మహిళా రిజర్వేషన్ల బిల్లు.. క్రెడిట్ కోసం బీజేపీ మాస్టర్ స్ట్రాటజీ!
Publish Date:Apr 11, 2026
Advertisement
దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చట్టంలో అవసరమైన సవరణలు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. మూడు రోజుల్లోనే దీనికి ఆమోద ముద్ర వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మహిళా రిజర్వేషన్లను 2029 సాధారణ ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురావాలన్న నిర్ణయంతో ఉంది. దీనివల్ల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు, నియోజకవర్గాల పునర్విభజనకు కూడా బీజేపీ సర్కార్ సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను 50 శాతం వరకు పెంచాలనే యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపారు. మహిళా రిజర్వేషన్లకు అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నప్పటికీ, అమలు చేసే విధానంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పార్టీలు 2011 గణాంకాల కంటే, 2026 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెంచడం వల్ల దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనల నేపథ్యంలో 2026 లెక్కల ప్రాధాన్యతను విపక్షాలు గట్టిగా చెబుతున్నాయి. పార్లమెంటులో మహిళ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి, మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2029 ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే ఈ చట్ట సవరణ బిల్లు భారత ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ కీలక బిల్లుపై పార్లమెంటులో చర్చ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
http://www.teluguone.com/news/content/womens-reservation-bill-45-217172.html




