కన్నీళ్లు పెట్టించే కథ…సెల్ఫీ వీడియోతో ముగిసిన జీవితం!
Publish Date:Apr 30, 2026
Advertisement
మరిదితో కాపురం చేయాలని భర్త, అత్తమామలు ఒత్తిడి... సెల్ఫీ వీడియో తీసి వివాహిత ఆత్మహత్య.. బెంగళూరు శివార్లలో వెలుగుచూసిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టిన వేధింపులు భరించలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. తన మరణానికి గల కారణాలను వివరిస్తూ, కన్నీళ్లతో ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి డ్యామ్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు, వరకట్న పిశాచి కోరలకు అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. దొడ్డబళ్లాపుర తాలూకా సోతెనహళ్లికి చెందిన పుష్ప (23)కు ఏడేళ్ల క్రితం తపసీహళ్లికి చెందిన వేణుతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పుష్ప తల్లిదండ్రులు తమ స్తోమతకు తగ్గట్టుగా భారీగానే కట్నకానుకలు సమర్పించారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే భర్త, అత్తమామల అసలు రూపం బయటపడింది. అదనపు కట్నం తేవాలని ఆమెను శారీరకంగా, మానసికగా హింసించడం మొదలుపెట్టారు. పుష్ప ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో తన ఆవేదననంతా వెళ్లగక్కింది. భర్త వేణు తనను దారుణంగా వేధించడమే కాకుండా, తన సోదరుడు (మరిది)తో కలిసి ఉండాలని ఒత్తిడి చేసేవాడని పేర్కొనడం విస్తుగొలుపుతోంది. మరో వివాహం చేసుకోవాలనే దురాశతో తనను వదిలించుకోవడానికి భర్త యత్నించాడని, ఒకానొక దశలో ఆహారంలో విషం కలిపి తనను చంపే ప్రయత్నం కూడా చేశారని ఆమె కన్నీటి పర్యంతమైంది. అంతేకాకుండా, పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తికి సంబంధించిన పత్రాల విషయంలో కూడా ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన పుష్ప, బెంగళూరు సమీపంలోని విశ్వేశ్వరయ్య పిక్ అప్ డ్యామ్ వద్దకు చేరుకుని, తన సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసిన అనంతరం నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కట్నం కోసమే కాకుండా, అమానవీయమైన కోరికలతో పుష్పను నరకయాతనకు గురిచేశారని వారు ఆరోపిస్తున్నారు. చదువుకున్న వారు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పుష్ప రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా భర్త వేణును, మామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/woman-suicide-36-218663.html





