అప్పలరాజును కలిసే ఉద్దేశం జగన్‌కు లేదు..కేవలం బలప్రదర్శన కోసమే : అనిత
Publish Date:Jul 30, 2026
Advertisement
ములాఖాత్‌కు 2 నుంచి 3 గంటల మధ్య సమయం కేటాయించాం..! వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పట్ల ఆ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రతి ఒక్కరూ ఈ తరహా దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇటీవల వైసీపీ నేత సీదీరి అప్పలరాజుతో ములాఖత్ పేరుతో జగన్ రాజకీయ నాటకాలడుతున్నారని హోంమంత్రి మండిపడ్డారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖత్ కోసం అధికారులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయాన్ని కేటాయించారని చెప్పారు. అయితే ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడకు వెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ఆమె నిలదీశారు. అప్పలరాజును పరామర్శించాలనే ఆలోచన గానీ, ఆయనను కలవాలనే తపన గానీ జగన్‌కు ఎంతమాత్రం లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. కేవలం సమయపాలన పాటించకుండా ఆలస్యంగా వెళ్లడం ద్వారా ప్రభుత్వంపై నిందలు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ములాఖత్‌ను ఒక నెపంగా వాడుకుని రోడ్లపై శ్రేణులతో బలప్రదర్శన చేయడమే ఆయన ఏకైక లక్ష్యమని విమర్శించారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు కనీస క్రమశిక్షణ లేకుండా వ్యవహరించాయని అనిత ధ్వజమెత్తారు. విధుల్లో నిమగ్నమై ఉన్న మహిళా పోలీసు అధికారిణి పట్ల ఆ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. మహిళల పట్ల ఇప్పటికీ పాతకాలపు వైఖరినే కొనసాగించడం వైసీపీ నాయకత్వ ధోరణికి అద్దం పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైని అవమానించిన తమ పార్టీ నాయకుల చర్యలకు జగన్ తక్షణమే బాధ్యత వహించాలని అనిత డిమాండ్ చేశారు. బాధితురాలైన పోలీసు అధికారిణితో పాటు మొత్తం మహిళా లోకానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరిహాసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, కానీ వైసీపీ నాయకులు మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కూటమి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ మహిళా అధికారుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని, ప్రతిపక్షంలోకి వచ్చినా ఆ తీరు మారలేదని అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీకాకుళం ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, మహిళా ఎస్సై పట్ల మర్యాదలేకుండా ప్రవర్తించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. రాజకీయ పర్యటనల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Home Minister Vangalapudi Anitha, YS Jagan Srikakulam Tour, AP Politics, Srikakulam YSRCP, womens SI parade, YS Jagans visit, Chintada Ravikumar, AP police security, SI Paravallik, Seediri Appalaraju
http://www.teluguone.com/news/content/home-minister-vangalapudi-anitha-36-227590.html





