ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీపై పేటెంట్ ఎవరిది?
Publish Date:Mar 4, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. రిజల్ట్స్‌లో ట్విస్ట్ ఏటంటే టీడీపీ, జనసేనలు మద్దతిచ్చిన అభ్యర్ధి ఓటమి పాలైతే.. బీజేపీ అనుబంధ ఉపాధ్య సంఘం మద్దతిచ్చిన కేండెట్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతిస్తానన్నా ఎవరూ తీసుకోలేదు. అయినా సీన్‌లోకి వచ్చిన వైసీపీ నేతలు విజేతను తమ అభ్యర్ధిగా క్లెయిమ్ చేసుకుంటున్నారు.. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు తమ అభ్యర్ధే గెలిచారని చెపుతుండటం ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెల్లడైంది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో ఫలితం తేలకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్లతో పీఆర్టీయూ అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. అక్కడ కూటమి తరఫున రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు పదిహేను రోజుల ముందుగానే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఏ ఎన్నికకు సంబంధించి ప్రత్యేకంగా జనసేన, టీడీపీ నాయకులతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వంటివారు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కానీ, జనసేన నుంచి ఒకరు కూడా ఈ ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం. అదే సమయంలో కూటమి తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా.. బీజేపీ అడుగులు వేసింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి అసలు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ పోరును పట్టించుకో లేదు. పైగా.. స్థానిక నేతలు యాంటీ లైన్ తీసుకున్నారని.. రఘువర్మకు ప్రత్యర్థిగా ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ నేత లు మద్దతు ప్రకటించారని తెలిసి కూడా.. పురందేశ్వరి మౌనం పాటించారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కూటమిలో కేవలం టీడీపీ నాయకులు మాత్రమే రఘువర్మకు మద్దతు ప్రకటించగా, జనసేన పట్టించుకోకపోవడం, పై నుంచి పవన్ కల్యాణ్ ఆదేశాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో నాయకులు గాదెకు మద్దతు ప్రకటించడం వంటివి.. కూటమిలో లోపాలను ఫోకస్ చేశాయి. ఇక క్షేత్రస్థాయి కమల నాథులు కూడా.. గాదెకు మద్దతుగా బహిరంగ ప్రకటనలే చేశారు. ఈ పరిణామాలు కూటమి తరఫున పోటీ చేసిన రఘువర్మకు శాపంగా మారాయి. అయితే కేంద్ర, రాష్ట్ర మంత్రులు తన వెంటే ఉన్నారని.. ప్రభుత్వం ఉపాధ్యాయులకు మేలు చేస్తోందని ఆయన చెప్పినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ఫలితం తర్వాత, కూటమి నాయకులు మిత్రధర్మంపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతు న్నది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వైసీపీ మద్దతు ఇస్తామన్నా.. గాదె శ్రీనివాసులు తిరస్కరించారు. అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతా! అంటూ.. ఆయన తిరస్కరించడం గమనార్హం. ఒకవేళ వైసీపీ మద్దతు కనుక తీసుకుని ఉంటే తమ కొంప మునిగేదని గాదె వర్గీయులు అంటుండటం గమనార్హం. వారు అంత స్పష్టంగా చెపుతున్నా వైసీపీ నేతలు విజేతను తమ అభ్యర్ధిగా ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ అనుబంధ సంస్థ మద్దతుతో గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు కూటమి అభ్యర్ధే అని టీడీపీ నేతలు అంటుండటం విశేషం.
http://www.teluguone.com/news/content/uttarandhra-teachers-mlc-39-193844.html





