సాయి రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ ..నోరు విప్పని సాయిరెడ్డి!
Publish Date:Jan 5, 2012
Advertisement
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు గురువారం జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయ సాయి రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి ఆయనను దిల్కుషా అతిథి గృహానికి తరలించి సిబిఐ అధికారులు విచారించారు.జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులపై సుదీర్ఘంగా ప్రశ్నించారు. కేసు దర్యాప్తు అధికారి అయిన ఎస్పీ వెంకటేశ్‌తోపాటు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్వయంగా విచారించినట్లు సమాచారం. వారు ఎంత తరచి ప్రశ్నించినా సాయిరెడ్డి 'లైట్'గా తీసుకున్నట్లు తెలిసింది. ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్, డొంక తిరుగుడు సమాధానాలతో దర్యాప్తు అధికారులకు చికాకు తెప్పించినట్లు సమాచారం.తమ పెట్టుబడులన్నీ సవ్యంగానే ఉన్నాయనే మాటపైనే సాయిరెడ్డి నిలబడినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారం సజావుగా సాగాలంటే జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాల్సిందే అంటూ ఓ కంపెనీ డైరెక్టర్‌పై ఒత్తిడి చేసిన ఉదంతంలో సాయిరెడ్డి దొరికిపోయినట్లు సమాచారం. లావాదేవీల్లో కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్న విజయ సాయి రెడ్డి నుంచి సిబిఐ జగన్ కంపెనీలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.
కాగా, తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కోరుతూ విజయ సాయి రెడ్డి గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఉన్నతస్థాయి జీవితం గడుపుతున్న తనకు ఆ స్థాయి వసతులు కల్పించాలని సాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన న్యాయవాదులు గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏడాదికి రూ.5 లక్షలు, తన చార్టర్డ్ అకౌంటింగ్ కంపెనీ రూ.25 లక్షలు.. ఆదాయపన్ను చెల్లించినట్టు అందులో పేర్కొన్నారు. ఖైదీల చట్టం కింద అండర్ ట్రయల్ ఖైదీ హోదాలో తనకు ప్రత్యేక గదిని కేటాయించాలని అడిగారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిందితురాలిగా చేర్చకుండానే సిబిఐ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో శ్రీనివాస రెడ్డిని మొదటి ముద్దాయిగా, గాలి జనార్దన్ రెడ్డిని రెండో ముద్దాయిగా, రాజగోపాల్‌ను మూడో ముద్దాయిగా, ఒఎంసిని నాలుగో ముద్దాయిగా, లింగారెడ్డిని ఐదో ముద్దాయిగా చేర్చింది. ఇందులో లింగారెడ్డి మరణించారు. అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, అధికారి దయాకర్ రెడ్డిని తదితరులను సాక్షులుగా పేర్కొంది. మొత్తం 201 మంది సాక్షులను సిబిఐ చార్జిషీట్లో చేర్చింది.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-24-10654.html





