మహిళా ఐఏఎస్‌లపై వచ్చిన అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నాం : మంత్రి సీతక్క
Publish Date:Jan 10, 2026
Advertisement
మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా వేదికలు అసభ్యంగా, అనుచితంగా, దూషణాత్మకంగా వార్తలు, వ్యాఖ్యలు చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం అని తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన మహిళా ఐఏఎస్ అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె అన్నారు. మహిళలు ఉన్నత స్థాయిలకు చేరితే వాటిని తట్టుకోలేని ఫ్యూడల్ మానసికతే ఈ రకమైన దుష్ప్రచారాలకు మూలమని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందని, అటువంటి పరిస్థితుల్లో మహిళా అధికారులను కించపరిచే వ్యాఖ్యలను, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారాన్ని సహించబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలను ధైర్యంగా, నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, వారి వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ తరహా దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలపై ద్వేషం, అవమానంతో కూడిన ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/women-ias-36-212353.html





