చంద్రబాబు ఆ ఛాన్స్ జగన్‌కి ఇస్తారా?
Publish Date:Apr 20, 2016
Advertisement
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్..ఎన్నికల్లో ఓటమి, కేసులు, తదితరాలతో తన ఇమేజ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని గమనించారు. తన పాపులారిటీ పడిపోకుండా..జనాలు తన పార్టీని మార్చిపోకుండా , రోజూ వార్తల్లో నిలిచేందుకు జగన్ కొత్త స్కెచ్ గీశారు. అదే పాదయాత్ర. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాస్ ఇమేజ్ తీసుకువచ్చి అధికారంలోకి కూర్చోబెట్టింది మండుటెండలను సైతం లెక్కచేయకుండా పల్లె బాట పట్టారు వైఎస్. రాష్ట్రవ్యాప్తంగా 1467 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు, వారి కోరికలు, అవసరాలను ఆకలింపు చేసుకున్నారు. ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పిదాలను విమర్శిస్తూ ప్రజల మనిషిగా మారారు. మళ్లీ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే పాదయాత్రను నమ్ముకుని ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఈ యాత్ర చంద్రబాబుకు తిరిగి అధికారం కట్టబెట్టడంలో పూర్తిగా కాకున్నా కొంతమేర పనిచేసింది. ఆ తరహాలోనే తాను కూడా పాదయాత్రతో లబ్ధి పోందాలని చూస్తున్నారు యువనేత. జగన్‌కు యాత్రలు కొత్త కాదు. ఇంతకు ముందు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చే ఉద్దేశ్యంతో ఓదార్పు యాత్ర, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చడానికి పరామర్శ యాత్రలు నిర్వహించారు. ఆ రెండు యాత్రలతో తెలుగు నేలను చుట్టారు జగన్. తెలుగు దేశం తన ఎమ్మెల్యేలను వరుసగా ఎగరేసుకుని పోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ ఉన్నవారినైనా కాపాడుకోవాలని పాదయాత్రతో తనకు ప్రజల్లో ఛరిష్మా తగ్గలేదని వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ఎమ్మెల్యేలకు చేరవేయాలన్నది జగన్ వ్యూహం. ఇది ఒకవైపు చేస్తూనే ముఖ్యమంత్రిపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వీటన్నింటిని ఒక కంట గమనిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్‌కి చెక్ పెట్టే స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే పాదయాత్ర పవర్ ఏంటో ఆయనకు తెలిసినంతగా మరేవ్వరికి తెలియదు. తనకు హ్యాట్రిక్‌ని దూరం చేసింది పాదయాత్ర..తనను మళ్లీ సీఎంని చేసింది పాదయాత్ర. మరి అలాంటి పాదయాత్రని జగన్ మరోసారి తెరమీదకు తీసుకువస్తుండటంతో సీఎం అలర్టయ్యారు. ఒకప్పుడు తన పాలనను విమర్శిస్తూ వైఎస్ చేసిన పాదయాత్రని ఆయన సరిగా పట్టించుకోలేదు. దీనికి ఆదిలోనే చెక్ పెట్టుంటే రాష్ట్ర, దేశ రాజకీయాలు వేరేలా ఉండేవి. కాబట్టి ఆ తప్పుని మళ్లీ చేయడానికి బాబు సిద్ధంగా లేరు. వైఎస్‌కి ఛాన్స్ ఇచ్చినా..జగన్‌కి మాత్రం ఆ ఛాన్స్ ఇచ్చేది లేదంటున్నారు టీడీపీ అధినేత.
http://www.teluguone.com/news/content/ys-jaganmohan-reddy-45-58883.html





