సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ.. చిరు హాజరుపైనే సర్వత్రా ఆసక్తి
Publish Date:Dec 25, 2024
Advertisement
అల్లు అర్జున్ అరెస్టు తదననంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొందరు సినీ ప్రముఖులు గురువారం ( డిసెంబర్ 26) ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీతో సమస్య పరిష్కారం అవుతుందా? లేక మళ్లీ కొత్తగా మొదలౌతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు సీఎం రేవంత్ తో భేటీకి వెళ్లే సినీ ప్రముఖులు ఎవరు? ఎంతమంది? అన్నదానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. అల్లు అర్జున్ అరెస్టు తరువాత వరుసగా జరిగిన సంఘటనలతో అసలు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోతుందా అన్న స్థాయిలో చర్చలు జరిగాయి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సినీ సెలబ్రిటీలు అరెస్టై మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి క్యూకట్టడాన్ని ఆక్షేపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించడానికి ముందుకు రాని సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి క్యూకట్టడం ఏమిటని నిలదీశారు. అసెంబ్లీ వేదికగానే సినీ పరిశ్రమ తీరుపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక రాష్ట్రంలో కొత్త సినిమాల విడుదలకు ప్రీమియర్ షోలకు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఉండవని కుండబద్దలు కొట్టారు. ఇది మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసేసింది. సంక్రాంతి అంటేనే సినీమల సీజన్. అటువంటి కీలకమైన తరుణంగా సినిమాల టికెట్ ధరలు పెంపునకు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఉండవు అంటే సినీ పరిశ్రమ సంక్షోభంలో పడుతుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ డీసీ చైర్మన్ గా నియమించిన దిల్ రాజు సంక్షోభ పరిష్కర్తగా, ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడమే కాకుండా, కొత్త సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవ వల్లే సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడానికి అంగీకరించారు. అయితే గద్దర్ అవార్డుల మార్గదర్శకాల విషయంలో సినీ పరిశ్రమ స్పందన పట్ల రేవంత్ లో ఆగ్రహం ఉంది. అలాగే గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఇచ్చిన గౌరవం, ప్రస్తుతం సీనీ పరిశ్రమ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రిగా తనకూ దక్కడం లేదన్న భావన కూడా రేవంత్ లో ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి తన వ్యాఖ్యలను ఖండించడానికే అన్నట్లుగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్నీ కాంగ్రెస్ తప్పుపడుతోంది. అన్నిటికీ మించి సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తరువాత అల్లు అర్జున్ స్పందించిన తీరు పట్ల సినీ పరిశ్రమ వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ రోజు సీఎంతో భేటీకి సీని దిగ్గజాలలో ఎవరెవరు హాజరౌతారన్న దానిపైనా క్లారిటీ లేదు. మెగా స్టార్ చిరంజీవి ఈ భేటీకి దూరంగా ఉండనున్నారని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదే జరిగితే.. ఈ భేటీ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అంటున్నారు. మొత్తానికి రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ సమస్య పరిష్కరిస్తుందా లేదా సమస్యను మళ్లీ కొత్తగా ప్రారంభమయ్యేలా చేస్తుందా చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/will-chiru-join-cine-celebrities-meet-cm-revanth-39-190321.html