పెంపుడు కుక్క కోసం అంబులెన్స్ బుక్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు!
Publish Date:Mar 4, 2025
Advertisement
ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించబడన సేవల దుర్వినియోగం ఏ విధంగా చూసినా నేరమే. అపరాధమే. అందులోనూ అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లపై సైరెన్ తో పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్ ను తమ స్వార్థం కోసం ఇష్టారీతిగా ఉపయోగించుకుంటున్న సంఘటనలను ఎవరైనా సరే ఖండించాల్సిందే. అంబులెన్స్ టోయ్ టోయ్ టోయ్ అంటూ రోడ్ల మీద పరుగులు తీస్తుంటే.. వాహనదారులు తన వాహనాలను పక్కకు తీసి మరీ దారి ఇస్తుంటారు. సిగ్నల్స్ దగ్గర కూడా అంబులెన్స్ కోసం వాహనాలు గ్రీన్ సిగ్నల్ పడినా కదలకుండా ఆగిపోతాయి. అలాంటి అంబులెన్స్ లను తమ జల్సాల కోసం, సరదాల కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఖాళీ అంబులెన్స్ ను సైరెన్తో స్పీడ్ గా నడిపి సిగ్నల్ క్రాస్ చేసి తాపీగా చాయ్ తాగే అంబులెన్స్ డ్రైవర్లను చూశాం. సర్వీస్ ఆటోలా రోడ్డు పక్కన ఆపి.. ప్యాసింజర్లను ఎక్కించుకుని సైరెన్ వేసుకుని సర్వీస్ చేసి డబ్బులు దండుకున్న సంఘటనలూ తెలుసు. ఓ వ్యక్తి తన కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి ఏకంగా అంబులెన్స్ ను బుక్ చేసుకుని సైరెన్ తో రోడ్ల మీద జనాలకు అదరట్టిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేయడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లడంతో పోలీసులు ఇటువంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ డ్రైవ్ లో భాగంగా మంగళవారం నాడు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో సైరన్ తో వేగంగా వెడుతున్న అంబులెన్స్ ను ఆపి చెక్ చేశారు. ఆ తనిఖీలో దిగ్భ్రాంతి గొలిపేలా అంబులెన్స్ లో ఓ కుక్కను తరలిస్తుండటం బయటపడింది. ఆ కుక్కను ఎక్కడికి తీసుకెడుతున్నారన్నది ఆరా తీస్తే.. ఆ కుక్కకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు మదీనగూడలోని ఐవీ హాస్పిటల్ కు తీసుకువెడుతున్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ అంబెలెన్స్ ను సీజ్ చేసి, అంబులెన్స్ ఓనర్ పై కేసు నమోదు చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని మాత్రమే అంబులెన్స్‌లో సైరన్ వేసుకుని తరలించాల్సి ఉంటుందని, ఖాళీగా వెళ్లే సమయంలో కూడా కొంతమంది సైరన్లు వేసుకుని వెళ్తుండడం చట్ట విరుద్దమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అలాగే పెంపుడు జంతువులను తరలించేందుకు అంబులెన్స్ లు వాడటం కూడా చట్టరీత్యానేరమని చెప్పారు. మొత్తం మీద పెంపుడు కుక్కను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
http://www.teluguone.com/news/content/ambulance-for-pet-dog-39-193848.html





