తన వార్తాకథనం రాసిన పత్రికకు జగన్ లేఖ
Publish Date:Jan 2, 2012
Advertisement
హైదరాబాద్: తన రాజకీయాలపై వార్తాకథనం ప్రచురించిన ఓ ఆంగ్ల దినపత్రికకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి వైయస్ జగన్ రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచురించిన వార్తాకథనాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ బహిరంగ లేఖ రాశారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి పనిగట్టుకుని ఆ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించిందని ఆయన విమర్శించారు. గడిచిన కొంత కాలంగా తన ప్రతిష్టను, తన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తరుచు ఆ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. తాను నవంబర్ 18వ తేదీన ఢిల్లీలో ఉండి, కాంగ్రెసు పార్టీతో విలీనానికి ప్రతిపాదనలు చేసినట్లు వచ్చిన వార్తాకథనంపై ఆయన వివరణ ఇచ్చారు. తాను 18వ తేదీన గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అరెస్టును తప్పించుకోవడానికి తాను కాంగ్రెసుతో రాయబారాలు నడుపుతున్నట్లు ఆ పత్రిక చేసిన వ్యాఖ్యను ఆయన వ్యతిరేకించారు. అరెస్టును తప్పించుకోవాల్సిన అవసరం తనకు ఏమొచ్చిందని, తాను ఏ నేరం చేశానని, పత్రిక నడపడమే తాను చేసిన నేరమన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/ysr-congress-24-10479.html





