వైఎస్ షర్మిలకు సర్జరీ.. క్షేమంగా ఉన్నానంటూ ట్వీట్..!
Publish Date:Jul 26, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోని ఐసీయూ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, పొత్తికడుపు శస్త్రచికిత్స (అబ్డామినల్ సర్జరీ) చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి కావడంతో, ఆమె ప్రస్తుతం ఐసీయూలోనే ఉండి వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆసుపత్రి బెడ్‌పై ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న తన ఫోటోను షర్మిల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని ఆ పోస్టులో స్పష్టం చేశారు. తన ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఎంతోమంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తన కోలుకోలు కోసం ప్రార్థనలు చేశారని షర్మిల తెలిపారు. వారందరి ప్రేమాభిమానాలకు, మద్దతుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలపై జిల్లా పర్యటనలు, నిరసన కార్యక్రమాలు మరియు పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ వరుస పర్యటనల వల్ల తీవ్రమైన శారీరక అలసట, అనారోగ్యం తలెత్తినట్లు సమాచారం. షర్మిలకు ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, ఇన్ఫెక్షన్లు తగలకుండా ముందస్తు జాగ్రత్తగా కొన్ని రోజులు ఐసీయూలోనే ఉంచి పరిశీలిస్తున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో కోలుకున్న అనంతరం షర్మిలను డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని, ఆపై మళ్లీ ఏపీ రాజకీయాల్లో బిజీ కానున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. YS Sharmila Health Update, AP Congress President YS Sharmila, YS Sharmila Surgery ICU Photo, Andhra Pradesh Politics Telugu News, YS Sharmila Health Status
http://www.teluguone.com/news/content/ys-sharmila-health-update-36-227141.html





