కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఆందోళన.. కేంద్ర బృందం సందర్శన
Publish Date:Oct 24, 2023
Advertisement
కాళేశ్వరం బ్యారేజి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డ్యామ్ భద్రత, బ్యారేజీ భద్రత పరీక్షించాల్సిన అవసరం ఉందంటూ, ఇందు కోసం కేంద్ర బృందాన్ని పంపాలంటూ.. జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. ఆ లేఖపై వెంటనే స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కేంద్ర బృందాన్నిపంపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ బృందం హుటాహుటిన తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై.. కాళేశ్వరం డ్యామ్ ను సందర్శించింది. కాగా కాళేశ్వరం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని.. భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? నిర్వహిస్తే ఆ పరీక్షల్లో ఏం తేలింది? ఇత్యాది విషయాలను గోప్యంగా ఎందుకు ఉంచారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో స్థానికులలోనూ, ఇంజినీరింగ్ నిపుణులలోనూ ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే పిల్లర్ల నిర్మాణం నాసిరకంగా జరిగిందని ఈ కుంగుబాటుతో తేటతెల్లమైందని, అక్కడ సాయిల్ ట్రీట్ మెంట్ జరగలేదని ఈ సంఘటనతో రుజువౌతోందని కిషన్ రేడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ తాజా పరిస్థితికి ఎవరు బాధ్యులనే విషయాన్ని సత్వరమే తేల్చాలని ఆయన ఆ లేఖలో కోరారు. నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఆయన లేఖకు వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి నిపుణుల బృందాన్ని ప్రాజెక్టు తనిఖీ కోసం పంపించారు. తొలి నుంచీ కాళేశ్వరం భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. గతంలో భారీ వరదకు ప్రాజెక్టు ముంపునకు గురైన సందర్భంలోనే ఈ అనుమానాలు వెల్లువెత్తాయి. అప్పట్లో ప్రాజెక్టు సందర్శనకు ఎవరినీ అనుమతించలేదన్న విషయం విదితమే. ఇప్పుడు కూడా మెడిగడ్డ ఫిల్లర్లు కుంగిన తరువాత ఆ ప్రాంతానికి రాజకీయ పార్టీల నేతలను అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. 6వ బ్లాక్‌లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయనీ, ఆ సందర్భంగా భారీ శబ్దాలు వెలువడటంతో స్థానికులు భయందోళనలకు గురయ్యారనీ పేర్కొన్నారు. మెడిగడ్డ ఫిల్లర్లు కుంగిన వెంటనే బ్యారేజ్ లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేశారని వివరించారు. సాగునీటికోసం నిలువ చేసిన నీళ్లన్నీ వ్యర్థంగా కిందికి వదిలేయడంతో.. దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంతా జాగరణ చేసి భయంతో గడిపారని పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/worry-on-kaleswaram-safety-39-163850.html