కలామ్ కలల కోసం... కబాలి రంగంలోకి దిగుతాడా?
Publish Date:Sep 5, 2016
Advertisement
రజినీకాంత్, రాజకీయాలు... ఈ రెండు పదాల కాంబినేషన్ ఇప్పటిది కాదు! తలైవా పాలిటిక్స్ లోకి వచ్చి తాట తీస్తాడని ఆయన అభిమానులు ఎప్పుట్నుంచో ఆశిస్తున్నారు! రమ్మని నినదిస్తున్నారు! కాని, కబాలి కరుణించలేదు... ఈ మధ్యే మన సీపీఐ నారాయణ పవన్ కళ్యాణ్ గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. వస్తే ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలి. లేదంటే రజినీకాంత్ లా ఇంట్లో కూర్చోవాలి అన్నారు! అంటే.... చాలా వరకూ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాడని డిసైడ్ అయిపోయారన్నమాట. అది నిజం కూడా. జనం సైతం ఈ మధ్య రజినీ రాజకీయాల్లోకి రాడులే అనేసుకుంటున్నారు!
బాబా ఇక పాలిటిక్స్ కి బైబై చెప్పినట్టే అని అంతా అనుకుంటున్న టైంలో ఈ మధ్య చెన్నైలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ తో దివంగత కలామ్ అనుచరుడు పొన రాజ్ భేటీ అయ్యారు. ఈ పొన రాజ్ ఎవరు అంటారా? కలామ్ కాలం చేశాక ఆయన ప్రధాన అనుచరుడైన పొన రాజ్ ఓ పార్టీ స్థాపించారు. కలామ్ పేరుతో వుండే ఈ పార్టీ ఆయన ఆశయాలు, స్వప్నాలకి అనుకూలంగా పని చేస్తుందని చెప్పారు. గత తమిళనాడు ఎన్నికల్లో అయితే ఈ కలామ్ పార్టీ పోటీ చేయలేదు. కాని, ముందు ముందు చేసే అవకాశాలున్నాయి. ఆ క్రమంలోనే రజినీకాంత్ ని కలిశారు కలామ్ పార్టీ నేత పొన రాజ్!
రజినీకాంత్ ని పొన రాజ్ కలిసినంత మాత్రాన మన ముత్తు పాలిటిక్స్ కి పరుగెత్తుకు వస్తాడని అనుకోలేం. కాని, 2019 నాటికి తలైవా మనసు మారే ఛాన్స్ మాత్రం వుంది. ఇప్పటికే 65దాటిన ఆయన అప్పుడు హీరోగా సినిమాలు చేయటం ఆపేయ వచ్చు. అభిమానులు ఆయన్ని చూసేందుకు సిద్ధంగానే వున్నా ఏజ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి యాక్టింగ్ మానేసి వచ్చే జనరల్ ఎలక్షన్స్ నాటికి బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్సుల వైపు కదలొచ్చు!
ఇప్పటికే జయలలిత ఆరోగ్యం ఆందోళనకరంగా వుంటోందని సమాచారం. ఇంకో ద్రవిడ నాయకుడు కరుణానిది కూడా 90లలోకి వచ్చేసి మరీ పెద్దాయన అయిపోయాడు. ఆయన రేంజ్లో చక్రం తిప్పే సీన్ ఆయన కొడుకులు స్టాలిన్, అళగిరికి లేదని ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి నిజంగా రజినీకాంత్ కోరుకుంటే తమిళ సీఎం పదవి ఆయనకు స్వాగతం పలుకుతున్నట్టే!
ఎన్ని పాజిటివ్ సిగ్నల్స్ వున్నా రజినీకాంత్ తొందరపడి రాజకీయాల్లోకి వచ్చి విజయ్ కాంత్, మన చిరంజీవి లాంటి వాళ్ల లాగా విమర్శలు, ఓటములు వంటివన్నీ భరిస్తాడా? లేక హ్యాపీగా ఓపిక వున్నంత కాలం సినిమాలు చేసి హిమాలయాలకు వెళ్లిపోతాడా? వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కలామ్ అనుచరుడు పొన రాజ్ కబాలీతో మీటింగ్ పెట్టడం... కొంత ఆసక్తికర పరిణామమే!
http://www.teluguone.com/news/content/super-star-rajinikanth--45-66076.html





