మీ ఇంట్లో కుక్క ఉందా.. అయితే పన్ను కట్టండి..!
Publish Date:Oct 24, 2017
Advertisement
కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. కాదేది పన్నుకు అనర్హం అంటున్నాయి ప్రభుత్వాలు. అప్పట్లో ఔరంగజేబు పెళ్లి చేసుకున్నా.. పండుగ చేసుకున్నా పన్ను విధించేవాడని చరిత్ర పుస్తకాల్లో చదివి ఇలాంటి పన్నులు కూడా ఉండేవా అని ముక్కు మీద వేలేసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ప్రభుత్వాల తీరు చూస్తుంటే అప్పటి రోజులే బెటరేమో అనిపించక మానదు. సంపాదించినా పన్ను.. ఖర్చు చేసినా పన్ను.. తింటే పన్ను.. కొంటే పన్ను ఇలా రకరకాల పన్నులతో సగటు భారతీయుడిని పన్ను పీకేస్తుంది.. ఈ పన్ను పోటులో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు ఇంకా కొత్త పన్నులు వస్తూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను పోటుకు కొత్త అర్థం చెప్పింది. ఇంటికి కాపలా కోసమో.. సరదాగా గడిపేందుకనో.. తరతరాలుగా మన ఇళ్లలో పెంపుడు జంతువుల్ని పెంచుకుంటూ వస్తున్నాం.. వాటిని ఎందుకు వదిలి వేయాలి అనుకున్నారో ఏమో కానీ పంజాబ్ ప్రభుత్వం వీటిపైనా పన్ను కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల ఇళ్లలో కుక్క పిల్లి, పంది, గొర్రె, ఒంటె, గాడిద, ఆవు, బర్రె వంటి పెంపుడు జంతువులు ఉంటే పన్ను కట్టాలని నోటీఫికేషన్‌లో తెలిపింది. మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ నేతృత్వంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పంచాయతీలను మినహాయించి అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. రూ. 200 నుంచి రూ.500 వరకు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల సారాంశం. ఒకవేళ ప్రజలు పన్ను కట్టకపోతే జంతువులను స్వాధీనం చేసుకోవచ్చనే అధికారాన్ని ఆయా అథారిటీలకు కట్టబెట్టింది సర్కార్. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నాలను లేదా నంబర్లను వాటికి కేటాయించటం గానీ.. అవసరమైతే మైక్రో చిప్‌లను అమర్చడం గానీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై జంతు ప్రేమికుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంట్లో సరదాగా పెంచుకునే జంతువులపై పన్నులు విధించడం ఏంటని వారు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఈ పన్ను వలన మూగజీవులకు కానీ.. పన్ను కట్టే వారికి ఏ విధమైన ప్రయోజనం లేదని.. అందువల్ల ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ తరహా విధానాన్ని కేరళ, గోవా ప్రభుత్వాలు అమలు చేసేందుకు ప్రయత్నించగా.. పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తడంతో అవి వెనకడుగు వేశాయి.
http://www.teluguone.com/news/content/punjab-government-45-78438.html





