జగన్ ఒకటి కాదా..? వంద మెట్లు దిగుతారా.??
Publish Date:Oct 24, 2017
Advertisement
ఎవ్వరు చెప్పినా వినని మొండితనం.. ఎంతటి రాజకీయ అనుభవం ఉన్న వారైనా సరే నా మాట వినాల్సిందే అన్న వైఖరి.. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన నేతలు జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు. ఒకరు చెప్పారంటే అది కోపంతో చెప్పారు అనుకోవచ్చు.. కానీ కోరస్ పాడినట్లుగా అందరూ ఒకే మాట చెప్పడంతో నమ్మక తప్పని పరిస్థితి. ఈ తత్వమే జగన్‌ను చాలా తక్కువ ఓట్ల శాతంతో అధికారానికి దూరం చేసిందని సాక్షాత్తూ పార్టీ నేతలే బహిరంగంగా అనే మాట. అప్పట్లో రుణమాఫీని ప్రకటించాలని సీనియర్ నేతలు నెత్తి, నోరు మొత్తుకున్నారట. కానీ జగన్ వద్దంటే వద్దు అన్నారట. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు దానిని ఆచరణలో చేసి చూపించారు.. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు చేసిన తప్పులు జగన్‌కు గుణపాఠం నేర్పినట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని వర్గాలు మాత్రమే తనకు మద్ధతు ఇస్తున్నాయని.. వీరి మద్ధతుతోనే అధికారాన్ని అందుకోవడం దుర్లభమని గుర్తెరిగిన వైసీపీ అధినేత వ్యూహాన్ని మార్చారు. దీనిలో భాగంగా తన వైరి పక్షాలను, వ్యతిరేకించే వర్గాల మద్ధతు పొందాలని స్కెచ్ గీస్తున్నారు. నవంబర్ 2న పాదయాత్ర ప్రారంభించే నాటికి ఈ ప్లాన్‌ను విజయవంతంగా అమలు జరపాలని చూస్తున్నారు. ముందు నుంచి క్రైస్తవ పక్షపాతిగా ఉన్న ముద్రను పొగొట్టుకోవడం కోసం హిందూ మతానికి చెందిన స్వామిజీలు, మఠాధిపతులను కలుసుకోవడం.. వారి ఆశీస్సులు తీసుకోవడం చేస్తున్నారు. అలాగే తన తండ్రి కాలం నుంచి తన కుటుంబం పట్ల.. పార్టీ పట్ల వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల అధినేతలు రామోజీరావు, వేమూరి రాధాకృష్ణలను కలవాలని ఆయన భావిస్తున్నారు. 2014 ఎన్నికల ఓటమితో జగన్.. రామోజీరావుతో రాజీకి వచ్చారు.. ఎన్నికల ముగిసిన కొద్ది నెలల్లోనే స్వయంగా రాజగురువుని కలిసి వచ్చారు. ఆ తర్వాత మోహన్‌బాబు కుమారుడు మనోజ్ వివాహ సమయంలోనూ సమావేశమయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈనాడులో జగన్‌పై వ్యతిరేక వార్తలు బాగా తగ్గాయి.. ఆయన అటెండైన చిన్నా, పెద్ద వార్తలు ఈనాడులో కనిపిస్తున్నాయి. తన తండ్రి వైఎస్ పాదయాత్రకు ముందు రామోజీరావును కలిసి పాదయాత్రకు విస్తృతమైన కవరేజీ ఇచ్చింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని తను అమలు జరపాలని భావించిన జగన్ రాజగురువును కలిశారు. ఇక ఈ ప్లాన్‌లో నెక్ట్స్ పర్సన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ.. ఈనాడు తర్వాత తనను ఢీ అంటే ఢీ అంటున్న జ్యోతిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆర్కే అపాయింట్‌మెంట్ కోరారట. అయితే వీరిద్దరి భేటీ ఎప్పుడన్నది తెలియదు. ఏది ఏమైనా ఈ సారి ఎలాంటి తప్పులు చేయకూడదని.. రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని జగన్ మెట్టు మీద మెట్టు దిగుతున్నారు.
http://www.teluguone.com/news/content/ys-jaganmohan-reddy-45-78442.html





