గజ్వేల్.. కామారెడ్డిలో కేసీఆర్ టార్గెట్ గా పెద్ద సంఖ్యలో నామినేషన్లు!
Publish Date:Oct 24, 2023
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో ‘కీలక’ పాత్రను పోషించేందుకు వీలుగా ...లోక్ సభకు పోటీచేస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా? లోక్ సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా? అసెంబ్లీకి పోటీచేసే పక్షాన గజ్వేల్నుంచే పోటీ చేస్తారా? మరో నియోజక వర్గం నుంచి బరిలో దిగుతారా? నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ విషయంలో రాజకీయవర్గాలలో వినిపించిన ప్రశ్నలివి. కుమారుడికి సీఎం పగ్గాలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన సీఎం కేసీఆర్ కు కాలం కలిసిరావడం లేదు. బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అన్న భావన ప్రజలలోకి బలంగా వెళ్లడంతో.. ఆయన ముందు రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా విపక్షాలు వేటికవిగా ఆయన సిట్టింగ్ స్థానం అయిన గజ్వేల్ టార్గెట్ చేయడంతో కేసీఆర్ మరో నియోజకవర్గాన్ని కూడా సేఫ్ సైడ్ గా ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి వచ్చిందంటేనే తెలంగాణ ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియ అని చెప్పుకునే కేసీఆర్ ఎంత డిఫెన్స్ లో పడ్డారన్నది అవగతమౌతుంది. అసలు కేసీఆర్ ఎన్నికల వ్యూహ రచన ప్రత్యర్థి పార్టీల నేతలకే కాదు.. సొంత పార్టీ నేతలకే అంతుబట్టదు అని నిన్నమొన్నటి వరకూ అంతా భావించే వారు. కానీ ఎందుకే ఈ సారి ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఆయన మాటే శాసనం అనే పరిస్థితి పార్టీలో లేకుండా పోయింది. సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయన ఏ ముహూర్తంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారో ఆ రోజు నుంచే పార్టీలో అసమ్మతి భగ్గుమంది. అంతకు ముందు వరకూ ఆయనకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన రాజయ్య, మైనంపల్లి వంటి వారే తొలుత అసమ్మతి గళం వినిపించారు. మైనంపల్లి అయితే నేరుగా కేసీఆర్ సమీపబంధువు, బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించి సంచలనం సృష్టించారు. అన్నిటికీ మించి ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరెవరికీ దక్కని వెసులుబాటు కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు దక్కడంతో విపక్షాలు గతం నుంచీ మొదటి నుంచీ వినవస్తున్న బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లైంది. అంతే కాకుండా సొంత పార్టీలో సైతం ఆ అనుమానాలు బలపడ్డాయి. దీంతో సొంత పార్టీలోనే ఆయన పట్ల ఒకింత అనుమానాలు పొడసూపాయి. కల్వకుంట్ల కవిత కోసం ఆయన బీజేపీతో లాలూచీపడ్డారా అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తం అయ్యాయి. అలాగే గతంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పార్టీ గేట్లు బార్లా తెరిచేయడంతో ఇప్పుడు చాలా వరకూ నియోజకవర్గాలలో రెండు అంతకంటే ఎక్కువ వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో అభ్యర్థుల తొలి జాబితా విడుదల తరువాత పార్టీలో వలసలు పెరిగియి. గేట్లు తెరిచేసినట్లుగా ఆ వలసలు ఒక ప్రవాహంగా మారాయి. ఎన్నికల ముంగిట, అదీ అధికార పార్టీ నుంచి వలసలు పెరగడం కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరంగా మారిందని చెప్పకతప్పదు. అన్నిటికీ మించి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని గజ్వేల్ లో పోటీ చేస్తామంటూ సవాల్ విసురుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడంతో.. ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తన కుమార్తె కవితకు ఎదురైన అనుభవం గుర్తుకు వచ్చింది. అందుకే ఆయన గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఈటలకు గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి బీజేపీ అధిష్ఠానం పచ్చ జెండా ఊపింది. ఈటల బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్ నుంచి, అలాగే ఆయన సొంత నియోజకవర్గం నుంచీ కూడా పోటీలో దిగుతున్నారు. అదే విధంగా రేవంత్ కూడా గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. అలాగే ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా పోటీలో దిగనున్నారు. దీంతో గజ్వేల్ లో నిస్సందేహంగా కేసీఆర్ గడ్డుపరిస్థితిని ఎదుర్కోనున్నారు. ఇది చాలదన్నట్లు.. అమరుల కుటుంబాలకు చెందిన వారు కూడా కేసీఆర్ ను లక్ష్యం చేసుకుని వందల సంఖ్యలో గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ లు దాఖలు చేయాలని నిర్ణయించడంతో కేసీఆర్ కు వచ్చే ఎన్నికలు ఒకింత ఇబ్బందికరంగా మారాయనే చెప్పాలి. అసలు ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండానే.. ఆయనను వ్యతిరేకించే వారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. వీరి సంఖ్య తక్కువగా ఏమీ లేకపోవడంతో బీఆర్ఎస్ పై ప్జా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నది అందరికీ తెలిసిపోయింది. దానికి తోడు తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండు సార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టినాం ఒక సారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇద్దాం అన్న భావన మెజారిటీ ప్రజలలో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-facing-hard-time-39-163853.html