RELATED EVENTS
EVENTS
నాట్స్ సాహితీ సభ రెండవ రోజు విశేషాలు





డల్లాస్ లో నాట్స్ సాహితీ సభలు రెండవ రోజు కూడా చాలా ఘనంగా జరిగాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి శత జయంతితో రెండవరోజు సాహితీ సభలు ప్రారంభమయ్యాయి.పాపయ్య శాస్త్రి గారి మనవడు శ్రీనాథ్ జంధ్యాల గారు ఈ కార్యక్రమానికి సంధాతగా వ్యవహరించారు. ప్రముఖ నటులు, గాయకులు అయిన డా.అక్కిరాజు సుందర రామకృష్ణ గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను చక్కగా పాడారు. ఈ ప్రపంచంలో సూర్యచంద్రులున్నంత వరకు పాపయ్య శాస్త్రి గారి పద్యాలు అందరికీ గుర్తుండి పోతాయన్నారు.ఈ సందర్భంగా డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడు, మనవరాలు కుటుంబ సమేతంగా సత్కరించారు.


పద్య వాణీ విన్యాసం కార్యక్రమంలో సమైక్యభారతి సత్యనారాయణ, శ్రీ డి.ఎస్.డీక్షిత్, ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాజా సురేష్ గారు నిర్వహించారు. శ్రీకృష్ణ రాయబారం, శ్రీనాధుడు, సత్య హరిశ్చంద్ర నాటకాల నుండి కొన్ని పద్యాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు.



ప్రముఖ కవులయిన శ్రీ చంద్రబోస్, సిరా శ్రీ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ గారితో మా బాణి-మీ వాణి శీర్షికన ఆశువుగా గేయ రచన కార్యక్రమం డా.జువ్వాడి రమణ గారి ఆధ్వర్యంలో ప్రేక్షకుల చప్పట్లతో మారుమోగింది. మహారాజపురం రాముగారు శ్రీ రసరాజు గారిని పరిచయం చేస్తూ అసెంబ్లీ రౌడీ సినిమాకి  వ్రాసిన "అందమయిన వెన్నెలలోనా" పాటను పాడారు. ఈ పాటకు కళాసాగర్ అవార్డు వచ్చిందని రసరాజు గారు గుర్తు చేసుకున్నారు.  శ్రీ సిరా శ్రీ గారిని పరిచయం చేస్తూ "ఇట్స్ మై లవ్ స్టోరీ" సినిమా నుండి "నిన్నలా లేదే, మొన్నిలా లేదే" పాట పాడారు.చంద్రబోస్ గారిని పరిచయం చేస్తూ ఝుమ్మంది నాదం సినిమా నుండి దేశమంటే మతం కాదు పాట పాడారు.మగధీర సినిమాకి పంచదారా బొమ్మ,బొమ్మా పాటను గుర్తుకు తెచ్చుకుంటూ చంద్రబోస్ గారు ఆ పాట అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.కన్నడ, మళయాల, తమిళ బాణీలకు వడ్డేపల్లి కృష్ణ, సిరా శ్రీ, రసరాజు మరియు చంద్ర బోస్ గారు చక్కగా తెలుగు వాణిలను వినిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డాలస్ నుండి శ్రీ మద్దుకూరి చంద్రహాస్, రాయవరం భాస్కర్, దివాకర్ల మల్లిక్ గారు కూడా పల్లవి అందించి అందరి చేత "శెభాష్" అనిపించుకున్నారు. మల్లవరపు అనంత్ గారి నవ్వు మీద రసరాజుగారు ఆశువుగా పాట పాడి అనంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసారు.అన్ని పాటలను మహరాజపురం రాజు గారు, డాలస్ ఆస్థాన గాయని జ్యోతి గారు పాడి వినిపించారు.



ఈనాడు ఇదీ సంగతి శ్రీధర్ గారితో షేక్ నసీం ముఖాముఖి సందడిగా జరిగింది. ఆంధ్రదేశంలో తెలుగు కార్టూన్ల గురించి పోచంపల్లి శ్రీధర్ గారు చక్కగా మాట్లాడారు. రాజకీయనాయకుల ఇగోని కార్టూనిస్ట్ పంక్చర్ చేస్తూ ఉంటాడు అని చెప్పారు. చిన్న, చిన్న గీతలతో కార్టూన్లు ఎలా గీయచ్చో చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ కాలాలలో తను వేసిన కొన్ని కార్టూన్లను గుర్తు తెచ్చుకున్నారు.



సాహిత్య సేవలో భారీ వదాన్యులు కార్యక్రమంలో డా. గురవారెడ్డి మరియు ప్రముఖ రచయిత భారవి గారి ముఖాముఖి జరిగింది. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు  చెప్పారు. సియాటిల్ నుండి వచ్చిన పద్మలత గారు భారవి గారిని సభకు పరిచయం చేసారు.  గురువాయణం పుస్తకం వ్రాసిన డా. గురవారెడ్డిని డా పెనుగొండ ఇస్మాయిల్ గారు సభకు పరిచయం చేసారు. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు  చెప్పారు. అమెరికాలో సాహితీ సభలకు ఇంతమంది రావడం ఎపుడూ చూడలేదని గురవారెడ్డి గారన్నారు. అతిథులని నాట్స్ సాహితీ బృందం ఘనంగా సత్కరించడంతో కార్యక్రమం ముగిసింది.


TeluguOne For Your Business
About TeluguOne
;