చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. చైనా మైండ్ బ్లాక్!
Publish Date:Apr 30, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో విస్తారంగా ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ (ఆర్ఈఈ) నిల్వలను వెలికితీయడం ద్వారా, ఈ రంగంలో చైనాకు ఉన్న గుత్తాధిపత్యాన్ని భారత్ సవాల్ చేయగలదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ అరుదైన ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయనీ.. వీటిని సమర్థవంతంగా వెలికితీస్తే చైనాపై ఆధారపడటాన్ని భారత్ పూర్తిగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న దాదాపు 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంలోని ఇసుక తిన్నెల్లో మోనజైట్, ఇల్మెనైట్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. వీటి ద్వారా లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గ్రీన్ ఎనర్జీ విప్లవానికీ, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి వెన్నెముక వంటివి. ఈ సంపదను వెలికితీసే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్‌లో నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనాకు ప్రస్తుతం ప్రపంచ రేర్ ఎర్త్ మార్కెట్‌లో 80 శాతానికి పైగా వాటా ఉంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా అమెరికా, యూరప్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఉన్న నిక్షేపాలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐఆర్ఈఎల్ వంటి విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్లను ఏపీలో నెలకొల్పాలని సీఎం యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఆర్థిక పరమైనదే కాకుండా, వ్యూహాత్మకమైనది కూడా. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో స్వయం సమృద్ధి సాధించడం వల్ల భారత్ రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. అంతే కాకుండా, ఈ ఖనిజాల వెలికితీత, శుద్ధి ప్రక్రియ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీ తీర ప్రాంతాన్ని 'మినరల్ హబ్'గా మార్చేందుకు అవసరమైన కొత్త మైనింగ్ పాలసీని కూడా ప్రభుత్వం తీసుకువచ్చే అవకాశం ఉంది. చైనాకు ధీటుగా ఎదగాలంటే ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయడం మాత్రమే కాకుండా, వాటిని తుది ఉత్పత్తులుగా మార్చే పరిశ్రమలను ఇక్కడే నెలకొల్పాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ విజయవంతమైతే, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధంలో భారత్ ఒక కీలక శక్తిగా అవతరించడం ఖాయం.
http://www.teluguone.com/news/content/chandrababus-master-plan-36-218666.html





