యాక్సిడెంట్ కేసును.. హత్యగా మార్చారు : జగన్
Publish Date:Jul 30, 2026
Advertisement
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ..! జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు..! మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ముసుగులో వైసీపీ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయంగా వేధించడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు సబ్‌జైలుకు చేరుకున్న జగన్, అక్కడ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు ప్రయత్నించారు. అయితే ములాఖత్ సమయం పూర్తయిందనే కారణంతో జైలు అధికారులు ఆయనను అనుమతించలేదు. దీనితో జైలు వద్దకే వచ్చిన అప్పలరాజు కుటుంబ సభ్యులను జగన్ నేరుగా పరామర్శించి, పార్టీ తరఫున అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ , కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు జరిగిన ఒక సంఘటనను రాజకీయం చేస్తూ సీదిరి అప్పలరాజు, ఆయన కుటుంబంపై తప్పుడు కేసులు మోపడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ఒక బైక్ ప్రమాదాన్ని సాకుగా చూపి, 18 ఏళ్ల కుర్రాడి భవిష్యత్తును నాశనం చేసేందుకు యత్నించడం ఎంతవరకు న్యాయమని జగన్ ప్రశ్నించారు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో కుట్ర కోణాన్ని ఎలా వెతుకుతారని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అబద్ధపు కథనాలను అల్లి ప్రతిపక్ష నేతలపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు నేపథ్యాన్ని జగన్ గుర్తుచేసుకున్నారు. అప్పలరాజు పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగానే పురస్కారం అందుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత పట్టుదలతో చదివి వైద్యుడిగా సమాజానికి సేవలు అందించారని కొనియాడారు. వైఎస్సార్సీపీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు, బీసీ వర్గాల్లో ఎంతో బలమైన నేతగా ఎదిగారని జగన్ తెలిపారు. అటువంటి ప్రజాదరణ పొందిన బీసీ నాయకుడి ఎదుగుదలను తట్టుకోలేకే అధికార పక్షం కుట్రపూరితంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారని వైఎస్సార్సీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ నాయకులు భయపడేది లేదని జగన్ స్పష్టం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు న్యాయస్థానాల ద్వారా న్యాయం జరిగే వరకు పోరాడతామని, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వం తీరును ఎండగడతామని స్పష్టం చేశారు. YS Jagan Mohan Reddy, Seediri Appalaraju, Ampolu Sub Jail, YSRCP, Andhra Pradesh Politics, Srikakulam Ampolu Jail, YSRCP, Andhra Pradesh Politics, Mulakhat Cancelled
http://www.teluguone.com/news/content/ys-jagan-mohan-reddy-36-227584.html





