అగజానునికి... అగ్రికల్చర్ కి లింకేంటో తెలుసా?
Publish Date:Sep 5, 2016
Advertisement
వినాయక చవితి... కేవలం ఒక్క రోజు పండుగ కాదు. చవితినాడు మొదలై చతుర్ధశి దాకా సాగే సుదీర్ఘ పండగ! వినాయక నవరాత్రులు అంటారుగాని పది లేదా పదకొండు రోజులు కొనసాగే అతి పెద్ద పండుగ! ఇన్ని రోజులు నడిచే మరో పండగ ఏదీ హిందువులకు లేదు మన దేశంలో! అంటే... అందరికంటే ఎక్కువగా పండుగలు చేసుకునే మనకే లేదంటే... ఇక భూమ్మీద మరెవరికి ఇంత కాలం కొనసాగే పండగ లేదన్నట్టే! మొత్తానికి ప్రపంచంలో అతి సుదీర్ఘ పండగ... వినాయక ఉత్సవం! వినాయక చవితి పండుగ ఎక్కువ రోజులు కొనసాగటం మాత్రమే విశేషం కాదు! గణపతికి సంబంధించిన ప్రతీదీ ప్రత్యేకమే! మామూలుగా విఘ్నేశ్వరుని పార్వతీ తనయుడు, శివ నందనుడు, షణ్మఖు సోదరుడు అంటుంటాం. అలాగే, ఆయన మూషికాసురుని సంహరించాడని, విఘ్నాలకి అధిపతి అని పురాణ కథలు చెప్పుకుంటూ వుంటాం. కాని, వీటన్నిటికంటే విశేషమైన కోణం మరొకటి వుంది గణాధిపతిలో! ఆయన రూపం వ్యవసాయానికి , వ్యవసాయ ఆధారిత జీవనశైలికి సంకేతం అని మీకు తెలుసా? భారతీయ పండుగలు కేవలం ఛాందసమైన విశ్వాసాల ఆధారంగా ఏర్పడ్డవి కావని నిరూపించే మరో మహోన్నత పర్వం వినాయక చవితి! ఈ పండుగలో భక్తి మాత్రమే కాక ప్రకృతి పట్ల ప్రేమ కూడా అణువణువునా తొణికిసలాడుతుంది!
గణపతి కేవలం పురాణాల్లో చెప్పిన ఒకానొక దేవుడు మాత్రమే కాదు. ఆయన్ని పూజించని హిందువు ఎవ్వరూ ఉండరు! అందుక్కారణం ఏ పూజ చేసినా ప్రథమ పూజ అందుకోవాల్సింది ఆయనే! అంత ప్రాముఖ్యత గణపతికి వుండటానికి కారణం ఆయనతో అత్యంత సామాన్య జనానికి కూడా వున్న సంబంధం , అనుబంధమే!. వినాయక చవితి వచ్చేది భాద్రపద శుక్ల పక్షంలో. అంటే వర్షాలు పడుతూ రైతులు నాట్లు వేసే సమయమన్నమాట! అందుకే, మన ఋషులు ఆయన రూపాన్ని ప్రత్యేకంగా మట్టితో తయారు చేయమన్నారు! గణపతి భూ స్వరూపుడు! జగన్మాత అయిన పార్వతి నలుగు పిండితో, అంటే భూ అంశతో , ఆయన్ని రూపుదిద్దుతుంది! ఇలా భూ తత్వం గల వినాయకుడ్ని పూజిస్తే పంటలు సమృద్దిగా పండుతాయని మన వారి విశ్వాసం!
ఇక గజాననుడైన వినాయకుడికి ఒక దంతం వుంటుంది. అందుకే , ఆయన ఏకదంతుడని అంటారు! ఇది వ్యవసాయ దృష్టితో చూసినప్పుడు నాగలికి సంకేతం! నాగలి వుంటేనే పంటలు పండేది! కడుపులు నిండేది!. నాగలి మాత్రమే కాదు గణపయ్య రూపంలో తూర్పార పట్టే చేటలు కూడా వుంటాయి! అవ్వే ఆయన పెద్ద పెద్ద ఏనుగు చెవులు! ఇంకాస్త కిందకి వస్తే లంబోదరుడైన ఆయన పెద్ద పొట్ట ధాన్యం నిలువ చేసే గాదెలకు సంకేతం. అంతే కాదు, తాను ఎంత భారీగా వున్నా చిట్టి ఎలుకని మూషిక వాహనుడు ఎక్కడం వెనుక కూడా వ్యవసాయ కోణం వుంది! పంటల్ని పాడు చేసే ఎలుకల్ని వినాయకుడు తన అధీనంలో వుంచుకుంటాడన్నమాట! ఎలుకల్ని నిలువరించే పాముల్ని కూడా గణాధిపతి తన కడుపుకి మొలతాడుగా కట్టుకుంటాడు!
గణేశుడి రూపంలోని సంకేతమే కాదు ఆయన పూజ కూడా ప్రకృతితో ముడిపడిందే! 21 రకాల పత్రాలతో పచ్చగా సాగిపోతుంది పార్వతీ తనయుడి ఆరాధన! ఈ రకరకాల పత్రాలన్నీఊళ్లలో పంట, పొలాల పక్కనే దొరుకుతాయి. అంటే... వ్యవసాయం బావుండాలని పూజ చేస్తూ అదే పొలాల్లో దొరికే పూలు, పత్రితో పూజించటం అన్నమాట!. పదకొండు రోజులు పూజలందుకున్న గణనాథుడు నిమజ్జనానికి గంగమ్మ వద్దకు వెళతాడు! ఇది కూడా వ్యవసాయానికి సంకేతమే! మట్టిని దున్ని పంటలు పండించుకుని రకరకాల పత్రాలు, పూలు మొలిచిన తరువాత ఏం చేస్తాం? కొత్త పంట వేసుకునే ముందు నిండుగా నీళ్లతో మడులన్నీ నింపేస్తాం! అచ్చం అలాగే, మట్టితో చేసిన మహాగణపయ్యని నీళ్లలో నిమజ్జనం చేసి నీటిని పావనం చేస్తాం!
http://www.teluguone.com/news/content/vinayaka-chavithi-celebrations-45-66075.html





