తెదేపాతో తెరాస మైండ్ గేమ్ ఆడుతోందా?
Publish Date:Jul 9, 2015
Advertisement
ఓటుకి నోటు కేసులో విషయంలో మొదట ఉరుకులు పరుగుల మీద పనిచేసిన ఎసిబి అధికారులు ఇప్పుడు చాలా నిదానంగా పనిచేయడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ కేసు విషయంలో వారు దూకుడుగా ముందుకు వెళ్ళినట్లయితే అటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అదే దూకుడు ప్రదర్శిస్తే తాము కూడా నష్టపోతామనే సంగతి గ్రహించినందునే తెరాస ప్రభుత్వం ఎసిబి దర్యాప్తుని మందగింప జేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన తరువాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇక ఆ బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని ప్రగల్భాలు పలికిన తెరాస నేతలు ఇప్పుడు గట్టిగా ఆ మాట అనలేకపోవడం, ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పడికట్టు పదాలు పదాలు పలుకుతుండటం గమనిస్తే వారు వెనక్కి తగ్గినట్లే కనబడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ నేటికీ ఈ కేసు మెల్లగా ముందుకు సాగనీయడం, తెదేపా నేతలకు ఒకరి తరువాత మరొకరికి తాపీగా ఎసిబి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేయడం, తరువాత వారు బెయిల్ పై విడుదలవడం గమనించినట్లయితే, తెరాస తెదేపాతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు అనుమానం కలుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈవిధంగా చేస్తుండటం వలన తెదేపాను నిరంతరంగా తీవ్ర ఆందోళనకు గురిచేయడమే కాకుండా, తెలంగాణా ప్రజలలో తెదేపా పట్ల వ్యతిరేకతను కల్పించవచ్చును. ఇదేవిధంగా ఈ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేస్తూ ఈ కేసును మరికొంత కాలం సాగదీసినట్లయితే, తెలంగాణాలో తెదేపా నేతల, ప్రజా ప్రతినిధుల ఆత్మస్థయిర్యం దెబ్బ తీయవచ్చునని తెరాస భావిస్తోందేమో? ఈ విధంగా తెదేపాలో కనీసం ఒకరిద్దరు బలమయిన నేతలను లొంగదీయగలిగినా ఇక తెలంగాణాలో ఆ పార్టీ ఎన్నటికీ కోలుకోలేని విధంగా దెబ్బ తీయవచ్చునని తెరాస భావిస్తోందేమో? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి తెరాసకు గట్టి పోటీ ఇస్తామని చెపుతున్న తెదేపా మరి తెరాస తమతో ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ని ఏవిధంగా ఎదుర్కొని నిలుస్తుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/trs-45-48183.html





