జగన్‌కు చుక్కెదురు: పవార్‌తో భేటీ రద్దు
Publish Date:Dec 22, 2011
Advertisement
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు షాక్ ఇచ్చారు.రైతుల సమస్యలపై మంగళవారం పవార్‌కు జగన్ వినతిపత్రం ఇవ్వడం, మరుసటి రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం రమ్మని జగన్‌ను పవార్ ఆహ్వానించడం తెలిసిందే. దీనిపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై కేవలం ఒక్కరోజు వచ్చి కలిసినంత మాత్రాన అంత ప్రాముఖ్యత ఇవ్వాలా అని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాటు సీనియర్ నేతలతో మాట్లాడారని, సోనియా వ్యవసాయ శాఖ సహాయమంత్రి థామస్‌ను పిలిచి చెప్పడంతో పవార్ జగన్‌కు ఇచ్చిన అపాయింట్మెంట్ను రద్దు చేశారని తెలుస్తోంది. దాంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌తో కలిసి ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొనాలనుకున్న జగన్‌కు చుక్కెదురైంది. లోక్‌సభలో తన శాఖకు చెందిన సవరణ బిల్లు ఉన్నదని పవార్ జగన్‌కు చెప్పి పవార్ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం అనంతరం హర్షకుమార్ సోనియాను కలిసి జగన్‌కు పవార్ అపాయింట్ మెంట్ ఇవ్వడం గురించి వివరించారు. దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని, కాంగ్రెస్ ఎంపీలకు విలువ ఇవ్వకుండా జగన్‌కు ప్రాధాన్యతనీయడం సరైంది కాదని చెప్పారు. ఆ తర్వాత థామస్ పవార్‌తో మాట్లాడి జగన్‌తో సమావేశం రద్దు చేసుకొమ్మని కోరినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం కూడా పవార్‌ను కలిసి జగన్‌తో సమావేశం సరైంది కాదని చెప్పారు. కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా పవార్ సమావేశం ఏర్పాటు చేయడంపై పార్టీ పెద్దలతో తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. చివరకు కాంగ్రెస్ ఎంపీలు పవార్ జగన్‌కు ఇచ్చిన అపాయింట్మెంట్ను రద్దు చేయించడంలో కృతకృత్యులయ్యారు. దీంతో పవార్‌ను కలుసుకోకుండానే జగన్ బుధవారం రాత్రి హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-24-10137.html





