జగన్ రైతు దీక్ష టెన్షన్ టెన్షన్
Publish Date:Jan 9, 2012
Advertisement
నిజామాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఈ రోజు నుంచి చేపట్టనున్న రైతుదీక్షకు తెలంగాణ సెగ తగులుతోంది. ఆర్మూర్‌లో విద్యార్థులు 'జగన్ గో బ్యాక్' అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు. జగన్ తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయకపోతే అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. జగన్ దీక్ష కోసం ఆర్మూర్ శివార్లలోని దాదాపు 10 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ జిల్లాల్లో పార్టీ తరఫున తొలిసారి జరుగుతున్న కార్యక్రమం కావడంతో భారీసంఖ్యలో జనాన్ని ముఖ్యంగా రైతులను తరలించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలనుంచి రైతులను తరలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ 'రైతుదీక్ష ' ప్రారంభిస్తారని పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు జగన్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ జగన్‌ను అడ్డుకోవాలని జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా పిలుపునిచ్చారు. అయితే తమను ఎక్కడ అడ్డుకుంటే అక్కడే నిరసన దీక్ష చేపడతామని వైఎస్సార్ పార్టీ నేత బాజిరెడ్డి ప్రకటించారు. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి జగన్ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరనుండడం దీక్షకు కలిసి రానుంది.కాగా జగన్ దీక్షను జిల్లాలో కాంగ్రెస్ వాదులు అడ్డుకోవాలని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ అంశంపై చర్చించినప్పుడు సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని తెలంగాణను అడ్డుకున్న జగన్ ఇప్పుడు తెలంగాణ వాదం లేదని చెప్పడానికే ఇక్కడ పర్యటించడానికి వస్తున్నాడని విమర్శించారు.
మరో వైపు జగన్ రేపటి నుంచి మూడు రోజులపాటు రైతుదీక్ష చేయనున్న నేపథ్యంలో రాజకీయ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో జగన్ 4 పేజీల బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖలో రైతులకోసమే తాను దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. పంట విరామం ప్రకటించి రైతన్నలు కడగండ్లు పాలవుతుంటే పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. తన దీక్షకు రాజకీయరంగు పులమొద్దని పేర్కొన్నారు.ఇక చంద్రబాబు నాయుడు చేస్తున్న రైతుపోరుబాట గురించి ప్రస్తావిస్తూ తాము ఎన్నికలతో సంబంధం లేకుండా చిత్తశుద్ధితో రైతులకోసమే పోరాడుతున్నామని పేర్కొన్నారు.ఉపఎన్నికలకు దీక్షకు ఎలాంటి సంబంధం లేదని లేఖలో నొక్కివక్కాణించారు. ఈ దీక్ష రాజకీయ లబ్ధి కోసం కాదనీ, రైతుల కోసం చేస్తున్న దీక్ష అని వెల్లడించారు.కాగా జగన్ పర్యటనకు భారీభద్రతా చర్యలు చేపడుతున్నారు. నిజామాబాద్ రేంజ్ డీఐజీ సంజయ్ నేతృత్వంలో.. 1300 మందికి పైగా పోలీసులను భద్రతా ఏర్పాట్లకు నియోగించనున్నారు. సీఎం పర్యటన స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ జాన్‌విక్టర్ కిందిస్థాయి సిబ్బందికి సూచించారు.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-24-10803.html





