ఈ సారి అయినా అద్దంకికి దక్కేనా ?
Publish Date:Mar 4, 2025
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల క్రతువు ఇంకా పూర్తి కాలేదు. రెండు ఉపాధ్యాయ,ఒక పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని(కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,మెదక్) బీజేపీ కైవసం చేసుకుంది. కమలం పార్టీ బలపరిచిన మల్క కొమురయ్య విజయకేతనం ఎగరేసారు. రెండో స్థానం (నల్గొండ, వరంగల్, ఖమ్మం,) స్థానాన్ని పీఆర్టీయు అభ్యర్ధి శ్రీపాల్ రెడ్డి గెలుచు కున్నారు. పట్టభద్రుల స్థానం ఫలితం ఇంకా తేలలేదు. కానీ, ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం, మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. ఈ ఐదు స్థానాలు భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం మర్చి 3 నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం అయితే, నాలుగు స్థానాలు కాంగ్రెస్, ఒక స్థానంలో బీఆర్ఎస్’ (ఏకగ్రీవంగా) గెలిచే అవకాశం వుంది. అయితే, చివరకు ఏమిజరుగుతుతుంది అనేది, ఎవరి వ్యూహం ఏమిటో తెలిసే వరకు చెప్పలేము. అలాగే అభ్యర్ధులు ఎవరన్న విషయంలోనూ, ఉహాగానాలే కానీ, క్లారిటీ లేదు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు కొదవలేదు. ఇంచుమించుగా డజను మందికి పైగానే పోటీ పడుతున్నారు. అయితే, మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా, ప్రతిసారీ ‘సారీ’ తోనే సరిపెట్టుకుంటున్న అద్దంకి దయాకర్ కు ఈసారయినా అవకాశం దక్కుతుందా? చట్ట సభలో కాలు పెట్టాలనే ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందా? అన్న భేతాళ ప్రశ్న ఇప్పడు రాజకీయ వర్గాల్లో సమాధానం చిక్కని ప్రశ్నగా చక్కర్లు కొడుతోంది. నిజానికి, తెలంగాణ రాజకీయాల్లో పరచయం అవసరం లేని కొద్దిమంది నాయకుల్లో,అద్దంకి దయాకర్ ఒకరు. ఏ టీవీ ఆన్ చేసినా, ఏ యూట్యూబ్ చూసినా, హాయ్ ..అంటూ పలకరించే పోలిటిషియన్ అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఏ మూలాన ఉన్నా, కొండకచో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నా, మీడియాకు అందుబాటులో ఉండే కొద్ది మంది సీనియర్ రాజకీయ నాయకుల్లో దయాకర్ ఒకరు. అలాగే, విషయం ఏదైనా, విషయ పరిజ్ఞానంతో స్పందించగలిగిన కాంగ్రెస్ నాయకుల్లో అద్దంకి దయాకర్ ముందు వరసలో ఉంటారు. అలాగే, అద్దంకి దయాకర్ ను కండువా అవసరం లేని కాంగ్రెస్ నాయకుడుగా పేర్కొంటారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు గాంధీలతో మంచి సాన్నిహిత్యం ఉన్న నేతల్లోనూ దయాకర్ ముందు వరసలోనే ఉంటారు. మాలమహానాడు, తెలంగాణ జెఏసీ ఉద్యమాల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన దయాకర్, కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసిన కొద్ది మంది ఉద్యమ నాయకుల్లో ఒకరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే క్రమంలో, ఆ తర్వాత అద్దంకి దయాకర్ మీడియాలో ఓ వెలుగు వెలిగారు. రేవంత్ రెడ్డి కోటరీలో కీలక నేతగా నిలిచారు. ఒకటి రెండు సందర్భాలలో, రేవంత్ రెడ్డి కోసం, ‘ఉంటే ఉండు లేదంటే ...’ వంటి వివాదస్పద వాఖ్యలు చేసి, సమస్యల్లో చిక్కుకున్నా రేవంత్ రెడ్డి చేయి వదలలేదు. రేవంత్ రెడ్డికి మాటల కవచంగా నిలిచారు. నీడల ఆయన వెంట నడిచారు. అంతే కాదు, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ, గాంధీ కుటుంబంతో ముఖ్యంగా రాహుల్ గాంధీతో సన్నిహిత సంబందాలున్నాయి. అలాగే, ఒకటి రెండు సందర్భాలలో దయాకర్ వలన తనకు సమస్యలు వచ్చినా రేవంత్ రెడ్డి కూడా ఆయన చేయి వదల లేదు. అయితే, అదేమిటో కానీ, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు, చట్టసభలో కలుపెట్టాలనే ఆయన కోరిక మాత్రం, ఇంత వరకు తీరలేదు. ఒకటికి, రెండుసార్లు నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మూడవసారి, 2024లో పార్టీ టికెట్ నోటిదాకా వచ్చి, చే ... జారిపోయింది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, వడ్డించే వాడు మన వాడు అయినప్పుడు, ఏ పంక్తిలో కూర్చుంటే ఏమిటి అన్నట్లు, ఎమ్మెల్ల్యే కాకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు తగిన పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అయితే, దయాకర్ ఒకటి నేను ఒకటీనా, (ఇద్దరం ఒకటే అని భావం) ఆయనకు మంచి పదవి ఇస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అయితే అదేమిటో కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 14 నెలలు పూర్తయినా, ఇంతవరకు దయాకర్ కు ఏ పదవీ దక్క లేదు. అంతే కాదు, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు, ఎమ్మెల్సీ, రాజ్యసభ టికెట్ సహా’ అనేక అవకాశాలు అందినట్లే అంది చేజారి పోయాయి.
ఈ నేపధ్యంలోనే, ఈ సారి అయినా అద్దంకి దయాకర్ ఆశ నెరవేరుతుందా? చట్ట సభలో కాలు పెట్టాలన్న ఆయన చిరకాల కోరిక నెరవేరుతుందా? అనేది, ఆసక్తికరంగా మారింది. అయితే, ఎప్పటిలానే ఇప్పడు కూడా, అద్దంకికి ఈ సారి టికెట్ పక్కా అనే ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతోంది. ఈ సారి కాకుంటే ఇక ఎప్పటికీ ‘సారీ’నే అనే మాట కూడా కాంగెస్ వర్గాల్లో వినవస్తోంది.
మరో వంక దయాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కాకుండా, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు, జానా రెడ్డి, కోమటి రెడ్డి ఇతర నాయకులను వ్యక్తిగతంగా కలిసి .. ప్లీజ్ .. ఈ ఒక్క సారికీ అడ్డురావద్దని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే , అంతిమంగా ఏమి జరుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి, ఇంకా భేతాళ ప్రశ్నగానే వుంది. ఊహకు అందడం లేదు. అందుకే, ఆయన సన్నిహితులు సైతం టికెట్ వచ్చి నామినేషన్ వేసే వరకు సస్పెన్సు కొనసాగుతుందని,భేతాళ ప్రశ్నకు సమాధానం చిక్కదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/will-addanki-gets-mlc-atleast-now-39-193846.html





