంఘమని ఆయన గుర్తు చేశారు. నాట్స్, సీటీఏ ఆశయాలు ఒక్కటే కావడం పై మోహన కృష్ణ మన్నవ హర్షం వ్యక్తం చేశారు.  నాట్స్ 5 వ తెలుగు సంబరాలకు వేదికను కూడా మోహన కృష్ణ మన్నవ ఇదే వేదికపై ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ 30, జులై 1,2 తేదీల్లో చికాగోలోని శాంబర్గ్ రెన్నైస్సన్స్  ..ఇలినాయిస్ లో జరగనున్నాయని తెలిపారు. నాట్స్ చికాగో తెలుగు సంబరాల కన్వీనర్ గా రవి అచంటను మోహన కృష్ణ మన్నవ ప్రకటించారు.
 


చికాగో వేదికగా నాట్స్ తెలుగు సంబరాలు  చేయాలని  నిర్ణయించడంపై నాట్స్ జాతీయ కార్యవర్గానికి  సీటీఏ వ్యవస్థాపకులు నాట్స్ మాజీ అధ్యక్షులు రవి అచంట ధన్యవాదాలు తెలిపారు. తమకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని నాట్స్ తెలుగు సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు తమ సర్వశక్తులా కృషి  చేస్తామని రవి అచంట అన్నారు.
 
ఎంతో ఆహ్లదకరంగా జరిగిన తెలుగు ఉత్సవానికి తెలుగు కుటుంబాలు తరలివచ్చాయి. దాదాపు 1200 మందికి పైగా తెలుగువారు ఈ ఉత్సవానికి  విచ్చేశారు. చికాగో తెలుగు యువత అంతా తరలిరావడంతో  ఆద్యంతం ఇది ఎంతో ఆహ్లదకరంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని ఇంతగా విజయవంత చేసినందుకు నాగేంద్ర వేగే టీంపై ప్రశంసల వర్షం కురిసింది.
 
గత ఏడాది నుంచి సీటీఏ ప్రెసిడెంట్  నాగేంద్ర వేగే నాయకత్వంలో  సీటీఏ కార్యనిర్వహక కమిటీ చేస్తున్న సేవలను సీటీఏ బోర్డ్ ప్రెసిడెంట్ రావు అచంట కొనియాడారు. సీటీఏ సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలను ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. ప్రస్తుత సీటీఏ కార్యనిర్వహక కమిటీనే మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్టు  రవి అచంట ప్రకటించారు. నాట్స్ సంబరాలకు  ఇదే టీం పనిచేస్తుందని ఆయన తెలిపారు. సీటీఏ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నాగేంద్ర వేగే,  వైస్ ప్రెసిడెంట్ గా మదన్ పాములపాటి, సుజనా అచంట,వెంకట్ యలమంచలి, శ్రీధర్ ముమ్మనగండి,  సెక్రటరీగా సుబ్బారావు పుట్రేవు, జాయింట్ సెక్రటరీగా రాజేష్ వీడులముడి, కోశాధికారిగా వెంకట్ గ్యాజంగీ, సంయుక్త కోశాధికారిగా హవీలా దేవరపల్లి కొనసాగనున్నారు
 
 సీటీఏ ఆవిర్భావం, లక్ష్యాల గురించి ప్రవీణ్ మోటూరి వివరించారు. సీటీఏ మిగిలిన తెలుగు సంఘాలకు ఎలా ఆదర్శంగా నిలుస్తుందనేది ప్రవీణ్ తెలిపారు. తెలుగు ఉత్సవం అద్భుతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, డోనర్స్, స్పాన్సర్స్ కు సీటీఏ మాజీ ప్రెసిడెంట్ మూర్తి కొప్పాక ధన్యవాదాలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;