Top Stories

political-news-img

వైసీపీ హయాంలో గ్రూప్-1 ఓఎంఆర్ షీట్ల తారుమారు..జగన్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి : మంత్రి డోలా

గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేదికగా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటన్నింటికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కోర్టుకు సమర్పించిన సిట్ (SIT) విచారణ నివేదికతో వైసీపీ నాయకుల అవినీతి ముసుగు తొలగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుంటే, గత ప్రభుత్వం వారి భవిష్యత్తుతో బంతిలా ఆడుకుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 మూల్యాంకన ప్రక్రియలో ఏకంగా 96 శాతం ఓఎంఆర్ (OMR) షీట్లలో తీవ్ర తారుమారు జరిగినట్లు సిట్ విచారణ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలో భద్రంగా ఉండాల్సిన ఏపీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు ఏకంగా 86 రోజుల పాటు ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో జగన్ సమాధానం చెప్పాలని మంత్రి డోలా ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్‌ను గత ప్రభుత్వంలో పూర్తిగా భ్రష్టు పట్టించి, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు యత్నించారని దుయ్యబట్టారు. ఈ తీవ్రమైన వ్యవహారంలో కోర్టులను సైతం పక్కదారి పట్టించేలా వ్యవహరించిన జగన్ మోహన్ రెడ్డికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని, ఆయన వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఉసురు తగిలిన ఏ పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా ఎంతో పారదర్శకంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగాలు అందజేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న ఈ వరుస అక్రమాలపై వైసీపీ హయాంలో నిరుద్యోగ జేఏసీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాయని, ప్రస్తుత సిట్ నివేదికతో తమ ఆరోపణలు నిజమని తేలిందని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1 స్కామ్‌పై సిట్ ఇచ్చిన సమగ్ర నివేదిక ఆధారంగా న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వులపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, ఏపీపీఎస్సీకి పూర్వ వైభవం తీసుకువచ్చి బాధిత నిరుద్యోగులకు పూర్తి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. APPSC Group 1 Scam, AP Minister Dola Sree Bala Veeranjaneya Swamy, APPSC OMR Sheet Scandal,SIT Report , APPSC Group 1, AP Political News

Publish Date: Aug 13, 2026 10:12PM

political-news-img

కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్లుకు కీలక పదవులు..రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!.

హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..! తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంతర్గత అసంతృప్తులు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడం తీవ్ర బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రాజగోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. తాను అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అరాచకాలపై తొలిసారిగా గళమెత్తింది తానేనని, ఆ కారణంతోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని గుర్తుచేశారు. మునుగోడు ఉపఎన్నికలో తనను ఓడించేందుకు ఏకంగా వంద మంది ఎమ్మెల్యేలను రప్పించి మోహరించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులం కార్డును అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాప్రతినిధులు నిజాయితీగా లేకపోతే వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ చిత్రాన్ని మార్చే శక్తి తన వద్ద ఉందని, నిజాయితీ కలిగిన వ్యక్తులు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహా రాజకీయ విప్లవాన్ని తెలంగాణలోనూ తీసుకురాగలమని ధీమా వ్యక్తం చేశారు. ఏపూరి సోమన్న లాంటి ప్రజా కళాకారులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరింత శృతిమించక ముందే అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. Komatireddy Rajgopal Reddy, Telangana Congress, Munugode MLA, Epuri Somanna, Telangana Politics

Publish Date: Aug 13, 2026 9:42PM

political-news-img

ఎన్టీఆర్ మార్కు రాజకీయం మళ్లీ సాధ్యమేనా..? చంద్రబాబు, లోకేష్ ముందు కొత్త సవాళ్లు..!

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం, అవినీతిరహిత పాలనను అందిస్తామనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో కల్పించినప్పటికీ, రక్షణ రంగ ఒప్పందాలైన రఫేల్ కొనుగోళ్లలో రూ. 650 కోట్ల అంచనాల మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం నవీకరణలు అధిక వ్యయాల విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. మరొకవైపు ఉత్తర భారతదేశంలో అయోధ్య రామమందిర నిర్మాణం ఒక గొప్ప భావోద్వేగపూరిత అంశంగా మారగా, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని అంశాలపై వాస్తవ వేదిక' కార్యక్రమంలో 'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ తెలుగువన్ ఎం.డి కంఠమనేని రవిశంకర్ మధ్య జరిగిన ఆసక్తికర చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే, వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయం, రైతాంగ సమస్యలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై తనదైన అవగాహనతో ప్రత్యేక రాజకీయ వైఖరిని కనబరిచారు. మరోవైపు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్‌లతో కూడిన నాయకత్వం వర్తమాన పాలనాపరమైన, నాయకత్వ సమీకరణల్లో తీవ్రమైన పోటీని, సరికొత్త రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. వ్యూహాలు పరిణామాలుప్రస్తుత రాజకీయంలో ప్రతి ప్రధాన పార్టీ కూడా ఒక నిర్దిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. జాతీయ స్థాయిలో బిజెపి ప్రభుత్వం భద్రత, జాతీయతా భావాలు సెంటిమెంట్ ఆధారంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక లోపాలు, కుంభకోణాల ఆరోపణలను ఎత్తిచూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వైఎస్ జగన్ వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని తన ప్రధాన రాజకీయ వ్యూహంగా మలుచుకునే క్రమంలో అడుగులు వేశారు. మరోవైపు, టీడీపీ గతంలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కాలంలో ఉన్నటువంటి విప్లవాత్మకమైన ప్రజాదరణ పాలనా శైలిని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, నేటి మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీఆర్ కాలం నాటి శైలిని మళ్లీ తీసుకురావడం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయం మరియు ఐఏఎస్ అధికారుల ప్రాబల్యం పెరగడం, నిర్ణయాధికారాల కేంద్రీకరణ వంటివి క్షేత్రస్థాయి నాయకత్వంలో అసంతృప్తికి కారణమవుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావందీర్ఘకాలికంగా ఈ రాజకీయ వ్యూహాలు మరియు విమర్శలు రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. టీడీపీ తమ సంప్రదాయ రాజకీయ శైలి నుండి మారకపోతే భవిష్యత్తులో గందరగోళ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌లు తమ వ్యూహాత్మక విధానాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో జరిగిన లోపాలను గ్రహించే సమయానికి రాజకీయ చిత్రం చేజారిపోవచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ నమూనా నేటి ఆధునిక డిజిటల్ యుగంలో పనిచేయదని, వర్తమాన సమాజపు ఆర్థిక, సామాజిక అవసరాలకు తగినట్లుగా పరివర్తన చెందకపోతే రాజకీయ మనుగడ కష్టమవుతుందని స్పష్టమవుతోంది. అదే సమయంలో, జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వంపై వచ్చే విమర్శలు ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయో మున్ముందు తేలనుంది. మొత్తానికి, ఈ సమీకరణలు భవిష్యత్తులో సరికొత్త రాజకీయ ఆవిర్భావాలకు బలాల మార్పునకు నాంది పలుకుతాయి. Vasthava Vedika, AP Politics, Kantamaneni Ravi Shankar, Dolendra Prasad, 2029 Elections, Tone News

Publish Date: Aug 13, 2026 9:25PM

political-news-img

సీఎం చంద్రబాబు పవర్‌ ప్లాన్‌.. 2029 నాటికి యూనిట్‌ విద్యుత్‌ రూ.4కే..!

విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..! రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షంచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. పోలవరం వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ సూచన చేశారు. ఈ మేరకు అధ్యయనం చేయడంతోపాటు... ఎకనమిక్ ఫీజిబిలిటీపై స్టడీ చేయాలన్నారు. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున్న వివిధ రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ... విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో పాటు... ప్రతి ఆరేళ్లకూ విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని... దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్‌ పంపిణీ నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. సోలార్‌ విద్యుత్‌పై మరింత దృష్టి.. సౌర విద్యుత్‌ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్‌ కింద 6 లక్షల సోలార్‌ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఇన్‌స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్య ఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇక కుసుమ్‌ పథకం కింద లక్ష్యాన్ని పూర్తిచేస్తూనే, అదనంగా 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ ధరకు, నిరంతర విద్యుత్‌ అందించే వ్యవస్థను రూపొందించాలని సూచించారు. దీంతో పాటు విద్యుత్‌ కొనుగోలు ధరను ఈ ఏడాది యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. 2029 నాటికి యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు ధరను రూ.4కు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ ధర విద్యుత్‌ కొనుగోలుతోపాటు పవర్ స్వాపింగ్, కుసుమ్‌, సూర్యఘర్‌, పునరుత్పాదక విద్యుత్‌, స్టోరేజ్‌ వంటి వివిధ మోడళ్లను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. విద్యుత్‌ సంస్థలకు రేటింగ్‌... కార్పొరేట్లతో పోటీ.. రాష్ట్రంలోని ఆరు విద్యుత్‌ సంస్థలకు పనితీరు ఆధారంగా రేటింగ్‌ విధానం తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రతి సంస్థ సమర్థంగా పనిచేసేలా లక్ష్యాలు నిర్దేశించి, కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా విద్యుత్‌ సంస్థలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. సంస్థల పనితీరు, ఆర్థిక సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యాలను నిరంతరం సమీక్షించాలని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లల్లో ఆప్టిమైజేషన్ ద్వారా రూ.234 కోట్లు, ప్రాంప్ట్ పేమెంట్ రిబేట్ కింద రూ.100 కోట్లను ఆదా చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ... విద్యుత్‌ సంస్థలపై రుణ భారాన్ని తగ్గించాలన్నారు. విద్యుత్ సంస్థల రుణాలపై నిరంతర సంప్రదింపులతో వడ్డీరేట్లను వీలైనంత మేర తగ్గించాలని ఆదేశించారు. సంస్థల పనితీరు మెరుగుపడుతున్న విషయాన్ని ఆర్థిక సంస్థల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆస్తుల కల్పన, మూలధన పెట్టుబడుల కోసం మాత్రమే ఇకపై విద్యుత్ సంస్థలు అప్పులు తీసుకోవాలి తప్ప... ఇతర అవసరాలకు అప్పులు చేసే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. టారిఫ్‌ పెంచకుండా... కొనుగోలు వ్యయం, వడ్డీ భారం, పంపిణీ నష్టాలను తగ్గించడం ద్వారా సంస్థల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్‌ సంస్థల్లో డిజిటల్‌ ట్విన్‌ వ్యవస్థ, అసెట్‌ హెల్త్‌ ఇండెక్స్‌ విధానాలను అమలు చేస్తున్న అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. విద్యుత్‌ వ్యవస్థలోని ఆస్తుల పరిస్థితిని డిజిటల్‌గా పర్యవేక్షించడం, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర పరికరాల కండీషన్ ను ముందుగానే అంచనా వేసి మరమ్మతులు, మార్పులకు చర్యలు తీసుకోవడం ద్వారా వ్యయాన్ని తగ్గించడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ ను వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి, విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. CM Chandrababu Naidu, AP Electricity, Electricity Price, Power Purchase Cost, Solar Power, Pumped Storage, PM Surya Ghar, Kusum Scheme, Renewable Energy, AP Power Sector

Publish Date: Aug 13, 2026 8:57PM

political-news-img

ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. ట్రాఫిక్ ఆంక్షలు

ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న ‘తిరంగా ర్యాలీ’ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపం లోని ఎం-47 ప్యాటన్ ట్యాంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. సెయిలింగ్ క్లబ్ వద్ద కర్బాలా మైదాన్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌ బండ్‌కు వెళ్లే సాధారణ వాహనాలను అనుమతించారు. వాటిని సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపు మళ్లించనున్నారు. అలాగే డీబీఆర్ మిల్స్ వద్ద నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను అనుమ తించకుండా గోశాల– కవాడిగూడ వైపు మళ్లి స్తారు. ఈ మళ్లింపుల కారణంగా సెయిలింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ మార్గాలను వీలైనంత వరకు నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ర్యాలీ పూర్తయిన వెంటనే ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను తొలగించి రహదారులను సాధారణ రాకపోకలకు పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరా బాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. Tiranga Rally on Tank Bund on August 14, Hyderabad Traffic Police, Sailing Club, Telangana police, Hyderabad police, CP Sajjanar. DGP C.V. Anand

Publish Date: Aug 13, 2026 8:37PM

political-news-img

వర్షాలు పడొద్దని అఘోర పూజలు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు..! హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేమాట్లాడుతూ.. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూకట్‌పల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో.. మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాని తెలిపారు. కానీ ఇప్పుడు కూకట్‌పల్లిని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అధికారాలు, అవకాశాలు మా ప్రభుత్వానికి ఉన్నాయి. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును ఆదేశిస్తున్నాని సీఎం స్పష్టం చేశారు. పదేళ్ల వారి పాలనను.. రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణలో 3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. కడుపులో విషం పెట్టుకుని కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా.. మా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆడబిడ్డలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం.. మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిందా?పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో లక్ష ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాను. మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాదే. ఈ విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసానిచ్చారు.సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. పదేళ్ల వారి పాలనను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి. నాకు వయసు ఉంది.. ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం.కొంతమంది దుర్మార్గులు రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు. అయినా దేవుడు మన వైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. మంచి మనసుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న మా సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉంది.కుటిల బుద్ధితో క్షుద్ర పూజలు చేసే వారికి.. ఆ కుట్రలే తిరిగి వారినే అష్టదిగ్బంధనం చేస్తాయి. మీరు అండగా ఉండండి.. తెలంగాణను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. CM Revanth Reddy, Indiramma Indlu Towers, Indiramma Housing Scheme, Kukatpally Development,Telangana Government, Double Bedroom Houses,Telangana Politics

Publish Date: Aug 13, 2026 7:48PM

MOVIE NEWS