కేంద్రంపై యుద్ధం తుస్సుమన్నట్లేనా? వరి ఉచ్చు బిగిసుకుందా?
Publish Date:Dec 27, 2021
Advertisement
ఆడలేక మద్దెల ఓడన్నాడు..ట వెనకటికి మహా నాట్య విద్వాంసుడు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉందని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ధాన్యం విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కేంద్రం ప్రభుత్వంతో పోరాడకుండా ఎర్రవల్లి పర్యటన దేనికంటూ వ్యవసాయశాఖ అయన ప్రశ్నించడం చూస్తుంటే, అదే సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు. కేంద్రంపై పోరాటం చేస్తాం అని ప్రగల్బాలు పలికి, యుద్దమంటూ వంతుల వారీగా ఢిల్లీ వెళ్లి వచ్చిన తెరాస నాయకులు తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ను తప్పు పడుతున్నారని అంటున్నారు. ఉత్తర కుమార ప్రతిజ్ఞలు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు చేతులు ఎత్తేసినట్లే ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వరి ధాన్యం విషయంలో, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది, ఒప్పందాలు కుదుర్చుకుంది. వేసంగిలో, బాయిల్డ్ రైస్ ఇవ్వనే ఇవ్వమని లిఖిత పూర్వకంగా కేంద్రానికి లేఖ ఇచ్చింది, రాష్ట్రం ప్రభుత్వం. ప్రస్తుత వానకాలం పంట పూర్తిగా కొంటామని కేంద్ర పభుత్వం సభా ముఖంగా హామీ ఇచ్చినా, నమ్మకం లేదని, లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే ఢిల్లీ వదిలేదని ప్రగాల్బాలకు పోయింది తెరాస మంత్రులు. అక్కడినుంచి పారిపోయి వచ్చింది మంత్రి నిరంజన్ రెడ్డి, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీనీ, రేవంత్ రెడ్డి ఎలా తప్పు పడతారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదలా ఉంటే, నిరంజన్ రెడ్డి పోయిన పరువు, ప్రతిష్టలను పునరుద్ధరించుకునెందుకో ఏమో, మరో విచిత్ర వాదాన్ని తెర మీదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర మరిచి బీజేపీకి సహకరిస్తోందని, కాంగ్రెస్ త్వరలోనే బీజేపీలో విలీనం అవుతుందని మంత్రి చేసిన వ్యాఖ్య ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనే కాదు రాష్ట్రంలోనూ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీనే, కేంద్రంతో పోరాడే విషయాల్లో కేంద్రంతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. అలాగే, రాష్ట్ర సమస్యల విషయంలో రాష్ట్రంలో పోరాడుతోందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా పార్లమెంట్లో తెరాస ఎంపీల పోరాటానికి కాంగ్రెస్ ఎందుకు కలిసిరాలేదని మంత్రి ప్రశ్నించడం,రాహుల్, సోనియా ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని అడగడం మరీ విడ్డూరంగా ఉందని అంటున్నారు.నిజంగా, తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమైతే, స్పష్టమైన ఎజెండాతో రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లవలసిందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా తెరాస ప్రభుత్వం వరి ఉచ్చులోంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని, విశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-trs-stop-protest-on-paddy-crop-issue-39-129174.html





