తెరాసకు మద్దతు ఇచ్చేక మళ్ళీ కోర్టులో కేసేందుకో?
Publish Date:Jul 7, 2015
Advertisement
తెలంగాణాలో తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల నుండి చాలా మంది ఎమ్మేల్యేలు తెరాసలోకి మారారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా తమ పార్టీల ద్వారా సంపాదించిన ఎమ్మేల్యే పదవులకి రాజీనామా చేయలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో శాసనసభ కార్యదర్శి విడుదల చేసిన ఎమ్మేల్యేల జాబితాలో ఆ విషయం స్పష్టంగా పేర్కొనబడింది. వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలు స్పీకర్ మధుసూదనాచారిని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన కూడా వాటిని పట్టించుకోకపోవడంతో ఆ మూడు పార్టీల నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేసారు. వారి పిటిషన్లని నిన్న హైకోర్టు విచారణకు చేప్పట్టింది. కానీ దీనిపై సమాధానం తెలిపేందుకు మరికొంత సమయం కావాలని తెలంగాణా అడ్వోకేట్ జనరల్ కే.రామకృష్ణా రెడ్డి కోరడంతో హైకోర్టు ధర్మాసనం ఈ కేసును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఒక పార్టీకి చెందిన ఎమ్మేల్యేలు మరొక పార్టీకి చెందిన ప్రభుత్వంలో కొనసాగడం రాజ్యంగ విరుద్దం. ఒకవేళ వారు వేరే పార్టీలో జేరదలిస్తే ముందు తమ ఎమ్మేల్యే పదవులకి రాజీనామా చేసిఉన్నట్లయితే ఎటువంటి సమస్య ఉండేది కాదు. కానీ తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మేల్యేలు తెరాసలో చేరినప్పటికీ తమ ఎమ్మేల్యే పదవులను వదులుకోలేదు. పైగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిలలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలు జరీ చేసిన విప్ ని దిక్కరించి తెరాస సభ్యుడికి ఓటేశారు. కనుక వారిని అనర్హులుగా ప్రకటించాలని తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కోరుతున్నాయి. కానీ వైకాపా కూడా వారితో కలిసి కోర్టులో పిటిషన్ వేయడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మేల్యలో ఇద్దరు తెరాసలోకి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఏమీ నోరుమెదపలేదు. పైగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిలలో మళ్ళీ తెరాస అభ్యర్ధికే వైకాపా మద్దతు ఇచ్చింది. తెరాసకు మద్దతు ఇవ్వడాన్ని తెదేపా నేతలు విమర్శించినప్పుడు “తమ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చుకొంటే వారికెందుకు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు కూడా. తెరాసకు మద్దతు ఇస్తున్నప్పుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ ఎందుకు వేసినట్లో వైకాపాకే తెలియాలి.
http://www.teluguone.com/news/content/ysrcp-45-48123.html





